అఖిలేష్‌కు మమత ఫోన్: తండ్రితో సంధి చేసుకోవాలని సూచన
పార్టీలో తాజా పరిస్థితుల నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.
లక్నో: పార్టీలో తాజా పరిస్థితుల నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అఖిలేష్‌కు ఫోన్ చేశారు. తన మద్దతు ప్రకటించారు.
తాజా పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు గవర్నర్ రామ్ నాయక్ చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి కాన్‌స్టిట్యూషనల్ క్రైసిస్ లేవని గవర్నర్ చెప్పారు. మరోవైపు యూపీ డీజీపీ జావెద్ అహ్మద్ ముఖ్యమంత్రి అఖిలేష్‌ను కలిశారు.

అఖిలేష్ రాజీనామా చేయాలి
ప్రస్తుత పరిస్థితుల్లో నైతికంగా అయితే అఖిలేష్ యాదవ్ రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పరిస్థితులు బాధాకరమని కాంగ్రెస్ నేత సుర్జేవారా అన్నారు. ఇదిలా ఉండగా తండ్రితో సంధి చేసుకోమని, ఆయనను క్షమాపణ కోరమని అఖిలేష్ యాదవ్‌కు పలువురు సన్నిహితులు సూచిస్తున్నారు.
కాగా, సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం రోజు రోజుకీ ముదురుతోంది. ఎస్పీ అధ్యక్షులు ములాయం సింగ్ శుక్రవారం తన తనయుడు, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌పై బహిష్కరణ వేటు వేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 325 మంది అభ్యర్థుల జాబితాను ములాయం రెండు రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే.
దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అఖిలేశ్ సొంతంగా గురువారం రాత్రి మరో 235 మంది సభ్యుల జాబితాను విడుదల చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ములాయం షోకాజు నోటీసులు పంపించారు. మీడియా ఎదుట పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు గాను మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్‌కు షోకాజ్ నోటీసులు పంపించారు. పార్టీ నుంచి అఖిలేష్, రాంగోపాల్‌ను బహిష్కరిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.












Click it and Unblock the Notifications