అగ్నిపథ్ హింసాత్మక నిరసనలు: రైల్వేకు రూ. 700 కోట్లకుపైగా నష్టం, ఒక్క బీహార్‌లోనే
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో రైల్వే శాఖకు భారీ నష్టం సంభవించింది. గత నాలుగు రోజుల్లో బీహార్‌లో ఆందోళనకారులు 11 ఇంజన్‌లతో పాటు 60 రైళ్ల కోచ్‌లను తగులబెట్టారు. ఇన్ని రోజుల వ్యవధిలోనే దాదాపు 700 కోట్ల రూపాయల ఆస్తిని నిరసనకారులు తగులబెట్టారు. అంతే గాక, రైల్వే స్టేషన్లలో స్టాళ్లను తగులబెట్టడంతోపాటు రైల్వేకు చెందిన ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు.

రైల్వే కోచ్ తయారీలకు ఎంత ఖర్చంటే..?
రాష్ట్రంలోని 15 జిల్లాల్లో విధ్వంస ఘటనలు నమోదయ్యాయి. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక సాధారణ కోచ్ నిర్మాణానికి రూ. 80 లక్షలు, స్లీపర్ కోచ్, ఏసీ కోచ్‌కు యూనిట్‌కు వరుసగా రూ.1.25 కోట్లు, రూ.3.5 కోట్లు ఖర్చవుతుంది. ఒక రైలు ఇంజన్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. 12 కోచ్‌ల ప్యాసింజర్ రైలు ధర రూ. 40 కోట్లు, 24 కోచ్‌ల రైలు ధర రూ. 70 కోట్లకు పైనే.

రైల్వేకు రూ. 700 కోట్ల ఆస్తి నష్టం
ఆస్తి నష్టంపై ఇంకా అంచనాలు వేయబడుతున్నాయని, అయితే సుమారు రూ. 700 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని తూర్పు-మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ మీడియాకు తెలిపారు. ఐదు రైళ్లు, 60 కోచ్‌లు, 11 ఇంజన్లు కాలిపోయాయని, ఆస్తి నష్టంపై పూర్తి నివేదికను రైల్వే రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

60 కోట్ల మంది రైల్వే ప్రయాణికుల టికెట్లు రద్దు
ఇది కాకుండా, రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం.. 60 కోట్ల మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. ట్రాక్‌లపై అంతరాయం, రైళ్ల రద్దు ఫలితంగా రైల్వేకు పెద్ద ఆర్థిక దెబ్బ తగిలింది, అయినప్పటికీ శాఖ అధికారిక అంచనాను విడుదల చేసే స్థితిలో లేదు.
రైల్వే ఆస్తుల ధ్వంసం: 700కిపైగా అరెస్ట్
బీహార్ నుంచి విధ్వంసానికి సంబంధించిన నివేదికలు ఇప్పటికీ వస్తున్నాయి. నిరసనకారులు రైళ్లు, అంబులెన్స్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. కాగా, శనివారం బీహార్‌లో హింసకు కారణమైన 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. 250 మందికి పైగా కీలక నిందితులను అరెస్టు చేశారు. మూడు రోజుల్లో మొత్తం 138 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 718 మందిని అరెస్టు చేశారు. సీసీటీవీ, వీడియో ఫుటేజీల ద్వారా హింసకు పాల్పడుతున్న వారిని పట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications