India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్నిపథ్: సైన్యంలో ఉద్యోగాల కోసం పుట్టుకొచ్చిన కోచింగ్ సెంటర్లు, విద్యార్థుల కలలు కల్లలేనా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పథకం కింద నాలుగేళ్ల పాటు భారత సైన్యంలో ఉద్యోగాలు కల్పిస్తారు. ఆ తర్వాత వారికి సేవా నిధి ప్యాకేజ్ అందిస్తారు.

భారతదేశంలోని చిన్న పట్టణాలు, గ్రామాల్లోని యువత సైన్యంలో చేరడానికి కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతారు. ఈ ఉద్యోగం వారికి ఆదాయన్ని, గౌరవాన్ని అందిస్తుంది. చాలామందికి ఇది పేదరికం నుంచి బయటపడే మార్గం కూడా.

agnipath

తాజాగా అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో, ఫోటోగ్రాఫర్ రోనీ సేన్ బిహార్‌లో ఇలాంటి కోచింగ్ సెంటర్లలోని పరిస్థితిని చూశారు.

బిహార్ రాజధాని పట్నాలో గత కొద్ది సంవత్సరాలలో భద్రతా దళాలు, పోలీసు శాఖల్లో ఉద్యోగాలకు కోచింగ్ ఇవ్వడానికి పదుల సంఖ్యలో ప్రయివేటు కోచింగ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి.

అగ్నిపథ్ పథకం ప్రకటన తరువాత పట్నాలో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.

వేల సంఖ్యలో యువత ఈ కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతారు. ఇరుకైన తరగతి గదుల్లో సర్దుకుంటూ ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు. వీరిలో చాలామంది రైతులు, రోజు కూలీలు, రిటైర్డ్ సైనికుల పిల్లలే.

అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీరంతా వీధుల్లోకి వచ్చారు. రాస్తారోకోలు చేశారు. రైళ్లు, వాహనాలు తగలబెట్టారు.

ఈ ప్రయివేటు కోచింగ్ సెంటర్లే నిరసనలను "ప్రేరేపించాయని" పట్నాలోని అధికారులు ఆరోపించారు. నిరసనల నేపథ్యంలో చాలా కోచింగ్ సెంట్లర్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. కొన్ని తరగతులను నిలిపివేశాయి.

ఫిజికల్ ట్రైనింగ్‌కు సరైన మైదానం లేదు

అవినాశ్ కుమార్ ఒక చిన్న కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. ఆయన సెంటర్‌ను తెరిచే ఉంచారు. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సెంటర్లో 70 మంది విద్యార్థులు ఉన్నారని, వారంతా సాయుధ దళాలు, స్థానిక పోలీసు ఉద్యోగాల కోసం "రాత పరీక్షలు, శారీరక పరీక్షలకు" కోచింగ్ తీసుకుంటున్నాని చెప్పారు. వీరిలో 10 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరు స్థానిక పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు.

అవినాశ్ కుమార్ సెంటర్లో కోచింగ్ ఫీజు రూ. 9,000. వారానికి అయిదు క్లాసులు ఉంటాయి. ఎనిమిది మంది టీచర్లు పాఠాలు చెబుతారు. ఈ కోచింగ్ ఆరు నెలలు ఉంటుంది. కొంతమంది పేద విద్యార్థులు వాయిదాలలో ఫీజులు చెల్లిస్తారని ఆయన చెప్పారు.

పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లల్లో ఫీజు దీనికి మూడింతలు ఉంటుంది.

అవినాశ్ కోచింగ్ సెంటర్లో 25 మంది విద్యార్థులు కూర్చోగలిగే తరగతి గది ఉంది.

"విద్యార్థులకు గణితం, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ బోధిస్తాం" అని ఆయన చెప్పారు.

పట్నాలో ఖాళీ స్థలాలు తక్కువ. ఈ విద్యార్థులు ఫిజికల్ ట్రైనింగ్ కోసం ఎలాంటి సదుపాయాలు లేని ఒక మైదానంలో వ్యాయామం చేస్తారు. ఆ మైదానం పక్కనే వస్తున్న మెట్రో రైల్వే నిర్మాణం నెమ్మదిగా ఆ స్థలాన్ని మింగేస్తోంది.

నగరంలోని కొన్ని పాఠశాలలు తమకున్న చిన్న గ్రౌండ్‌లో కోచింగ్ సెంటర్ విద్యార్థులు శిక్షణ తీసుకోవడానికి అనుమతిస్తాయి. అయితే, తాజా నిరసనల నేపథ్యంలో స్కూళ్లు ఈ ట్రైనింగులకు ఇప్పుడు అనుమతించట్లేదు.

నగరంలో ఉన్న ఏకైక మైదానమే ఇప్పుడు వారికి దిక్కు. కొందరు తెల్లవారుజామునే లేచి, ట్రాఫిక్ మొదలవ్వకముందే రోడ్లపై ప్రాక్టీస్ చేస్తుంటారు.

'ఆర్మీలో ఉద్యోగానికి భద్రత ఉంటుంది'

చాలామంది ఆ చిన్న మైదానంలో, మర్రి చెట్టు నీడలో విద్యార్థులు వ్యాయామాలు చేస్తుంటారు.

వారిలో 19 ఏళ్ల యువరాజ్ కుమార్ ఒకరు. ఆ కుర్రవాడి తండ్రి ఒక రిటైర్డ్ సోల్జర్. యువరాజ్ కాలేజీలో కామర్స్ చదువుతున్నాడు కానీ, సైన్యంలో చేరడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

"ఆర్మీ క్యాంపులో పెరిగాను. అక్కడ క్రమశిక్షణ, యూనిఫాం, ఉద్యోగ భద్రత నాకు బాగా ఇష్టం. మా నాన్న ఆర్మీలో పనిచేశారు. ఈరోజు మా కుటుంబం నిలదొక్కుకోవడానికి కారణం ఆయన ఉద్యోగ భద్రతే" అని యువరాజ్ చెప్పాడు.

సైన్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల నియామకం తనను చాలా నిరాశకు గురిచేసిందని, అయినప్పటికీ "ఆర్మీలో ఉద్యోగం కోసం ఒకసారి ప్రయత్నిస్తానని" యువరాజ్ అన్నారు.

అక్కడికి కొద్ది దూరంలోనే మరో కోచింగ్ సెంటర్‌కు చెందిన కొందరు అమ్మాయిలు ఇసుకలో దూకుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. బిహార్ పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం వాళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా, బిహార్ పోలీసుల్లో మూడో వంతు కంటే ఎక్కువ స్థానాలు మహిళలకు కేటాయించారు. రాష్ట్ర పోలీసు శాఖలో 25,000 మహిళలు పనిచేస్తున్నారని, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇదే అత్యధికం అని బిహార్ ప్రభుత్వం చెబుతోంది.

స్థానికి ట్రైనర్ నిఖిలేశ్ పాస్వాన్, తన విద్యార్థులకు రోజూ రెండు గంటలు క్లాసులు తీసుకుంటానని చెప్పారు.

"హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్ నేర్పిస్తాం" అన్నారు.

కరోనా కారణంగా తగ్గిన ఉద్యోగాలు

రద్దీగా ఉండే ముసల్లాపూర్ ప్రాంతంలో వీధులు కోచింగ్ సెంటర్లతో నిండిపోయాయి. చిన్న కొట్టు గదిలో కూడా పాఠాలు చెప్పేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని బిహార్ కోచింగ్ హబ్ అనవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ కోసం యువత ఇక్కడికే వస్తుంటారు.

అయితే ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం 2022 మేలో భారతదేశ నిరుద్యోగిత రేటు 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2020, 2021లలో కూడా 7 శాతానికి పైబడి ఉంది.

జీతాలు వచ్చే ఉద్యోగాలు కూడా తగ్గిపోయాయి. కోవిడ్ కారణంగా పలు సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగాల్లో కోత వేశాయి.

2020 లాక్‌డౌన్ సమయంలో యువత, ముఖ్యంగా 15 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎక్కువగా నష్టపోయారని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యయనాల్లో తేలింది.

'అత్యంత భద్రమైన ఉద్యోగం ఇప్పుడు లాటరీ, జూదంలా మారుతుంది'

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం తన విద్యార్థులలో చాలా మందిని కలవరపెట్టిందని నితిశ్ కుమార్ చెప్పారు. ఆయన పట్నాలో ఒక చిన్న కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు.

కొత్త అగ్నిపథ్ పథకం 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు వారి కోసం ప్రవేశపెట్టినది. ఇందులో విజయం సాధించినవారికి నాలుగేళ్ల పాటు ఆర్మీలో ఉద్యోగం ఇస్తారు. వీరిని అగ్నివీరులని పిలుస్తారు. నాలుగేళ్ల తరువాత అగ్నివీరుల్లో కేవలం 25 శాతాన్ని మాత్రమే విధుల్లో కొనసాగిస్తారు.

ఆర్మీ ఖర్చులు తగ్గించే దిశగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆర్మీ బడ్జెట్‌లో సగం కన్నా ఎక్కువ జీతాలు, పెన్షలకే ఖర్చవుతుంది. ఖర్చులు తగ్గితే బలగాలను ఆధునీకరించడానికి అవసరమైన నిధులు విడుదల అవుతాయన్నది కూడా మరో ఉద్దేశం.

"దేశంలో ఉద్యోగాలు లేవు. గత రెండేళ్లుగా నియామకాలు స్తంభించాయి. విద్యార్థులు, తమ తల్లిదండ్రులు చెమటోడ్చి సంపాదించే డబ్బును కోచింగ్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ పథకంలో ఆర్మీ ఉద్యోగాలకు భద్రత లేదు. అయినా కూడా విద్యార్థులు పరీక్షలు కూర్చుంటారు. అత్యంత భద్రమైన ఉద్యోగం ఇప్పుడు లాటరీ, జూదంలా మారుతుంది" అని నితిశ్ కుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Agnipath scheme, agnipath scheme controversy, controversial news, jobs in military,అగ్నిపథ్ స్కీమ్, అగ్నిపథ్ స్కీమ్ వివాదం, వివాదాస్పద వార్తలు, మిలటరీలో ఉద్యోగాలు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X