ఎయిర్ ఏసియా నుంచి భారీ డిస్కౌంట్ సేల్: టిక్కెట్ ధర ఎంతంటే...
ఎయిర్ ఏషియా ప్రయాణికులకు భారీ ఆఫర్లను ప్రకటించింది. పరిమిత కాలంతో దేశీయంగా ప్రయాణించే వారికి ప్రారంభ ధర రూ.1099లకు, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారి కోసం రూ.2999లకే టికెట్‌ను అందించనుంది.
ముంబయి: భారత్‌లో సర్వీసులను అందించే మలేషియా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రయాణికులకు భారీ ఆఫర్లను ప్రకటించింది. పరిమిత కాలంతో దేశీయంగా ప్రయాణించే వారికి ప్రారంభ ధర రూ.1099లకు, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారి కోసం రూ.2999లకే టికెట్‌ను అందించనుంది.
దేశీయంగా బెంగళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్, కోచి, గోవా, శ్రీనగర్, రాంచి, కోల్‌కతా ప్రాంతాలకు నడిచే ఎయిర్‌ఏషియా విమానాల్లో ఈ అవకాశం కల్పించినట్లు సంస్థ అధికారులు వెల్లడించారు.

జూన్ 4 నుంచి 11వ తేదీ లోపు బుక్ చేసుకున్న వారికే రాయితీ లభిస్తోందన్నారు. 2018 జనవరి 15వ తేదీ నుంచి 2018 ఆగస్ట్ 28వ తేదీ మధ్య ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఆసియా, ఆస్ట్రేలియా వ్యాప్తంగా 120 ప్రాంతాల్లోని ప్రయాణికులకు డిస్కౌంట్ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుందని ఎయిర్ ఏషియా సంస్థ పేర్కొంది. ఈ ఆఫర్ కేవలం ఒక వైపు ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుందని, విమానాశ్రయ రుసుం వంటి అన్నిరకాల ఛార్జీలు అందులోనే ఉంటాయని అధికారులు వివరించారు.
ఎయిర్ ఏషియా బెర్హాద్, థాయ్ ఎయిర్ ఏషియా, ఇండోనేషియా ఎయిర్ ఏషియా ఎక్స్ ఆధ్వర్యంలో నడిచే విమానాల్లో కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రాబి వంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రూ. 2999ల ప్రారంభ ధరతో టికెట్ లభిస్తుందని సంస్థ అధికారులు తెలిపారు.
సిడ్నీ, మెల్‌బోర్న్, కొరియా, బాలి ప్రాంతాలకు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారికి కేవలం రూ.11,999 లకే టికెట్ అందిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి బిగ్ సేల్ ఆఫర్ ఎంతో బాగుంటుందని ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో అమర్ అబ్రోల్ వివరించారు.












Click it and Unblock the Notifications