పాములతో సహజీవనం! వందల ఏళ్లుగా ఆ ఊరి ఆచారం..
ఒక్క చిన్న పాము కనిపిస్తేనే గుండె ఆగినంత పనవుతుంది. 'బాబోయ్ నాగుపాము' అంటూ ఇల్లా ప్రదేశాన్నో వదిలి పరుగు తీస్తాం. ఒకవేళ అది ఇంట్లోకి వస్తే.. స్నేక్ క్యాచర్‌ను పిలిచేదాకా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతాం. కానీ, ఈ ఊరి కథ వేరు! ఇక్కడ ప్రతి ఇంట్లోనూ నాగుపాములు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. మనుషులతో కలిసి ఒకే మంచంపై పడుకుంటాయి. వంటింట్లోనో, పూజా గదిలోనో కాళ్లు ముడుచుకుని కూర్చుంటాయి. అయినా సరే.. ఆ ఊరి జనం వాటిని చూసి అస్సలు భయపడరు. కనీసం కర్ర పట్టుకుని తరమడానికి కూడా ప్రయత్నించరు. వినడానికి ఏదో హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమా కథలా అనిపిస్తోందా? కానీ, ఇది అక్షరాలా నిజం! మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న 'శేత్‌ఫాల్' (Shetphal) గ్రామానికి వెళ్తే ఈ అసాధారణ, ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు నిత్యం దర్శనమిస్తాయి.
దేశంలోనే 'పాముల గ్రామం'గా గుర్తింపు తెచ్చుకున్న శేత్‌ఫాల్‌లో మనుషులకు, సర్పాలకు మధ్య ఉన్న బంధం తరతరాల నాటిది. ఇక్కడి పిల్లలు బొమ్మలతో కాదు.. బ్రతికున్న నాగుపాములతో ఆడుకుంటూ పెరుగుతారు. అందుకే వాటి ప్రవర్తన, కదలికలు స్థానికులకు వెన్నతో పెట్టిన విద్య. మన ఇళ్లలో పిల్లులు, కుక్కలను ఎంత సహజంగా పెంచుకుంటామో.. ఇక్కడ పాములు కూడా సమాజంలో అంత సాధారణ భాగమైపోయాయి. గ్రామస్థులు తమ దైనందిన పనులు చేసుకుంటుంటే, వాటి పక్కనే పాములు హాయిగా పాకుతూ వెళ్తుంటాయి. ఈ అద్భుతమైన, ప్రమాదకరమైన సహజీవనమే శేత్‌ఫాల్‌ను ప్రపంచ పటంలో ఒక విలక్షణమైన ప్రదేశంగా నిలబెట్టింది.

పాముల కోసం ప్రత్యేక 'విశ్రాంతి గదులు'!
మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే.. శేత్‌ఫాల్ గ్రామస్తులు ఇళ్లు కట్టుకునేటప్పుడు మనుషుల కోసమే కాదు, పాముల కోసం కూడా ప్రత్యేకంగా ఆలోచిస్తారు. ప్రతి ఇంట్లోనూ పాములు ఎప్పుడైనా వచ్చి స్వేచ్ఛగా విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా పైకప్పు కింద లేదా గోడల్లో ప్రత్యేకంగా చిన్న చిన్న గూళ్లు, ఆశ్రయాలను నిర్మిస్తారు. బయట ఎండ ఎక్కువగా ఉన్నా, లేదా చలి వేసినా పాములు నేరుగా ఇళ్లలోకి ప్రవేశించి ఈ ప్రత్యేక స్థలాల్లో సేదతీరుతాయి.
హిందూ సంప్రదాయాల ప్రకారం, ఇక్కడి ప్రజలు పాములను కేవలం జంతువులుగా చూడరు. వాటిని సాక్షాత్తూ ఆ పరమశివుడి స్వరూపంగా, పవిత్రమైనవిగా భావించి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. తాము పాములను దైవంగా భావిస్తున్నందున, అవి తమకు ఎలాంటి హాని చేయవని స్థానికులు బలంగా నమ్ముతారు. ఇప్పటివరకు ఈ గ్రామంలో పాము కాటుకు గురై ఎవరూ చనిపోలేదనే ప్రచారం ఇక్కడి నమ్మకాన్ని మరింత పెంచుతోంది.
పర్యాటకులు వెళ్లాలనుకుంటే.. ఈ రూల్స్ మస్ట్!
ఈ వింత ప్రపంచాన్ని కళ్లారా చూడాలని ప్రతి ఏటా వందలాది మంది సాహస పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులు శేత్‌ఫాల్ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. అయితే, అక్కడికి వెళ్లే వారు కొన్ని కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది:
- ముట్టడం నిషేధం: పాములను తాకడానికి, పట్టుకోవడానికి లేదా వాటితో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించడం పూర్తిగా నిషేధం.
- రెచ్చగొట్టవద్దు: పాములకు ఎలాంటి హాని చేయకూడదు, వాటిని భయపెట్టకూడదు. స్థానిక ప్రజల మార్గదర్శకాలను ప్రాణం కంటే ఎక్కువగా గౌరవించాలి.
- అనుమతి తప్పనిసరి: ఇక్కడ పాములు ఇళ్లలోనే ఉంటాయనే నెపంతో, పర్మిషన్ లేకుండా ఎవరి ప్రైవేట్ ప్రాంగణాల్లోకి, ఇళ్లలోకి దూసుకెళ్లకూడదు.
ఎప్పుడు వెళ్ళాలి? చుట్టుపక్కల ఏమున్నాయి?
శేత్‌ఫాల్ గ్రామాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ సీజన్‌లో వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే వేసవిలో అయితే ఇక్కడ ఎండలు దంచికొడుతుండటంతో పగటిపూట పర్యటించడం కష్టమవుతుంది. ఈ గ్రామానికి వెళ్లిన పర్యాటకులు సోలాపూర్ చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధ సిద్ధేశ్వర్ ఆలయం, చారిత్రక సోలాపూర్ కోటను కూడా సందర్శించి తమ పర్యటనను మరింత గుర్తుండిపోయేలా మార్చుకోవచ్చు. భయం ఉన్నచోట భక్తి, భక్తి ఉన్నచోట నమ్మకం.. ఆ నమ్మకమే మనిషిని, విషసర్పాలను ఒకేతాటిపై నడిపిస్తోందని నిరూపిస్తోంది ఈ శేత్‌ఫాల్ గ్రామం!














Click it and Unblock the Notifications