జయకు చికిత్స ఇలా చేశారు: కేంద్రానికి లేఖ రాసిన గవర్నర్
జయలలితకు అపోలో ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలను గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అందించిన చికిత్స విషయంపై పూర్తి వివరాలు గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మంగళవారం గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
నవంబర్ 19వ తేదిన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు మార్చారని లేఖలో వివరించారు. అప్పటి నుంచి ఆమె రోజురోజుకు కోలుకుంటున్నారని వైద్యులు తనకు సమాచారం ఇచ్చారని వివరించారు.
డిసెంబర్ 4వ తేది తాను ముంబైలో ఉన్నానని ,ఆ సమయంలో జయలలితకు గుండెపోటు వచ్చిందని చెప్పడంతో తాను వెంటనే చెన్నై బయలుదేరి వెళ్లానని విద్యాసాగర్ రావు లేఖలో వివరించారు.

అదే రోజు రాత్రి అపోలో ఆసుపత్రికి వెళ్లానని, ఆసుప్రతి చీఫ్ జయలలితకు అందిస్తున్న చికిత్స విషయంపై తనకు పూర్తి వివరణ ఇచ్చారని కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. అయితే జయలలిత చికిత్స విఫలమై డిసెంబర్ 5వ తేది రాత్రి 11.30 గంటలకు మరణించారని కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు.
మెజారిటీ శాసన సభ్యులు పన్నీర్ సెల్వంను సీఎంగా ఎన్నుకున్నట్లు లేఖ ఇవ్వడంతో ఆయన చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయించామని వివరించారు. డిసెంబర్ 6వ తేదిన పన్నీర్ సెల్వం మంత్రుల జాబితాను తనకు ఇచ్చారని తెలిపారు.
అదే రోజు మంత్రుల జాబితాను పరిశీలించిన తరువాత తాను ఆమోదించి వారికి పంపించానని గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇస్తూ మంగళవారం మరో సారి లేఖ పంపించారు.
జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయని, వివరణ ఇవ్వాలని మద్రాసు హై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ నుంచి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం మరో సారి పూర్తి వివరాలు తెప్పించుకుందని తెలిసింది.












Click it and Unblock the Notifications