భారత్ లోనూ చైనా స్పై బెలూన్ సంచారం ? ఐదు ఖండాలపై నిఘా- షాకింగ్ రిపోర్ట్..!
అమెరికాలో నాలుగు రోజుల పాటు కలకలం రేపి చివరకు ఆర్మీ చేతుల్లో కూలిన చైనా నిఘా బెలూన్ తరహాలోనే ఇప్పుడు మరిన్ని బెలూన్లు భారత్ సహా పలు దేశాల్ని టార్గెట్ చేసినట్లు తాజా నివేదిక చెబుతోంది.
అమెరికాలో చైనా నిఘా బెలూన్ రేపిన కలకలం అంతా ఇంతా కాదు. నాలుగు రోజుల పాటు అమెరికాలోని రక్షణ స్ధావరాలు, అణుకేంద్రాలపై తచ్చాడిన మూడు బస్సుల సైజున్న నిఘా బెలూన్ ను ఎట్టకేలకు గత వారం అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలతో కూల్చేశారు. అయితే ఇప్పుడు అలాంటివే మరిన్ని బెలూన్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై సంచరిస్తున్నట్లు షాకింగ్ నివేదిక అందింది.
భారత్, జపాన్ తో పాటు ఐదు ఖండాల్లోని పలు దేశాలపై చైనా నిఘా బెలూన్లు సంచరిస్తున్నట్లు తాజాగా ఓ నివేదిక బయటికి వచ్చింది. అట్లాంటిక్ మహాసముద్రంలోని దక్షిణ కరోలినా తీరంలో గత శనివారం యుద్ధ విమానాలతో చైనా నిఘా బెలూన్‌ను కూల్చేసిన విషయాన్ని అమెరికా అధికారులు భారత్ సహా తమ మిత్రదేశాలకు వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారంపై ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. వాషింగ్టన్ లో ఉన్న 40 దేశాల ఎంబసీలతో అధికారులు ఈ సమాచారం పంచుకున్నట్లు తెలుస్తోంది.

చైనా దక్షిణ తీరంలోని హైనానా ప్రావిన్స్ నుంచి చాలా ఏళ్లుగా పనిచేస్తున్న నిఘా బెలూన్ గురించిన సమాచారాన్ని భారత్, జపాన్, వియత్నం, తైవాన్, ఫిలిప్పీన్స్ తో పాటు పలు దేశాలకు అమెరికా అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆయా దేశాలపై చైనా బెలూన్ల నిఘా ఏ విధంగా కొనసాగుతుందో వివరించారని వాషింగ్టన్ పోస్ట్ తన తాజా కథనంలో తెలిపింది. ఇది అమెరికాలో పలువురురక్షణ, నిఘా అధికారులను ఇంటర్వ్యూ చేసి సమాచారం ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ కథనంలో చైనా నిఘా బెలూన్లు ఐదు ఖండాల్లో కనిపించినట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications