నిర్భయ తరహాలో ఘటన.. బస్సులో మహిళపై అత్యాచారం.. చెరకు తోటలో దాక్కున్న నిందితుడు
మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ షాకింగ్ ఘటన వింటే 2012 డిసెంబర్ లో దిల్లీ నడిబొడ్డులో జరిగిన నిర్భయ ఘటన గుర్తుకువస్తుంది. 2012లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు పుణెలో ఇలాంటి ఘటనే జరిగింది. పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సులో యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. అదికూడా పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలోనే ఈ దారుణం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. యువతిపై అత్యాచారం చేసిన దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అతడు.. ఓ చెరకు తోటలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో డ్రోన్లు, జాగిలాలతో అన్వేషణ సాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఏం జరిగింది..?
పుణేలోని స్వర్‌గేట్ బస్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. పుణేలోని ఇళ్లలో పని చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున ఆమె స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్‌గేట్ బస్టాండ్‌లో బస్సు కోసం వేచిచూస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను గమనించిన ఓ వ్యక్తి అక్కడికి వచ్చి బస్సు ముందు ఉందంటూ తీసుకెళ్లాడు. అక్కడ అంతా చీకటిగా ఉండగా.. బస్సులో ప్రయాణికులు నిద్రపోతున్నారని.. అందుకే లైట్లు ఆన్ చేయలేదని మహిళను నమ్మించాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఎనిమిది క్రైమ్ బ్రాంచ్ బృందాలు ఉన్నాయి. తాజాగా నిందితుడి ఫొటోను విడుదల చేసిన పోలీసులు.. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
చెరుకు తోటలో నిందితుడు..
నిందితుడు చెరకు తోటలో దాక్కున్నట్లు గుర్తించిన పోలీసులు.. స్నిఫర్ డాగ్‌లు, డ్రోన్లను వినియోగించారు. చెరకు మొక్కలు 10 అడుగుల ఎత్తు వరకు పెరగడంతో కాలినడకన వెతికేందుకు కష్టంగా ఉన్న నేపథ్యంలో డ్రోన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూణేలో శాంతి భద్రతలు క్షీణించాయని.. రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డాయి.












Click it and Unblock the Notifications