ఎయిర్ ఇండియా ప్రయాణికులకు భారీ షాక్-70 శాతం విమానాలు డౌటే ?
ఎయిర్ ఇండియా (Air India) ప్రయాణికులకు కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. గతేడాది జనవరి నుంచి దేశీయ ఎయిర్ లైన్స్ పై జరుపుతున్న తనిఖీల్లో ఓ కీలక విషయం బయటపడింది. దేశంలోనే అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్ధల్లో ఒకటైన ఎయిర్ ఇండియాకు ఉన్న విమానాల్లో ఏకంగా 70 శాతం తరచూ సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ విషయాన్ని అధికారికంగా పార్లమెంట్ లోనే వెల్లడించింది.
70 శాతం విమానాల్లో సమస్యలే (air india)
నిన్న పార్లమెంట్ లో వెల్లడించిన అధికారిక డేటా ప్రకారం ఎయిర్ ఇండియా గ్రూప్ విమానాల తనిఖీలో ప్రతి పది విమానాలలో ఏడు కంటే ఎక్కువ పునరావృత సాంకేతిక లోపాలను చూపిస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఇలాంటి సమస్యలతో సమీక్షించాల్సిన దేశీయ విమానయాన సంస్థల జాబితాలో ఎయిర్ ఇండియా టాప్ లో ఉన్నట్లు తెలిపింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ లోక్‌సభలో ఈ వివరాలు వెల్లడించారు.

తనిఖీల్లో షాకింగ్ అంశాలివే
కేంద్రం లెక్కల ప్రకారం గతేడాది నిర్వహించిన తనిఖీలలో ఎయిర్ ఇండియా గ్రూప్ నడుపుతున్న 267 విమానాలలో 191 పునరావృత లోపాల్ని గుర్తించారు. ఎయిర్ ఇండియా గ్రూపుకు చెందిన 166 ఎయిర్ ఇండియా విమానాలలో 137, అలాగే 101 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలలో 54 తనిఖీల సమయంలో పునరావృత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. అయితే తమ విమానయాన సంస్ధలో ప్రతీ విమానాన్నీ నిశితంగా పరిశీలించడం వల్లే ఇలాంటి సమస్యలు బయటపడుతున్నట్లు ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందులో చాలా వరకూ విమానాల భద్రతకు సంబంధించినవి కావని తెలిపాయి.












Click it and Unblock the Notifications