బాహుబలి ప్యాకేజీలో పేదలకు ఎంతంటే.. వలసకూలీలు, చిన్నరైతులపై నిర్మల ప్రకటన..
కరోనా విలయం కారణంగా కుదేలైపోయిన భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీని ప్రకటించింది. దేశ జీడీపీలో 10 శాతం విలువైన ఆ ప్యాకేజీ ద్వారా నిర్ధిష్టంగా ఏమేం చెయ్యబోతున్నారనే అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. తొలిరోజైన బుధవారం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు జరగబోయే ప్రయోజనాలను ప్రకటించిన ఆమె.. రెండో రోజైన గురువారం వలస కూలీలు, చిరువ్యాపారులు, సన్నకారు రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపారు. నిర్మల ప్రసంగం ఆమె మాటల్లోనే..
''భారత్ ను ఆత్మ నిర్భర్ దశగా తయారు చేసే క్రమంలో మోదీ ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. మొదటి రోజు మనం ఎంఎస్ఎంఈల గురించి చెప్పుకున్నాం. ఇవాళ వలస కూలీలు, స్ట్రీట్ వెండర్లు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధిదారులతోపాటు సన్నకారు రైతులకు ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తాను. ఇందులో మొత్తం తొమ్మిది అంశాలున్నాయి. వలస కూలీల సమస్యలపై మూడు, ముద్ర యోజన కింద శిశులోన్, వీధి వ్యాపారులు, హౌసింగ్, ఉపాధి కోల్పోయిన గిరిజనులకు సంబంధించి ఒక్కో అంశం, సన్నకారు రైతులపై రెండు అంశాలు విడివిడిగా రూపొందించాం.. ఒకవేళ ప్రకటనలో ఏదైనా రంగాన్ని ప్రస్తావించలేదంటే.. దాన్ని మేం విస్మరించినట్లు కాదని అందరూ గుర్తుంచుకోవాలి.

రెండు నెలల్లో 25 లక్షల క్రెడిట్ కార్డులు..
చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల కోసం మోదీ సర్కారు కట్టుబడి ఉంది. కరోనా విలయం కొనసాగుతున్నప్పటికీ మార్చి, ఏప్రిల్ నెలల్లో కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు జరీ చేశాం. మార్చి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు 63లక్షల మంది రైతులకు లోన్ల రూపంలో రూ.86వేల కోట్లు పంపిణీ చేశాం. గ్రామీణ, సహకార బ్యాంకులకు నాబార్డు అందించిన రూ .29,500 కోట్లను మార్చి నెలలోనే రీఫైనాన్సింగ్ చేశాం. వ్యవసాయం రుణాలపై మూడు నెలలపాటు మారటోరియం ప్రకటిస్తున్నాం. ఇప్పటికే సకాలం చెల్లించిన రైతులకు మే31 వరకు వడ్డీ రాయితీ కల్పిస్తాం. కిసాన్ కార్డుల ద్వారా రూ.25వేల కోట్ల రుణాలు అందిస్తాం. దాంతోపాటు వసాయ ఉత్పత్తుల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని సంస్థలకు రూ .6,700 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ పరిమితిని కల్పించాం. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద అదనంగా రూ .4,200 కోట్లు అందించాం..

వలస కూలీలకు 2నెలలు ఫ్రీగా..
కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీల సంఖ్య 8 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. పని చేయడానికి వెళ్లిన చోట వారికి రేషన్ కార్డులు లేకపోవడంతో ఇబ్బందు పడ్డారు. ఇకపై అలా జరగదు. ఆ 8 కోట్ల మంది వలస కూలీలకు రేషన్ కార్డులు లేకున్నా.. రెండు నెలల పాటు ఉచితంగా సరుకుల్ని అందిస్తాం. ప్రతి ఒక్క కూలీకి 5కేజీల బియ్యం లేదా 5కేజీల గోధుమ పిండిని అందజేస్తాం. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేయబోతున్నాం. అంతేకాదు, ఆయా రాష్ట్రాలకు చేరుకున్న తర్వాత కూలీలు పని కోల్పోకుండా ఉండేలా.. ఉపాధి హామీ పథకాన్ని ముమ్మరం చేయాలని రాష్ట్రాలకు సూచించాం.

కనీస వేతం పెంపు.. రాష్ట్రాలకు పర్మిషన్
ఊళ్లకు వచ్చేసిన వలస కూలీలతో ఉపాధి హామీ పనులు చేయిచాలన్న సూచనతోపాటు రోజువానీ కనీస వేతనాన్ని రూ. 202 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1.87 లక్షల గ్రామపంచాయితీల్లో 2.33 కోట్ల మంది ఉపాధి హామీ పని కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, వలస కూలీలకు ఆహారం, నివాస సౌకర్యాలు కల్పించే విషయంలో కొన్ని సడలింపులు కావాలని ముఖ్యమంత్రులు.. ప్రధాని మోదీని కోరారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై విపత్తు నిర్వహణ నిధిని కూడా వాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఏప్రిల్ 3 నాటికే విపత్తు నిధికి రూ.11,002కోట్లను ట్రాన్స్ ఫర్ చేసేశాం.

ఇంటి అద్దెలు.. దేశమంతటా ఒకే కార్డు..
కరోనా అనంతర పరిస్థితుల్లోనూ ఆయా మహానగరాల్లో వలస కూలీలు, పేదలు తక్కువ అద్దెలతో నివసించడానికి వీలుగా శాశ్వత ప్రాతిపదికన సరికొత్త ఆలోచన చేశాం. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో గృహ సముదాయాలను నిర్మించి, ఇకపై వలస కూలీల నివాసానికి ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగానే ఈ సముదాయాలను నిర్మిస్తాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలే ఈ పథకాన్ని చేపడతామంటే కేంద్రం అవసరమైన సహాయం చేస్తుంది. రేషన్ కార్డు లేకున్నా వలస కూలీలు, పేదలకు సరుకులు ఉచితంగా ఇచ్చే కార్యక్రమంతోపాటు ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు చెల్లుబాటయ్యేలా రేషన్ కార్డు పోర్టబులిటీ విధానాన్ని అమలులోకి తీసుకొస్తాం..

వీధి వ్యాపారులకు రూ.5వేల కోట్లు..
లాక్ డౌన్ కారణంగా ఎఫెక్టయిన వీధి వ్యాపారులు(స్ట్రీట్ వెండర్స్)కు రూ. 5వేల కోట్ల రుణాలు అందజేస్తాం. వర్కింగ్ క్యాపిటల్ కింద ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున అప్పులిస్తాం. ముద్ర యోజన కింద ఇప్పటికే తీసుకున్న శిశు రుణాలు(రూ.50వేల లోపు రుణాలు)పై వడ్డీ రాయితీ కల్పిస్తాం. అలాగే, రూ.6 లక్షల నుంచి రూ.18లక్షలు మధ్య ఆదాయం కలిగిన వర్గాలు ఇంటి కోసం తీసుకున్న అప్పులకు వడ్డీ మాఫీని మరో ఏడాది పాటు పొడిగిస్తాం..

గిరిజనులు.. మత్స్యకారులు..
రైతులకు అందించే కిసాన్ క్రెడిట్ కార్డులన్ని ఇకపై మత్య్సకారులు, పషుపోషకులకు కూడా అందించబోతున్నాం. తద్వారా రైతులు పొందే అన్ని రకాల ప్రయోజనాలు వాళ్లకు కూడా వర్తిస్తాయి. గ్రామీణ ప్రాంత గిరిజనులకు ఉపాధి కల్పించడంలో భాగంగా వారితో మొక్కలు నాటే, అడవిని కాపాడే పనులు చేయించేందుకు వీలుగా, కాంపన్సేటరీ అఫారెస్ట్రేషన్ ఫండ్(కంపా నిధులు) రూ. 6వేల కోట్లు విడుదల చేస్తాం. ఆయా రాష్ట్రాలకు వీలున్నట్లుగా చిన్న పట్టణాల్లోనూ ఈ నిధులను వాడుకోవచ్చు’’అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.












Click it and Unblock the Notifications