Snake: పామును కొరికి చంపిన బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఓ బాలుడు పామును నోటితో ముక్కలు ముక్కులు చేసి చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఆ తర్వాత బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ఫరూఖాబాద్ మద్నాపూర్ గ్రామంలో ఓ మూడేళ్ల బాలుడు పాము పిల్లను రెండు చేతులతో పట్టుకుని, నోటితో పామును ముక్కలుగా కొరికి చంపాడు. భయాందోళనకు గురైన అతని తల్లిదండ్రులు చనిపోయిన పాము పిల్లను ప్లాస్టిక్ సంచిలో ఉంచి చిన్నారితో ఆసుపత్రికి వెళ్లారు.
24 గంటల పాటు బాలుడిని అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు ఆదివారం అతడికి ప్రాణాపాయం లేదని ప్రకటించారు. దినేష్ కుమార్ కుమారుడు ఆయుష్ తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా కేకలు వేయడం ప్రారంభించాడు. అతని అమ్మమ్మ పరుగెత్తి, అతని నోటిలో చనిపోయిన పాముపిల్లను చూసి షాక్ అయింది.

"నేను దానిని తీసి అతని నోరు శుభ్రం చేశాను. అతనిని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని పిల్లల తల్లిదండ్రులను అప్రమత్తం చేశాను" అని బాలుడి అమ్మమ్మ సునీత చెప్పారు. ఏ పామో వైద్యులకు వివరించడానికి తమతో పాటు పాముని కూడా తీసుకెళ్లామని బాలుడి తండ్రి తెలిపారు. బాలుడికి అవసరమైన మందులు ఇచ్చామని జిల్లా ఆసుపత్రి ఎమర్జెన్సీలో డ్యూటీలో ఉన్న డాక్టర్ మహ్మద్ సలీం అన్సారీ తెలిపారు.
అతను బాగానే ఉన్నాడని, డిశ్చార్జ్ అయ్యాడని చెప్పారు."పాము విషం లేని జాతికి చెందినదిగా కనిపిస్తోంది" అని డాక్టర్ వివరించారు. బాలుడు పామును కొరికి చంపిన వార్త స్థానికంగా వైరల్ గా మారింది. బాలుడికి అది పాము అని తెలియదని తెలుస్తోంది. అది తాడు అనుకుని కొరికేసినట్లుగా బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా తమ కొడుకు సురక్షితంగా బయటపడడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
పాముల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో చాలా వరకు పాములు విషం లేనివని తెలిపారు. పాములు కావాలని కాటు వేయ్యవని.. వాటి హాని కలుగుతుందనే భావనలో అవి కాటు వేస్తాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications