రాహుల్‌పై రెడీ, దమ్ముంటే రా!: మోడీకి ఎఎపి విశ్వాస్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ఏఐసిసి ఉపాధ్యక్షురాలు రాహుల్ గాంధీ, గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీలకు సవాల్ విసురుతున్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో తాను అమేథీ నుండి రాహుల్ పైన పోటీ చేస్తానని చెప్పారు.
మోడీ కూడా ధైర్యం ఉంటే అక్కడి నుండి బరిలోకి దిగాలని సవాల్ చేశారు. తన గంట ప్రసంగంలో మోడీ యాభై నిమిషాలు రాహుల్ గురించి మాట్లాడటం మానుకోవాలని, ఆయన నిజంగా అమేథీ నుండి రాహుల్ విజయపరంపరకు ముగింపు పలకాలను కోరుకుంటే అక్కడి నుండి పోటీ చేయాలని మోడీని డిమాండ్ చేశారు.

రాహుల్, తాను, మోడీలు పోటీ చేస్తామని, ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దామన్నారు. రాహుల్ ఇతర నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని తనకు సమాచారం ఉందని, అతను ఎక్కడి నుండి పోటీ చేసినా ఆయనపై బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పదేళ్ల కాంగ్రెసు దుష్పరిపాలనను రాహుల్ నీతి సూక్తులతో దాచలేరన్నారు. లోకసభలో రాహుల్ ఇప్పటి వరకు ఒక్క ప్రశ్న అడగలేదని విమర్శించారు. ప్రధాన అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఎప్పుడు సభలో కనిపించరని మండిపడ్డారు.
కాంగ్రెసు కౌంటర్
రాహుల్ పైన పోటీ చేస్తానన్న కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ స్పందించింది. ఓటమిని రుచి చూడాలనుకుంటే ఎవరైనా అమేథీ నుండి పోటీ చేయవచ్చునని తెలిపింది. తమ పార్టీ ఎవరినీ తేలిగ్గా తీసుకోదన్నారు. తనకు తెలిసి రాహుల్ అమేథీ నుండే మరోసారి పోటీ చేస్తారని కాంగ్రెసు అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ చెప్పారు.












Click it and Unblock the Notifications