35 వేల రూపాయల ధర పలికిన నిమ్మకాయ.. ప్రత్యేకత ఇదే!!
ప్రస్తుతం నిమ్మకాయ బయట మార్కెట్లో ఒక్కొక్కటి పది రూపాయల ధర పలుకుతుంది. ఇక ఎండాకాలంలో నిమ్మకాయల ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నిమ్మకాయలను కేవలం త్రాగటానికి మాత్రమే కాకుండా, పూజలలోనూ ఉపయోగిస్తారు. అయితే ఒక నిమ్మకాయకు తాజాగా ఊహించినంత ధర పలికింది.
ఏకంగా 35 వేల రూపాయలు చెల్లించి ఒక నిమ్మకాయను కొనుగోలు చేశారంటే మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇది మాత్రం నిజం. ఈ సంఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా శివగిరి గ్రామ సమీపంలోని పాత పూసయ్య ఆలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాయి.

అనంతరం ఆలయ ఆచారాల ప్రకారం భక్తులు శివుడికి సమర్పించిన నిమ్మకాయలు, పండ్లతో పాటు ఇతర వస్తువులను వేలం పెట్టారు. ఈ వేలం పాటలో స్వామివారికి సమర్పించిన అనేక వస్తువులను దక్కించుకోవటం కోసం స్థానికులు పోటీ పడ్డారు. ఈ వేలంలో సుమారు 15 మంది భక్తులు పాల్గొన్నారు.
ఈ రోడ్ కు చెందిన ఒక భక్తుడు గుడిలో దేవుడికి సమర్పించిన నిమ్మకాయను 35 వేల రూపాయలకు వేలంపాటలో దక్కించుకున్నాడు. నిమ్మకాయ కోసం ఆయన వేలంలో పోటీ పడ్డాడు.ఎట్టకేలకు నిమ్మకాయను దక్కించుకున్నాడు. వందలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ పూజారి పూజ నిర్వహించిన అనంతరం ఆ భక్తుడికి ఆ నిమ్మకాయను అందజేశారు.
శివుడికి పూజ చేసి, ఆయనకు సమర్పించిన నిమ్మకాయను వేలం పాటలో దక్కించుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల సంపద వృద్ధి జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఈ నిమ్మకాయ తమకు సర్వశుభాలను తెస్తుందని నమ్మి 35 వేల రూపాయలు ధర పెట్టి మరీ వేలంపాటలో దక్కించుకున్నాడు సదరు భక్తుడు.












Click it and Unblock the Notifications