Air India Plane Crash: భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు..!
Air India Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం వందల మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయి చాలా మంది దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయి గుండెలవిసేలా విలపిస్తున్నారు. లండన్‌లో స్థిర పడిన ఓ భారతీయుడు తన భార్య చివరి కోరికను తీర్చేందుకు వచ్చి విమాన ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో లండన్ నివాసి అర్జున్ పటోలియా(36) ప్రాణాలు కోల్పోయారు. తన భార్య చివరి కోరిక తీర్చడానికి అర్జున్ పటోవియా గుజరాత్‌లోని నర్మదా నదిలో తన భార్య అస్థికలను నిమజ్జనం చేయడానికి భారత్‌కు వచ్చారు. అర్జున్ భార్య భారతీబెన్ వారం రోజుల క్రితం లండన్‌లో మరణించారు. ఆమె చనిపోయే ముందు తన అస్థికలను తన స్వదేశానికి తిరిగి తీసుకెళ్లమని భర్తను కోరారు. తన భార్య కోరిక మేరకు అర్జున్ తన 4,8 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలను లండన్‌లోనే వదలి ఇటీవలే ఇండియాకు వచ్చాడు.

వాడియాలో బంధువులతో కలిసి తన భార్య అస్థికలను నర్మదా నదిలో కలిపిన అర్జున్ పటోలియా..లండన్‌కు తిరుగు పయనం అయ్యాడు. గురువారం అర్జున్ పటోలియా తన భార్య చివరి కోరికను తీర్చిన ఆనందంలో లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయం వెళ్లే ఎయిరిండియా విమానం ఎక్కారు. అంతే కొన్ని నిమిషాల్లోనే అర్జున్ ప్రాణం గాల్లో కలిసిపోయింది. కొన్ని క్షణాల్లోనే ఎయిరిండియా విమానం అహ్మదాబాద్‌లోనే కుప్పకూలింది. తండ్రి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. తల్లిని కోల్పోయిన దుఃఖం నుంచి బయటపడకముందే ఇప్పుడు ఊహించని ప్రమాదంలో తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు చిన్నారులు దుఃఖసంద్రంలో మునిగిపోయారు.
ఎయిరిండియా విమానం ఏఐ-171 అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ భారీ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ నివాస ప్రాంతంలోని ఒక వైద్య కళాశాల హాస్టల్‌పై కుప్పకూలింది. ఈ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులతో సహా 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. కేవలం ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాద స్థలాన్ని సందర్శించి అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో గాయపడిన వారిని కలిశారు. అక్కడ బాధితుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్ట్-మార్టం పరీక్షల కోసం 70 నుండి 80 మంది వైద్యులతో కూడిన బృందాన్ని నియమించారు. ఇప్పటివరకు, ఐదుగురు బాధితులను గుర్తించి, వారి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలిలో ఫోరెన్సిక్ బృందాలు ఉన్నాయి. విమానయాన అధికారులు అధికారిక విచారణను ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఎయిరిండియా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయికే బాధిత కుటుంబాలకు అత్యవసర మద్ధతు అందిస్తున్నట్లు పేర్కొంది.
Heartbreak Over the Skies: Gujarat Man’s Tragic Journey Ends in Air India Crash
— NewsNowNation (@NewsNowNation) June 13, 2025
Arjunbhai Manubhai Patoliya, a Gujarat native from Vadiya, faced unimaginable loss. After his wife’s recent passing in London, he traveled to his hometown to honor her final rites, leaving their two… pic.twitter.com/OkycCA52Dp












Click it and Unblock the Notifications