Karnataka : కర్నాటకలో 25 సీట్లలో బరిలోకి ఎంఐఎం-జేడీఎస్ తో పొత్తుకు ఓవైసీ ప్లాన్..
కర్నాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కింగ్ మేకర్ పాత్ర పోషించిన జేడీఎస్ బలహీనం కావడంతో ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖీ పోరు తప్పదన్న అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే రాష్ట్రంలో రాజకీయాలు కూడా వేగంగా మారుతున్నాయి. అయితే ఈ పోరులోకి తాము కూడా ఎంట్రీ ఇవ్వాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం నిర్ణయించింది.

ఈసారి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లలో బరిలోకి దిగాలని ఎంఐఎం నిర్ణయించింది. గతంలో హైదరాబాద్ దాటి యూపీ, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎన్నికల బరిలోకి దిగిన ఎంఐఎం .. ఈసారి కర్నాటకలో పోటీ చేయాలని భావిస్తోంది. 2018 ఎన్నికల్లో ఎంఐఎం కర్నాటకలో జేడీఎస్ కు మద్దతు ప్రకటించి తాను పోటీకి దూరంగా ఉండిపోయింది. కానీ ఈసారి మారిన పరిస్ధితుల్లో అక్కడ బీజేపీ చేస్తున్న ముస్లిం వ్యతిరేక రాజకీయాలకు పోటీగా బరిలోకి దిగితే సానుకూల ఫలితాలు వస్తాయని ఓవైసీ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో 2018 ఎన్నికల సందర్భంగా కర్నాటకలో కింగ్ మేకర్ గా ఆవిర్భవించి అధికార భాగస్వామి కూడా అయిన జేడీఎస్ ఈసారి తమ రాజకీయాలతో బలహీనపడింది. ఈ తరుణంలో జేడీఎస్ తో కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకుని బరిలోకి దిగేందుకు ఎంఐఎం సిద్ధమైంది. ఈ మేరకు త్వరలో ఓవైసీ.. జేడీఎస్ నేతలు కుమారస్వామి, దేవెగౌడతో భేటీ అయ్యే అవకాశముంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జేడీఎస్ కు ఈ ఎన్నికల్లో మద్దతివ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎంఐఎం కూడా జత కలిస్తే ఆ పార్టీకి కనీస స్ధానాలు సాధించే అవకాశాలూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications