వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదానీ ఎంటర్‌ప్రైజెస్: ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కిందకు చూస్తేనే కళ్లు తిరిగేటంతటి ఎత్తు నుంచి ఒకేసారి పాతాళానికి పడిపోతే?

భారత్‌లోని పెద్ద వ్యాపార గ్రూపులలో ఒకటైన అదానీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వారం రోజుల్లోనే ఉత్థానం, పతనం రెండూ చూసింది ఈ గ్రూప్.

గత వారం ప్రారంభం నాటికి అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం విలువ 22,000 కోట్ల డాలర్లు (సుమారు రూ. 18 లక్షల కోట్లు)గా ఉండేది. అయితే, అమెరికా కేంద్రంగా పనిచేసే హిండెన్‌బర్గ్ సంస్థ అదానీ గ్రూప్ కార్పొరేట్ అవకతవకలకు పాల్పడినట్లు ఓ నివేదిక విడుదల చేయడంతో ఒక్కసారిగా అంతా మారిపోయింది. అదానీ గ్రూప్ సంస్థల మొత్తం విలువ సగానికి పడిపోయింది.

తమపై వచ్చిన అన్ని ఆరోపణలనూ అదానీ గ్రూప్ ఖండించింది. నిరాధారమంటూ తోసిపుచ్చింది. అయితే, ఆందోళన చెందుతున్న ఇన్వెస్టర్లను మాత్రం ఊరడించలేకపోయింది.

కంపెనీ విలువ రోజురోజుకూ పతనమవుతుండడంతో అదానీ పోర్ట్స్ నుంచి అదానీ ఎనర్జీ వరకు అన్ని షేర్లూ నష్టాలు ఎదుర్కొన్నాయి.

తాజాగా ఎదురైన ఈ సవాళ్లు దూసుకుపోతున్న అదానీ గ్రూప్‌ వేగానికి అడ్డుకట్టలుగా మారొచ్చు. లేదంటే కొన్ని విలువైన ఆస్తులనూ అమ్ముకోవాల్సిన పరిస్థితి రావొచ్చు.

adani

షేర్ల ధరలు పడిపోతే నష్టమేంటి?

షేర్ల ధరలు పడిపోవడమనేది ఆ సంస్థ ఇన్వెస్టర్ల విశ్వాసం కోల్పోతోంది అనడానికి సూచిక.

అయితే, ధరల పతనమనేది సంస్థ కార్యకలాపాలపై ఎప్పుడు ప్రభావం చూపుతుంది?

రుణాలు తిరిగి చెల్లించడానికి, విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టడానికి కావాల్సిన నగదు లభ్యత బాగా తగ్గిపోయినప్పుడు సంస్థ ఇబ్బందుల్లో పడుతుంది.

హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన నాటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోతూనే ఉన్నాయి. ఈ గ్రూప్‌లోని అతిపెద్ద కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షఏర్లు బుధవారం నాటి ట్రేడింగ్‌లో ముందురోజు కంటే 28 శాతం క్షీణించగా గురువారం అక్కడికి మరో 26 శాతం క్షీణించాయి.

దీని తరువాత అదానీ గ్రూప్ తన 20 వేల కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను రద్దు చేసింది. విస్తరణ కోసం నగదు సేకరించడానికి, రుణాలు చెల్లించడానికి ఈ షేర్ల విక్రయ ఆఫర్ తీసుకొచ్చింది.

ఎఫ్‌పీఓలో సమీకరించిన నిధులలో సగ భాగం అదానీ ఎంటర్‌ప్రైజెస్, దాని అనుబంధ కంపెనీల ప్రాజెక్టులలో పెట్టుబడులకు ఉద్దేశించింది. గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్, ప్రస్తుతం కొనసాగుతున్న ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వే వంటివన్నీ ఈ ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి.

ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని కోల్పోవడంతో ముందుముందు మూల ధనం సేకరించడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

'ప్రస్తుతం వారికి మూలధన సేకరణ కష్టం కావడంతో తమ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తిచేయడానికి అనుకున్నకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు’ అని క్లైమేట్ ఎనర్జీ ఫైనాన్స్ డైరెక్టర్ టిమ్ బక్లీ 'బీబీసీ’తో అన్నారు.

కొత్తగా నిధులు సమీకరించడానికి అదానీ ముందున్న ఏకైక మార్గం రుణాలు తీసుకోవడం. అయితే, ఇప్పటికే అదానీ గ్రూప్‌పై రుణభారం అధికంగా ఉండడం, రుణాలిచ్చేవారిలోనూ ఆందోళన నెలకొనడంతో కొత్తగా అప్పులు పుట్టడం అంత సులభం కాదన్నది నిపుణుల మాట.

అదానీ గ్రూప్

అదానీ సంస్థలు అప్పులు ఎందుకు తీసుకుంటాయి?

సంస్థలు.. ముఖ్యంగా ఇన్‌ఫ్రాం సంస్థలు రుణాలు తీసుకోవడమనేది సర్వసాధారణం. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి, నిధులు సమకూర్చుకోవడానికి రుణ మార్గం ఎంచుకుంటాయి సంస్థలు. అదానీ గ్రూప్ ప్రధాన వ్యాపార వ్యూహం ఇదే. అదానీ గ్రూప్ శరవేగంగా వృద్ధి చెందడానికి ఇది ఒక కారణం కూడా.

వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తూపోవడం వల్ల అదానీ గ్రూప్‌పై సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర రుణ భారం ఉంది. గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్ట్, 5జీ వంటి కొత్త వ్యాపారాల్లో అడుగుపెడుతూ అదానీ తన వ్యాపార ఆకాంక్షలను పెంచుకుంటూ పోతుండడంతో మూడేళ్లలోనే ఆ సంస్థ తీసుకున్న రుణం రెట్టింపైంది.

సంస్థ ఆదాయం, లాభాలలో వృద్ధి వేగం కంటే రుణాలలో వృద్ధి వేగం అధికంగా ఉండడంతో కంపెనీకి దివాలా ముప్పు ఉందని హిండెన్‌బర్గ్ నివేదికతో పాటు ఇతర విశ్లేషణలలోనూ ఆందోళన వ్యక్తమైంది.

అదానీ గ్రూప్ ఇప్పటివరకు మూలధన సేకరణకు ఎక్కువగా రుణ మార్గాన్నే ఎంచుకుంది. ఇందుకోసం తమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆస్తులు, వాటాలను పూచీకత్తుగా సమర్పించేవారు.

ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు సగానికి తగ్గడంతో పూచీకత్తుల విలువ కూడా తగ్గినట్లయింది.

బ్లూమ్‌బర్గ్ చెబుతున్నట్లు క్రెడిట్ సూయిస్, సిటీ గ్రూప్ వంటి పెద్దబ్యాంకులు అదానీ గ్రూప్ బాండ్లను తాకట్టు పెట్టుకోవడానికి నిరాకరించడం నిజమే అయితే అందుకు ప్రధాన కారణం షేర్ల ధరలు తగ్గడమే.

అదానీ

మరోవైపు భారత్‌లోని చాలా బ్యాంకులు అదానీ గ్రూప్‌తో సంబంధమున్న సంస్థలకు వేల కోట్ల రుణాలిచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ కూడా అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టింది.

అయితే, అదానీ రుణాల్లో మూడింట రెండొంతులు విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్నవే. ఇప్పుడు హిండెన్ బ్యాంకు రిపోర్ట్ తరువాత అదానీకి రుణాలివ్వాలంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మరింత జాగ్రత్తపడతాయి.

ముందుముందు విదేశీ బ్యాంకుల నుంచి అదానీ గ్రూప్ రుణాలు పొందడం అంత సులభం కాదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కార్పొరేట్ బ్యాంకర్ అన్నారు.

ముఖ్యంగా కొత్త విమానాశ్రయాల నిర్మాణం, ముంబయిలోని ధారావి పునరభివృద్ధి ప్రాజెక్ట్, 50 బిలియన్ డాలర్ల గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి ప్రాజెక్టు వంటి ఇప్పటికే దక్కించుకున్న ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ అదానీ గ్రూప్‌నకు కష్టం కావొచ్చన్నది మార్కెట్ పరిశీలకుల భావన.

Adani

ఏం జరగొచ్చు?

నిధుల సమీకరణ, రుణాల తిరిగి చెల్లింపులో అదానీ గ్రూప్ సామర్థ్యాలను ఇప్పుడు క్రెడిట్ ఏజెన్సీలు మరింత నిశితంగా పరిశీలిస్తాయి.

క్రెడిట్ ఏజెన్సీ ఐసీఆర్ఏ ప్రకారం.. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా డబ్బు అవసరమైన ప్రాజెక్టులను పూర్తిచేయడానికి రుణాలు తీసుకోవడమనేది అదానీ గ్రూప్‌నకు సవాల్ కానుంది.

ఎఫ్‌పీఓ రద్దు నిర్ణయం వల్ల ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం పడబోదని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన వీడియో సందేశంలో చెప్పారు.

'మా బ్యాలన్స్ షీట్ బాగానే ఉంది. ఆస్తులు పుష్కలంగా ఉన్నాయి. మా ఈబీఐటీడీఏ(వడ్డీలు, పన్నులు, తరుగుదల, రుణ విమోచన పోను నికర ఆదాయం) స్థాయి, నగదు అన్నీ బాగున్నాయి. అప్పులు తీర్చడంలో తిరుగులేని ట్రాక్ రికార్డ్ మాకు ఉంది’ అని గౌతమ్ అదానీ ఆ వీడియోలో చెప్పారు.

మూలధనంతో ముడిపడి ఉన్న కొత్త వ్యాపారాలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, విమానాశ్రయాల నిర్మాణం, ఎక్స్‌ప్రెస్‌ వే వంటివన్నీ అదానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(ఏఈఎల్) ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. ఈ వ్యాపారాలన్నీ నిధుల కోసం ఏఈఎల్‌పైనే ఆధారపడతాయి. ప్రస్తుతానికి ఏఈఎల్ నగదు లభ్యత బాగున్నప్పటికీ ఇక్కడి నగదును గ్రూప్‌లోని ఇతర కంపెనీల రుణాల చెల్లింపు కోసం ఉపయోగించడం ప్రారంభిస్తే కష్టాలు మొదలవుతాయి.

అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీలకు విలువైన ఆస్తులన్నాయి. ముఖ్యంగా ఇంధన, రవాణా రంగాల్లో ఈ గ్రూప్ బలమైన ఆస్తులను ఏర్పాటుచేసుకుంది. దేశ ఆర్థిక ప్రాధాన్యాలను అనుసరించి ఇవి ఉంటాయి.

'ఓడరేవులు, విమానాశ్రయాలు, సిమెంట్ ఫ్యాక్టరీలను, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి అదానీ గ్రూప్ వ్యాపారాలను పరిశీలించాను. అవన్నీ స్థిరమైన వ్యాపారాలు. వీటి నుంచి గ్రూప్ నగదు సమకూర్చుకుంటోంది. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం నుంచి వీటికి మంచి రక్షణ వ్యవస్థ ఉంది’ అని ఇన్‌ఫ్రా విజన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మౌలిక సదుపాయల రంగ నిపుణుడు వినాయక్ ఛటర్జీ అన్నారు.

అదానీ

కానీ, ఈ అదానీ గ్రూప్‌లోని అన్ని సంస్థలూ ఇంత సురక్షితమైనవి కావు.

'పెద్దపెద్ద ఓడరేవులను నిర్వహిస్తున్న అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ బాండ్ల ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అదానీ గ్రీన్ బాండ్ల ధర మూడు రోజుల్లో దాదాపు పావు వంతు తగ్గింది. అదానీ గ్రీన్, అదానీ గ్యాస్ వంటి కంపెనీలు ఇప్పటికే అప్పుల్లో ఉన్నాయి. వారి రుణ పరపతి ఇప్పటికే తక్కువగా ఉంది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని కార్పొరేట్ బ్యాంకర్ ఒకరు చెప్పారు.

అందుకే అదానీ గ్రూప్ ముందున్న ఏకైక మార్గం తన కొత్త ప్రాజెక్టులను ప్రస్తుతానికి వాయిదా వేసుకుని, తన ఆస్తుల్లో కొంత విక్రయించి మూలధనం సమీకరించుకోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

మూలధన సమీకరణకు అనువైన పరిస్థితులు ఏర్పడే వరక అదానీ గ్రూప్ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేయొచ్చని ఐసీఆర్ఏ చెబుతోంది.

టిమ్ బక్లీ మాత్రం 'ఇప్పుడు అదానీ గ్రూప్‌పై ఒత్తిడి పెరిగింది, ప్రభుత్వ కాంట్రాక్టులను సులభంగా పొందుతూ ఆదాయం పెంచుకోవడమూ ఇకపై కష్టం కావొచ్చు. రుణ పరపతి మళ్లీ పెంచుకోవడం అదానీకి కష్టమవుతుంది’ అన్నారు.

రుణాలు చెల్లించడం కోసం తన కీలక ఆస్తులను విక్రయించేందుకూ అదానీ గ్రూప్ నిర్ణయం తీసుకోవచ్చని బక్లీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Adani Enterprises: Will Assets Be Sold?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X