తొలిసారి ఎన్నికల బరిలో అఖిలేష్ యాదవ్-ఎస్పీ కంచుకోట కర్హాల్ నుంచి పోటీకి రెడీ
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోరులో తొలుత పోటీ చేయరాదని నిర్ణయించుకున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. తాజాగా మనసు మార్చుకున్నారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభావం తనపై పడకుండా ఉండేందుకు తాను కూడా పోటీలో ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు అఖిలేష్ యాదవ్ పోటీ కోసం సమాజ్ వాదీ పార్టీ నియోజవర్గాన్ని ఎంపిక చేసింది.
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పశ్చిమ యూపీలోని మెయిన్ పురి జిల్లాలో ఉన్న కర్హాల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని ఇవాళ పార్టీ ప్రకటించింది. సమాజ్ వాదీ పార్టీ కంచుకోట అయిన మెయిన్ పురి జిల్లాలో ప్రతీ నియోజకవర్గం ఆ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. మెయిన్ పురి లోక్ సభ స్ధానం నుంచి అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఎంపీగా ఉన్నారు. దీంతో ఇదే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీటు కర్హాల్ నుంచి తాను బరిలోకి దిగాలని అఖిలేష్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అఖిలేష్ పోటీ నిర్ణయాన్ని ప్రకటించిన పార్టీ నేతలు.. లక్నోను ఐటీ హబ్‌గా మారుస్తామని, ఈ రంగంలో యువతకు 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అజంగఢ్ ఎంపీగా ఉన్న అఖిలేష్ తన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై నిర్ణయం తీసుకుంటానని గతంలో చెప్పారు. కర్హల్‌లో ఫిబ్రవరి 20న ఓటింగ్ జరగనుంది. మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం వరుసగా తొమ్మిది సార్లు సమాజ్ వాదీ పార్టీ చేతుల్లోనే ఉంది. సిట్టింగ్ ఎంపీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇక్కడి నుంచి ఐదోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ మెయిన్‌పురి జిల్లా యూనిట్ గురువారం పార్టీ చీఫ్‌కి కర్హల్ స్థానం నుంచి పోటీ చేయాలని లిఖితపూర్వకంగా కోరగా, ఆయన అంగీకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications