యోగీ ఇంటి కింద శివలింగం? తవ్వి తీయాలనే డిమాండ్లు..!
మసీదుల, దర్గాల కింద శివలింగాలు, పురాతన ఆలయాలు ఉన్నాయంటూ హిందూ వర్గాలు, బీజేపీ నాయకులు కోర్టుల్ని ఆశ్రయిస్తున్న వేళ ఉత్తర్ ప్రదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాక్ష్యాత్తు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇంటి కిందే శివలింగం ఉందంటూ సమాజ్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడెక్కడో తవ్వి ఉపయోగం లేదని ప్రభుత్వానికి తేల్చిచెప్పేశారు. దీంతో అఖిలేష్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఉత్తర్ ప్రదేశ్ లోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో తవ్వకాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిపిన పురావస్తు సర్వేలో 1857 తిరుగుబాటు నాటి 250 అడుగుల లోతున్న మెట్ల బావి బయటపడటం రాజకీయంగా ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాల్లో పురాతన వస్తువులు, స్ధలాల తవ్వకాలు జరుపుతున్నారని, అలాగే సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇంటి కింద కూడా తవ్వకాలు చేయాలన్నారు.

దేశంలో ప్రార్ధనా స్దలాల చట్టం అమల్లో ఉందని, ప్రతీ చోటా తవ్వకాలు జరుపుతామంటే కుదరదని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పాటు హిందూ వర్గాలకు అఖిలేష్ యాదవ్ చురకలు అంటించారు. ఇలా తవ్వకాలు, తవ్వకాలు అంటూ ఒకరోజు సొంత ప్రభుత్వాన్నే వారు తవ్వేకుకుంటారని సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ సెటైర్లు వేశారు. గత వారం సంభాల్ లోని చందౌసీలో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు సర్వే చేపట్టాయి. ఇందులో పాత మెట్ల బావిని గుర్తించారు.
ఈ మెట్లబావిలో నాలుగు గదులు ఉన్నాయని, ఇది మొత్తం 400 చదరపు అడుగుల నిర్మాణమని తాజాగా జిల్లా మెజిస్ట్రేట్ నిర్దారించారు. ఇందులో నేల మార్బుల్ రాళ్లు, ఇటుకలతో నిర్మించి ఉందని కూడా వెల్లడించారు. రెండు, మూడు అంతస్దులు మార్బుల్ తో నిర్మించారని, పైన ఉన్న అంతస్ధులు ఇటుకలతో కట్టారని తెలిపారు. ఇది 150 ఏళ్ల కిందటి నిర్మాణం అయి ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. 46 ఏళ్లుగా ఇది మూసేసి ఉందన్నారు. దీన్ని ఇప్పుడు తెరిచామన్నారు.












Click it and Unblock the Notifications