ఎసి వాడారని భార్యను, కొడుకును చంపాడు
అంగమాలి: వద్దని చెప్పినా ఏసీ వాడారని మండిపడుతూ ఓ వ్యక్తి భార్యను, అనారోగ్యంతో ఉన్న కొడుకును అతి దారుణంగా చంపేశాడు. కేరళలోని అంగమలి ప్రాంతంలో ఈ దారుణ సంఘటన శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. 85 ఏళ్ల పాల్ పైనదతు అనే వృద్ధుడు రైల్వేశాఖలో పనిచేసి రిటైర్ అయ్యాడు.
గత కొన్ని రోజులుగా ఏసీ విషయమై పాల్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కరెంటు బిల్లు ఎక్కువగా రావడంతో ఏసీ వాడకూడదని పాల్ తన కుటుంబసభ్యులను హెచ్చరించాడు. అయితే అనారోగ్యంతో ఉన్న 54 ఏళ్ల కుమారుడి కోసం పాల్ భార్య గత రాత్రి ఏసీ ఆన్ చేసింది.

దీంతో ఆగ్రహానికి గురైన పాల్ పదునైన ఆయుధంతో తన 74 ఏళ్ల భార్యను, కొడుకును దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఖతార్‌లో ఉన్న తన మరో కుమారుడికి ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపాడు. అంతేకాకుండా, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు.
దీంతో పాల్ కుమారుడు తమ బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పాల్‌ను అరెస్టు చేసి, విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పాల్ భార్యకు, కుమారుడికి ఇటీవలే గుండెకు చికిత్స జరిగింది. వారిని చంపిన తర్వాత పాల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. వృద్ధాప్యం కారణంగా అతను నిచ్చెన ఎక్కలేకపోయాడు.












Click it and Unblock the Notifications