బాంబు పేలుడు: రెండు కోట్ల ఫోన్ కాల్స్ స్కాన్
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చి స్ట్రీట్ బాంబు పేలుడు జరిగి నేటికి ఒక సంవత్సరం అవుతున్నది. బెంగళూరు సీసీబీ పోలీసులు, తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు కేసు దర్యాప్తు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ చిక్కలేదు.
2014 డిసెంబర్ 26వ తేది రాత్రి 8.33 గంటల సమయంలో చర్చి స్ట్రీట్ సమీపంలో బాంబు పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో చెన్నైకి చెందిన ఓ మహిళ మరణించింది. ముగ్గురికి తీవ్రగాయాలైనాయి.
అప్పటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు సీసీబీ పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించకపోవడంతో కేసును ఎన్ఐఏ అధికారులకు అప్పగించారు. అయితే ఎన్ఐఏ అధికారులు ఇప్పటి వరకూ ఒక్క క్లూ కనిపెట్టలేకపోయారు.

చర్చి స్ట్రీట్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి అధికారులు రెండు కోట్లకు పైగా మొబైల్ ఫోన్ కాల్స్ స్కాన్ చేశారు. అయినా ఫలితం శూన్యం. 25 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేశాయి. అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.
చర్చి స్ట్రీట్ బాంబు పేలుడు వెనుక సిమి ఉగ్రవాదుల హస్తం ఉందని ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని భట్కల్ లో పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.
బెంగళూరు బాంబు పేలుడు కేసుతో వారికి సంబంధం లేదని వెలుగు చూడటంతో విడిచిపెట్టారు. అయితే పాట్నా, బెంగళూరు చర్చి స్ట్రీట్ బాంబు పేలుడుకు ఉపయోగించిన పేలుడు పదార్థాలు ఒక్కటే అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications