ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి: స్వీపరే హంతకుడా?
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ట్రైనీ ఎయిర్ హోస్సెస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అంధేరీలోని తన ఫ్లాట్‌లోనే రక్తపు మడుగులో విగతజీవిగా పడివుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ఫ్లాట్‌లో స్వీపర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రూపాల్ ఓగ్రే(25) ఎయిర్ ఇండియాలో ఉద్యోగానికి ఎంపిక కావడంతో ఈ ఏడాది ఏప్రిల్‍లోనే ముంబైకి వచ్చింది. అంధేరీలోని ఓ మౌసింగ్ సొసైటీలోని ప్లాట్‌లో తన సోదరి, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం రూపాల్ కుటుంబసభ్యులు ఎంతగా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ముంబైలోని ఆమె స్నేహితులకు కాల్ చేసి ఫ్లాట్‌కు వెళ్లాలని కోరారు.

ఈ క్రమంలో ఆమె స్నేహితులు ఫ్లాట్‌కు వెళ్లి చూడగా.. లోపలి నుంచి లాక్ చేసి ఉంది. దీంతో అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళారు. రక్తపు మడుగులో ఉన్న రూపాల్‌ను గుర్తించారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే రూపాల్ మృతి చెందిందని వైద్యులు నిర్ధరించారు.
ఈ కేసులో 40 ఏళ్ల వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడు విక్రమ్ అత్వాల్.. అదే హౌసింగ్ సొసైటీలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, కొద్ది రోజుల క్రితం రూపాల్ కు, అతడికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని గుర్తించారు.
ఈ కేసులో ఆధారల కోసం హౌసింగ్ సొసైటీలోని కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అత్వాల్ భార్యను కూడా విచారిస్తున్నారు. పోలీస్ డిప్యూటీ కమిషనర్ సత్తా సల్వాడే ఈ ఘటనపై మాట్లాడుతూ.. రూపాల్ ఓగ్రే గొంతుపై నిందితుడు పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు చెప్పారు. రూపాల్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు. లైంగికదాడి జరిగినట్లు ప్రాథమికంగా వైద్యులు చెప్పలేదన్నారు.












Click it and Unblock the Notifications