Union Budget 2025: రైతులకు ఏం కావాలి..?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కోసం సామాన్య ప్రజల నుంచి కార్పొరేట్ వర్గాల వరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక రైతులు ఈ బడ్జెట్ పై కొండంత ఆశలు పెట్టుకున్నారు. పీఎం- కిసాన్ నిధుల పెంపు, కనీస మద్దతు ధర, మార్కెట్ సంస్కరణలు తదితర అంశాల్లో కేంద్రం తమను ఆదుకొంటుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై అన్నదాతలు కోటి ఆశలు పెట్టుకున్నారు. కనీస మద్దతు ధర పెంపు, పీఎం కిసాన్ నిధుల పెంపు, కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంపు, వ్యవసాయంలో యాంత్రీకరణ తదితర అంశాలను బడ్జెట్ లో చేర్చాలని వ్యవసాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వ్యవసాయ యంత్రాలపై ఉన్న జీఎస్టీని తొలగించాలని.. విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలని వ్యవసాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలిస్తూ.. తర్వాత పట్టించుకోవడంలేదని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి ధర్మేంద్ర మాలిక్ మండిపడ్డారు. వ్యవసాయ ఖర్చులు అన్ని విభాగాల్లో పెరిగాయని.. వీటిని అధిగమించేందుకు కనీస మద్దతు ధరను పెంచాలన్నారు. ప్రస్తుతం కనీస మద్దతు ధర 23 పంటలకే అందిస్తున్నారని.. ఆ సంఖ్యను పెంచి మరిన్ని పంటలను ఈ కేటగిరీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇలా చేయడం వల్ల మార్కెట్ లో సంబంధిత పంటలకు ధర లేకపోయినా రైతులు నష్టపోకుండా ఉంటారని తెలిపారు.
ఎరువులపై జీఎస్టీ...
ఎరువులు, క్రిమిసంహారక మందులపై ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీను 5 శాతానికి పెంచాలని ధనుక అగ్రిటెక్, ఎమెరిటస్ ఛైర్మన్ ఆర్ జీ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే తక్కువ ధరకే రైతులకు క్రిమిసంహారక మందులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువుల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని.. రైతుల జీవనోపాధి దెబ్బతింటోందన్నారు.
పీఎం కిసాన్ నిధులు రూ. 12వేలకు
మరోవైపు రైతులు.. రసాయన ఎరువులు మానేసి సేంద్రీయ ఎరువులను వ్యవసాయంలో వినియోగించాలని అగ్రికల్చర్ సైంటిస్ట్ దీపక్ పరీక్ తెలిపారు. సేంద్రీయ వ్యవసాయం కారణంగా భూమి సారం పెరుగుతుందని.. తద్వారా అధిక దిగుబడి జరుగుతుందన్నారు. పీఎం కిసాన్ నిధులు రూ. 12వేలకు పెంపు, పంటలు దెబ్బతిన్న సమయంలో ఇచ్చే నష్టపరిహారం పెంపు, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాల వడ్డీ రేట్లను 1శాతానికి తగ్గించడం.. తదితర అంశాలను బడ్జెట్ లో పొందుపరచాలని పరీక్ అన్నారు.
ధాన్యం సంరక్షణకు..
పంటకోత తర్వాత ధాన్యాన్ని నిల్వచేసేందుకు ఉన్న మౌలిక వసతులపై కేంద్రం దృష్టి సారించాలని సోహన్ లాల్ కమ్మోడిటీ మేనేజ్ మెంట్ సీఈఓ సందీప్ సబర్వాల్ అన్నారు. ధాన్యం నిల్వ, తరలింపు, సప్లై చైన్ పై కేంద్ర బడ్జెట్ లో పేర్కొనాలని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ ను రూ. 5లక్షలకు పెంచాలన్నారు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో మరిన్ని అంశాలని చేర్చి పథకాన్ని మరింత దృఢంగా మార్చాలని అన్నారు.
ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి..
కేంద్ర ప్రభుత్వం ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సాల్ వెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా అభిప్రాయపడ్డారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్స్ ను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రస్తుతం భారత్ పామాయిల్ ను అధికంగా దిగుమతి చేసుకుంటోందని.. దిగుమతిని తగ్గించాలన్నారు.












Click it and Unblock the Notifications