వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నయ్యలాల్ హత్య తర్వాత ఉదయ్‌పుర్, కరౌలి, జోధ్‌పుర్, అల్వార్.. ఈ రాజస్థాన్ నగరాల్లో ఏం జరుగుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కన్నయ్యలాల్

''1970ల్లో ఒక శ్మశానవాటిక స్థలంపై ఇక్కడ రెండు మతాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఎనిమిది రోజులపాటు కర్ఫ్యూ కూడా విధించారు.’’

''22ఏళ్ల తర్వాత 1992లో ఇక్కడ రెండు రోజులపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.’’

''ఆ తర్వాత 2017లో శంభూలాల్ రైగార్ ఘటన చోటుచేసుకుంది. అప్పుడు కూడా ఇలానే ఒక హత్య వీడియో వైరల్ అయ్యింది.’’

''ఐదేళ్ల తర్వాత అలాంటి రోజులు మళ్లీ వచ్చాయి.’’

ఇవి రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన 65ఏళ్ల ఉగ్రసేన్ రావ్ మాటలు. ఉదయ్‌పుర్ తొలి జర్నలిస్టుగా ఆయనకు స్థానికంగా గుర్తింపు ఉంది.

ఉదయ్‌పుర్‌లో చోటుచేసుకున్న తాజా హత్యపై ఆయనతో బీబీసీ మాట్లాడింది. కొన్ని పాత సంగతులను ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే, పరిస్థితులు ఇంతలా ముందెన్నడూ చేయిదాటిపోలేదని ఆయన చెప్పారు.

ప్రపంచ ప్రఖ్యాత, అందమైన చెరువులు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో కనిపిస్తాయి.

ఇక్కడి సహజసిద్ధమైన ప్రకృతి అందాలను చూసేందుకు ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి పర్యటకులు వస్తుంటారు.

కన్నయ్యలాల్

అసలు ఇక్కడ ఏం జరిగింది?

టైలర్ కన్నయ్యలాల్ హత్య అనంతరం ఉదయ్‌పుర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ధాన్‌మండీ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నయ్యలాల్ ఒక టైలర్ షాపు నడిపేవారు.

అయితే, మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు బట్టలు కుట్టించుకునేందుకు ఆయన షాపుకు వచ్చారు. కత్తితో ఆయనను హత్య చేశారు.

హత్య చేస్తుండగా వీడియో కూడా తీశారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ హత్య చేశామని నిందితులు వీడియోలో చెప్పారు.

ఆ ఇద్దరు నిందితులను రాజ్‌సమంద్ జిల్లాలోని భీమా ప్రాంతం పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులను మహమ్మద్ రియాజ్, గౌస్ మహమ్మద్‌లుగా గుర్తించారు.

ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్రంలోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

అశోక్ గహ్లోత్

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?


నితిన్ శ్రీవాస్తవ, బీబీసీ ప్రతినిధి

ఉదయ్‌పుర్‌ను ''సిటీ ఆఫ్ లేక్స్’’గా పిలుస్తారు. అయితే, ఇప్పుడు ఇక్కడన్నీ స్తంభించిపోయినట్లు కనిపిస్తోంది.

కన్నయ్యలాల్ హత్య తర్వాత హిందూ-ముస్లిం వర్గాల మధ్య ఉద్రిక్తతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నగరంలో భారీగా పోలీసులను మోహరించారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కూడా గురువారం ఉదయ్‌పుర్‌ను సందర్శించారు.

కన్నయ్యలాల్ అంత్యక్రియలకు బుధవారం వేల మంది ప్రజలు హాజరయ్యారు. హత్య జరిగిన నాలుగు గంటల్లోనే ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ విషయంపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. మరోవైపు కేంద్రం కూడా ఎన్ఐఏ దర్యాప్తుకు ఆదేశించింది.

ఇద్దరు నిందితులకూ మిలిటెంట్లతో సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.

ఈ విషయంపై కెమెరా ముందుకొచ్చి మాట్లాడేందుకు చాలా మంది సిద్ధపడటం లేదు. మాట్లాడుతున్న కొద్ది మందిలో మతపరమైన భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

''హిందువుల జనాభా ఎక్కువగా ఉండే దేశంలో మనం జీవిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు అసలు చోటుచేసుకోకూడదు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకుండా చూడాలి’’అని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జైపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

ఉదయ్‌పుర్‌లో హిందువులతోపాటు ముస్లింల జనాభా కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్నిచోట్ల ముస్లిం, హిందువుల ఇళ్లు ఎదురెదురుగా కూడా ఉంటాయి.

హత్య అనంతరం నగరం మొత్తంగా కర్ఫ్యూ విధించారు. అయితే, ప్రజలు ఈ కర్ఫ్యూని ముందుగా ఊహించలేదు. దీంతో దీనికి వారు సిద్ధంగా లేనట్లు కనిపించింది.

రేషన్ సరకుల కోసం ముకేశ్ గార్దియా చాలా కష్టపడుతున్నారు. ''ఈ కర్ఫ్యూ వల్ల రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయ్‌పుర్‌లో కనీసం కప్పు టీ కూడా దొరకకపోవడం ఇదే తొలిసారి. అసలు ఇదంతా చూస్తుంటే షాక్ తగిలినట్లు అనిపిస్తోంది’’అని ఆయన అన్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఏదైనా అంతర్జాతీయ సంస్థ ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

''అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో అతివాదులకు సంబంధం లేకుండా ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం లేదు. ఇదివరకు ఇలాంటి ఘటనల దర్యాప్తుల్లో అదే తేలింది. ప్రస్తుతం కూడా అదే కోణంలో దర్యాప్తు సాగుతోంది’’అని రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు.

ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనలు చూస్తే స్పష్టం అవుతోంది.

రాజస్థాన్‌లో అంతర్జాతీయ స్థాయిలో కుట్ర గురించి ఇదివరకు ఎలాంటి వార్తలు రాలేదు. దీంతో ఇక్కడి పరిస్థితులపై స్థానికులతో బీబీసీ మాట్లాడింది.


మహమ్మద్ రియాజ్, గౌస్ మహమ్మద్‌లు

జనాభా ఇలా..

2011 జనాభా లెక్కల ప్రకారం.. రాజస్థాన్ జనాభా 6.85 కోట్లు. దీనిలో ముస్లింల వాటా 9 శాతం వరకు ఉంటుంది. హిందువుల వాటా 89 శాతం.

రాజస్థాన్‌లో మొత్తంగా 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలోనూ ముస్లింల కంటే హిందువుల జనాభానే ఎక్కువ.

ఉదయ్‌పుర్ గురిచి మాట్లాడుకుంటే.. ఇక్కడ లక్ష మంది వరకు ముస్లింలు ఉంటారు. హిందువుల జనాభా 28 లక్షలు.

హిందూ, ముస్లింల మధ్య ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయా? అనే ప్రశ్నకు ఇలాంటివి తాము ఎప్పుడూ చూడలేదని ఇక్కడి యువత సమాధానం చెప్పారు.

అయితే, 1992, 1970ల్లో ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయని, అప్పట్లో రెండు రోజులు, ఎనిమిది రోజులపాటు వరుసగా కర్ఫ్యూ విధించారని సీనియర్ జర్నలిస్టు ఉగ్రసేన్ రావ్ చెప్పారు.

మతపరమైన ఉద్రిక్తతలు

గత కొన్ని నెలలుగా రాజస్థాన్‌లో మతపరమైన ఉద్రిక్తతలకు సంబంధించిన వార్తలు ఎక్కువయ్యాయి.

మొదట హిందువుల కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 2న కరౌలీ పట్టణంలో హిందూ సంస్థలు చేపట్టిన బైక్ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి.

మే 3న ఈద్ వేడుకల్లోనూ జోధ్‌పుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జెండాలు, లౌడ్‌స్పీకర్ల విషయంలో నెలకొన్న వివాదం కర్ఫ్యూ విధించే వరకు వెళ్లింది. ఈ ఘనటలోనూ దాదాపు 30 మందికి గాయాలయ్యాయి.

అల్వార్‌లోనూ ఇలాంటి పరిస్థితులే చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత తాజాగా ఉదయ్‌పుర్‌లో హత్య జరిగింది.

అయితే, ఈ ఘటనలు ఒక్కొక్కటిని విడివిడిగా చూడకూడదని, అన్నింటినీ కలిపి చూడాలని కొందరు నిపుణులు చెబుతున్నారు.

మొత్తంగా చూసుకుంటే రాజస్థాన్‌లో ఇలాంటి మత ఘర్షణలు ఇదివరకు చోటుచేసుకోలేదు.

రాజస్థాన్

2014 నుంచి మత ఘర్షణలు లేదా ఉద్రిక్తతల డేటాను ఎన్‌సీఆర్‌బీ ప్రచురిస్తోంది. అప్పట్లో ఇక్కడ వసుంధర రాజే నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు అశోక్ గహ్లోత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.

అయితే, ఇక్కడి గణాంకాలను పరిశీలిస్తే మతఘర్షణలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2020లోనూ ఇక్కడ మూడు మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ ఏడాది చాలావరకు లాక్‌డౌన్ అమలులో ఉంది.

అయితే, నెలల వ్యవధిలోనే ఇన్ని మత ఘర్షణలు ఎలా చోటుచేసుకుంటున్నాయి?

ఈ కేసుల వెనుక ఒక ప్యాటెర్న్ కనిపిస్తుందని రాష్ట్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు వివేక్ భట్నాగర్ చెప్పారు.

''సాధారణంగా రాజస్థాన్ ప్రజలు పెద్దగా గొడవలకు వెళ్లరు. అయితే, ఏదైనా దెబ్బకు ప్రతిస్పందించడం వేరే. కానీ, కరౌలీలో ఏం జరిగింది? జోధ్‌పుర్‌లో ఏం జరిగింది? అల్వార్‌లో ఏం జరిగింది? ఇప్పుడు ఉదయ్‌పుర్‌లో ఏం జరిగింది? ఇలా వరుసగా చూడండి. ఇది రాజస్థాన్ ప్రజల తీరు కాదు. ఇక్కడ జరుగుతున్నదంతా ఒక ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా జరుగుతోంది. దీని వెనుక ఒక టూల్‌కిట్ ఉంది. రాజస్థాన్‌లో శాంతి, భద్రతలకు భంగం కలిగేందుకు జరుగుతున్న కుట్ర ఇది’’అని ఆయన వ్యాఖ్యనించారు.

ఇదంతా పెద్ద కుట్రలో భాగమని ఎలా చెబుతున్నారు?

''ఇక్కడ ఏదైనా ఒక ఘటన చోటుచేసుకుంటే.. ఏదో ఒకటేనని చెప్పొచ్చు. ఒకటి తర్వాత ఒకటిగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. గొంతులు కోసేస్తున్నారు. దీని కోసం ఒక మైండ్‌సెట్, ట్రైనింగ్ కావాలి. ఇలాంటి మైండ్‌సెట్‌ను ఒక్కరోజులో సెట్ చేయలేరు. దీని కోసం చాలా పని చేయాలి. ఇదంతా ఒక ప్యాటెర్న్’’అని ఆయన అన్నారు.

శంభూలాల్

2017లో ఉదయ్‌పుర్‌లో ఏం జరిగింది?

రాజస్థాన్‌లో రాజసమంద్ ప్రాంతంలో 2017లోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతం కూడా ఉదయ్‌పుర్ పరిధిలోనే ఉంటుంది.

అప్పట్లో అఫ్రాజుల్ అనే వ్యక్తిని శంభూలాల్ అనే వ్యక్తి హత్య చేశారు. ఈ హత్య వీడియో కూడా ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది.

అయితే, ఈ ఘటనకు, ప్రస్తుతం ఉదయ్‌పుర్‌లో చోటుచేసుకున్న హత్యకు మధ్య ఎలాంటి సంబంధమూ లేనట్లు కనిపిస్తోందని వివేక్ భట్నాగర్ అన్నారు.

''2017లో ఆ ఘటన తర్వాత అలాంటి ఘటనలేవీ బయటపడలేదు. అందుకే ప్రస్తుత ఘటనలతో దానికి ముడిపెట్టకూడదు’’అని వివేక్ అన్నారు.

అయితే, ప్రస్తుతం 2017నాటి పరిస్థితులే నెలకొన్నట్లు మరో సీనియర్ జర్నలిస్టు త్రిభువన్ చెప్పారు. ఇలాంటి ఘటనలకు ఐదు నుంచి ఏడేళ్ల క్రితమే బీజాలు పడ్డాయని ఆయన వివరించారు.

''2017నాటి ఘటన ఒక క్రూరమైన చర్య. ప్రస్తుత హత్య కూడా అలాంటిదే. అప్పట్లో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని హత్య చేశారు. ఇప్పుడు మైనారిటీ వర్గానికి చెందినవారు హత్య చేశారు. ఈ ట్రెండ్ ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరింది’’అని ఆయన చెప్పారు.

మరోవైపు ఈ ఘటనలో పోలీసుల పాత్రను త్రిభువన్ ప్రశ్నించారు. హత్య చేస్తామని కన్నయ్యలాల్‌కు బెదిరింపులు వచ్చినప్పుడు పోలీసులు ఎందుకు రక్షణ కల్పించలేదని ఆయన అడిగారు.

పోలీసుల పాత్ర..

ఈ ఘటనలో పోలీసుల పాత్రపై రాజస్థాన్ ఏడీజీ హవా సింగ్ ఘుమరియా స్పందించారు.

''మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు సంబంధించి కన్నయ్యలాల్‌పై కూడా కేసు నమోదైంది. ఆ తర్వాత ఆయన్ను అరెస్టు కూడా చేశాం’’అని హవా సింగ్ రిపోర్టర్లతో చెప్పారు.

''పదో తేదీన ఆ కేసు నమోదైంది. వెంటనే మేం ఆయన్ను అరెస్టు చేశాం. కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది. ఆ తర్వాత తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని పోలీసులకు కన్నయ్యలాల్ చెప్పారు’’అని హవా సింగ్ వివరించారు.

''అయితే, ఆ తర్వాత మేం వారిని కూర్చోబెట్టి మాట్లాడాం. సమస్యను పరిష్కరించాం. దీంతో ఎలాంటి చర్యలు ఇకపై అవసరంలేదని నిర్ణయించుకున్నాం’’అని ఆయన చెప్పారు.

అయితే, పోలీసులు రక్షణ కల్పించకపోవడం వల్లే కన్నయ్యలాల్ మరణించారని త్రిభువన్ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
After Kannayalal's murder, Udaipur, Karauli, Jodhpur, Alwar What is happening in these cities of Rajasthan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X