మహీంద్రా షోరూంలో రైతుకు అవమానం: స్పందించిన ఆనంద్ మహీంద్ర, ఏమన్నారంటే?
బెంగళూరు: కర్ణాటకలోని ఓ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసేందుకు వెళ్లిన రైతుకు అవమానం జరిగిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర స్పందించారు. కస్టమర్లకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. సదరు రైతును అవమానించిన బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు.

మహీంద్రా షోరూంలో రైతును అవమానించిన సేల్స్‌మెన్
ఆ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కెంపెగౌడ అనే రైతు బొలెరో పికప్ ట్రక్ కొనుగోలు చేసేందుకు గత శుక్రవారం తమకూరులోని మహీంద్రా షోరూంకు వెళ్లారు. అయితే, అక్కడున్న సేల్స్‌మెన్ ఆయనను అవమానించాడు. రైతు వేషధారణ చూసి.. కారు ధర రూ. 10 లక్షలు.. నీ దగ్గర 10 రూపాయలు కూడా ఉండవు.. నీవు కొనలేవు అంటూ హేళన చేస్తూ అవమానపర్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన రైతు కెంపె గౌడ.. గంటలోనే రూ. 10 లక్షలతో వస్తానని.. వెంటనే వాహనాన్ని డెలివరీ చేయగలరా? అని సవాల్ విసిరాడు.
10 లక్షలతో వచ్చి షాకిచ్చిన రైతు.. సేల్స్‌మెన్ క్షమాపణలు
ఆ తర్వాత అన్నట్లుగానే మొత్తం పది లక్షల డబ్బుతో ఆ షోరూంకు వచ్చారు కెంపెగౌడ. దీంతో ఖంగుతున్న సేల్స్‌మెన్ కారు వెయిటింగ్ లిస్టులో ఉందని, వాహనాన్ని వెంటనే డెలివరీ చేయలేమని చెప్పాడు. దీంతో తనకు క్షమాపణలు చెప్పాలని కెంపెగౌడ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారిమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, పోలీసులు రంగంలోకి దిగి సేల్స్‌మెన్‌తో రైతుకు క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కస్టమర్ల మర్యాద కాపాడటం తమ ప్రాధాన్యత అంటూ ఆనంద్ మహీంద్ర
కాగా, ఈ వీడియోను కొందరు ఆనంద్ మహీంద్రను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్ర తాజాగా స్పందించారు. 'మా కంపెనీ ప్రధాన ఉద్దేశం.. అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడమే. వ్యక్తుల మర్యాదను కాపాడటం మా ప్రధానమైన నైతిక విలువ. ఈ సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమించినా.. వారిపై చర్యలు ఉంటాయి' అని మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాగా, తనను అవమానించిన షోరూంలో తాను వాహనాన్ని కొనుగోలు చేయనని చెప్పి సదరు షోరూం నుంచి వెళ్లపోయారు రైతు కెంపెగౌడ.