మద్యం ప్రియులకు షాక్.. వైన్ షాపుల వేళల్లో మార్పులు!
దేశ రాజధాని ఢిల్లీలో ఈ వారాంతంలో వైన్ షాపులకు వెళ్లేవారికి ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. సాధారణంగా రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండే మద్యం దుకాణాలను ఈ రెండు రోజులు రెండు గంటల ముందే.. అంటే రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు చేపట్టిన ఉధృత ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యగా ఢిల్లీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

పోలీసుల హెచ్చరికలతో అలర్ట్
కేంద్ర ఢిల్లీ పరిధిలో రక్షణ, శాంతిభద్రతల నిర్వహణపై ఢిల్లీ పోలీసు విభాగం సేకరించిన ముందస్తు సమాచారం ఆధారంగానే ఈ ఆంక్షలు విధించారు. వీకెండ్‌లో ఆందోళనకారులు, జనాలు గుమిగూడే అవకాశం ఉండటంతో గొడవలు జరగకుండా నివారించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే గురువారం రోజున ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే నగరం వ్యాప్తంగా పలు షాపులను హఠాత్తుగా మూసివేయడంతో కొనుగోలుదారులు తీవ్ర నిరాశతో ఖాళీ చేతులతో వెనుతిరిగిన పరిస్థితి కనిపించింది.
శాంతిభద్రతల పరిరక్షణకే ఈ నిర్ణయం
ఈ నిర్ణయం కేవలం తాత్కాలికమేనని, ప్రజల భద్రత, నగరంలో శాంతిభద్రతలను కాపాడటంలో భాగమేనని అబకారీ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ శని, ఆదివారాల ఆంక్షల తర్వాత, ప్రభుత్వం నుంచి మరే ఇతర కొత్త ఆదేశాలు రాకపోతే మళ్లీ ఎప్పటిలాగే రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు నడుస్తాయని వెల్లడించాయి. ప్రస్తుతానికైతే జంతర్ మంతర్ పరిసరాల్లో బిగించిన భద్రతతో పాటు షాపుల వేళల తగ్గింపుతో ఢిల్లీ మద్యం షాపుల వద్ద హడావుడి నెలకొంది.












Click it and Unblock the Notifications