షాకింగ్: కరోనా బారినపడి ఐదు రోజుల్లోనే మహిళ మృతి: ఆమె శరీరంలో 2 కరోనా వేరియంట్ల గుర్తింపు
బ్రస్సెల్స్: దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ కొత్తగా వెలుగుచూస్తున్న వేరియంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. మరోవైపు దేశంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటి నిబంధనలను క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
కాగా, బెల్జియం దేశంలో ఇటీవల కరోనా బారినపడిన ఓ 90ఏళ్ల మహిళ కేవలం ఐదు రోజులకే మృతి చెందింది. అయితే, ఆమెకు కరోనావైరస్ ఆల్ఫా, బీటా వేరియంట్స్ రెండూ సోకడం ఇప్పుడు వైద్యులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు కరోనా రెండు వేరియంట్లు ఆమె శరీరంలో ఉండటానికి కారణం ఏంటి? కరోనా ఆమె శరీరంలోకి ప్రవేశించాక రెండు వేరియంట్లుగా మారిందా? కరోనా సోకిన ఐదు రోజుల్లోనే చనిపోడానికి రెండు వేరియంట్లే కారణమా? ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసిన బెల్జియం పరిశోధకులు చివరకు దాని గురించిన కీలక విషయాలను తెలుసుకున్నారు.

ఒంటరిగానే నివసించే వృద్ధ మహిళ చనిపోయిన తర్వాత కూడా పరీక్షలు జరిపిన వైద్యులు.. ఆమె శరీరంలో ఆల్ఫా, బీటా వేరియంట్లను గుర్తించారు. రెండు వేరియంట్లు కూడా ఆమెకు బయటనుంచే సోకినట్లు కనుగొన్నారు. ఒకేసారి ఒకే వ్యక్తి నుంచి కాకుండా ఇద్దరు వ్యక్తుల నుంచి కరోనా సోకడంతో రెండు వేరియంట్లు ఆమె శరీరంలోకి ప్రవేశించాయని తెలుసుకున్నారు. అయితే, ఈ రెండు వేరియంట్లను తగ్గుకోలేకే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తేల్చారు.
ఆ మహిళ ఆక్సిజన్ స్థాయి మొదట్లో బాగానే ఉన్నా.. ఆరోగ్యంగా ఉన్న ఆమె పరిస్థితి వేగంగా క్షీణించిందని, అందువల్లే ఆమె కరోనా సోని ఐదు రోజులకే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. అంతేగాక, ఆమె వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదని తెలిపారు. మానవ శరీరం ఒకేసారి రెండు కరోనా వేరియంట్లను తట్టుకోవడం చాలా కష్టమని వైద్యులు తెలిపారు. ఇలా రెండు వేరియంట్లు సోకితే పరిస్థితి ఏంటనేదానిపై వైద్యులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications