రాజకీయాల్లోకి షాయాజీ షిండే ఎంట్రీ: ఏ పార్టీలో చేరారంటే?
ప్రముఖ సినీనటుడు షాయాజీ షిండే (Sayaji Shinde) సొంత రాష్ట్రం మహారాష్ట్రలో రాజకీయ ప్రవేశం చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చేరారు. ముంబైలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమక్షంలో షాయాజీ షిండే ఆ పార్టీలో చేరారు. షాయాజీని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు అజిత్ పవార్.
మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో షాయాజీ షిండే రాజకీయాల్లో రావడం గమనార్హం. దీంతో షాయాజీ షిండే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. పార్టీలో షాయాజీ షిండేకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు అజిత్ పవార్. పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా షాయాజీ ఉంటారని అజిత్ పవార్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా షాయాజీ షిండే మాట్లాడుతూ.. తాను ఎన్నో సినిమాల్లో రాజకీయ నాయకుడిగా నటించానని గుర్తు చేశారు. అజిత్ పవార్ విధానాలు తనను ఆకర్షించాయని చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమం గురించి పవార్ తో చర్చించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. మరింత సమర్థవంతంగా పనిచేసేందుకే తాను ఎన్సీపీలో చేరినట్లు షాయాజీ షిండే తెలిపారు.
కాగా షాయాజీ షిండే... మహారాష్ట్రలోని ఓ రైతు కుటుంబంలో జన్మించారు. తన చదువు కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖలో కొన్నాళ్లపాటు వాచ్ మెన్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనకు నటనపై ఆసక్తి ఏర్పడింది. అలా 1978లో మరాఠీ నాటకాలతో తన కెరీర్ ను ప్రారంభించారు. 1995లో మరాఠీ చిత్రంతో ఆయన చిత్రసీమలో అడుగుపెట్టారు.
ఆ తర్వాత తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, భోజ్‌పురి, ఇంగ్లీష్ సినిమాల్లోనూ ఆయన నటించి మెప్పించారు. తెలుగులో ఠాగూర్, అతడు, పోకిరి లాంటి సినిమాల్లో నటించిన షాయాజీ షిండే ఇక్కడ అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా, సుధీర్ బాబుతో కలిసి షాయాజీ షిండే నటించిన 'మా నాన్న సూపర్ హీరో' శుక్రవారం విడుదలైంది. మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
#WATCH | Actor Sayaji Shinde joins NCP in the presence of Maharashtra Deputy CM Ajit Pawar and other senior NCP leaders in Mumbai. pic.twitter.com/u9F2amjJLE
— ANI (@ANI) October 11, 2024
మరోవైపు, ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను షాయాజీ షిండే కలిసిన విషయం తెలిసిందే. దేవాలయాల్లో ప్రసాదంతోపాటు మొక్కలను కూడా భక్తులకు అందించాలని షాయాజీ షిండే.. పవన్ కు సూచించారు. ఇందుకు పవన్ సానుకూలంగా స్పందించారు. ఇది మంచి ఆలోచన అని అన్నారు. కాగా, తన తల్లి జ్ఞాపకంగా మహారాష్ట్రలోని మూడు ఆలయాల్లో ఆ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఓ కార్యక్రమంలో షిండే వెల్లడించారు.












Click it and Unblock the Notifications