Maha Crisis : షిండేను తప్పించేందుకే అజిత్ ఎంట్రీ ? సామ్నా సంచలనం...
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఫిరాయింపు వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. అజిత్ ఫిరాయింపు ఎపిసోడ్ ఎన్సీపీకి ఇచ్చిన షాక్ కే పరిమితం అయ్యేలా కనిపించడం లేదు. ఎన్డీయే సర్కార్ లో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ను తీసుకున్న బీజేపీ నిర్ణయం వెనుక ఏముందనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఎన్సీపీ సంక్షోభంపై శివసేన (ఉద్ధవ్) వర్గం పత్రిక సామ్నా తన సంపాదకీయంలో చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేసేలా ఉన్నాయి.
మహారాష్ట్రలో నిన్న చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల మధ్య రాత్రి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్.. ఇవాళ తన వర్గం నేతలకు కేటాయించే పదవులపై మరో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. మరోవైపు పవార్ నివాసం వద్దకు ఆయన వర్గం నేతలు భారీగా చేరుకుంటున్నారు. పదవులపై లాబీయింగ్ కోసం వీరంతా తరలివస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని ఫిరాయించగలిగితే తనకు ప్రయోజనం ఉంటుందని, పార్టీ చీలిక సంపూర్ణం అవుతుందని అజిత్ భావిస్తున్నారు.

ఈ ఉదయం తిరుగుబాటు ఎన్‌సిపి ఎమ్మెల్యేలను కలిసిన కొన్ని గంటల తర్వాత అజిత్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన నివాసంలో కలిశారు. తనతో పాటు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల్లో 8 మందికి మంత్రి పదవులు ఇవ్వాలనే ఒప్పందంపై, వారి శాఖలపై ఫడ్నవీస్ తో అజిత్ పవార్ చర్చించినట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలనే విషయంలో వీరిద్దరి మధ్య జరిగే చర్చల తర్వాత షిండేకు వీరు ప్రతిపాదనలు సమర్పించనున్నారు.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి) పత్రిక సామ్నా మహారాష్ట్రలో తాజా పరిణామాలపై సంచలన కథనం ప్రచురించింది. ఇందులో నిన్న ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎన్‌సిపి ఫిరాయింపు నేత అజిత్ పవార్ త్వరలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్థానంలోకి వస్తారని పేర్కొంది. దీంతో బీజేపీ వ్యూహం ఇదేనా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఈ పదవుల పంపకం వ్యవహారాన్ని త్వరగా పూర్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications