ఈ చేపను తింటే ప్రాణాలు గాల్లో కలవాల్సిందే..
ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు.. మా జేబులు నిండితే చాలు అనే స్వార్థం కొందరిది! వారికి అధికారుల అలసత్వం తోడైతే ఇక అడ్డుఅదుపు ఉండదని గొల్లపూడి పరిసర ప్రాంతాల్లో సాగుతున్న చేపల చెరువుల దందా నిరూపిస్తోంది. ప్రభుత్వాలు నిషేధించినా, కోర్టులు మొట్టికాయలు వేసినా.. నిస్సిగ్గుగా క్యాట్ ఫిష్, ఫంగస్ చేపల పెంపకం యథేచ్ఛగా సాగుతోంది. పచ్చని పంట పొలాల మధ్య విషాన్ని పండిస్తూ.. ప్రజల ప్రాణాలతో ఈ చెరువుల యజమానులు చెలగాటమాడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్యాట్ ఫిష్ పెంపకాన్ని పూర్తిగా నిషేధించాయి. కానీ గొల్లపూడి ప్రాంతంలో మాత్రం నిబంధనలు తుంగలో తొక్కారు. అధిక లాభాల కోసం అడ్డదారులు తొక్కుతున్న యజమానులు.. వందల కిలోల కుళ్లిన కోళ్ల వ్యర్థాలను చెరువుల్లో వేస్తున్నారు. ఈ వ్యర్థాల వల్ల ఆ ప్రాంతమంతా భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. స్థానిక రైతులు, ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ చెరువుల వల్ల పచ్చని పంట పొలాలు దెబ్బతినడమే కాకుండా, చుట్టుపక్కల నివసించే వారికి ప్రమాదకరమైన రోగాలు సంక్రమించే ముప్పు పొంచి ఉంది.

అధికారుల మౌనం.. అక్రమార్కులకు వరం!
ఇంత బహిరంగంగా దందా సాగుతున్నా.. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో పలుమార్లు మీడియా ప్రతినిధులు, రైతులు స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు అందాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. "మేం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అధికారులే చోద్యం చూస్తున్నారు" అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రపు తనిఖీలతో కాలక్షేపం చేస్తూ అక్రమార్కులకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అనుమతులు ఉన్నాయా? అసలు ఉన్నట్లు చూపిస్తున్నారా?
అసలు ఈ చెరువులకు అనుమతులు ఇచ్చింది ఎవరు? పంట పొలాల మధ్య ఇలాంటి హానికరమైన చేపల పెంపకానికి అనుమతులు ఎలా లభిస్తాయి? అధికారుల వద్ద దీనిపై స్పష్టమైన సమాధానం లేదు. చట్ట విరుద్ధంగా సాగుతున్న ఈ దందాను అరికట్టకపోతే గొల్లపూడి పరిసర ప్రాంతాలు రోగాల నిలయాలుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ చెరువులను వెంటనే పూడ్చివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల చర్యలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయా లేక అక్రమార్కుల చెర నుండి ప్రజలకు విముక్తి లభిస్తుందా అన్నది వేచి చూడాలి.














Click it and Unblock the Notifications