Jharkhand Elections: అక్కడ గెలిస్తే జార్ఖండ్ బీజేపీదే..! ఎందుకో తెలుసా ?
జార్ఖండ్ లో ఇవాళ తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 81 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీకి రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇవాళ జరుగుతున్న తొలి దశలో భాగంగా 43 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. అందులోనూ ఓ 14 సీట్లు చాలా కీలకంగా మారిపోయాయి. ఇవన్నీ రాష్ట్రంలోని సహజవనరులు అధికంగా ఉన్న గిరిజనుల అడ్డా కొల్హాన్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పుడు వీటిని గెలిస్తే జార్ఖండ్ గెలిచినట్లే అన్న భావన బీజేపీలో కనిపిస్తోంది.
జార్ఖండ్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నా కొల్హాన్ ప్రాంతంలో ఇండియా కూటమికి ఉన్న పట్టును ఛేదించగలిగితేనే బీజేపీ గెలుపు అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి 14 సీట్లలో జేఎంఎం 11 సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లలో గెలిచింది. మరో స్ధానంలో స్వతంత్ర అభ్యర్ధి సరయూరాజ్ బీజేపీ ఆశలకు గండికొడుతూ ఆ పార్టీ అప్పటి సీఎం రఘుబర్ దాస్ ను ఓడించారు. దీంతో బీజేపీకి చావుదెబ్బ తగిలింది. కోల్హాన్, పశ్చిమ సింగ్‌భూమ్, సరైకేలా ఖర్సవాన్, తూర్పు సింగ్‌భమ్‌లతో కూడిన ప్రాంతంలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి.

చూడటానికి 14 సీట్లే అయినా కొల్హాన్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించే వారిదే రాష్ట్రం అన్నట్లుగా జార్ఖండ్ రాజకీయాలు మారిపోయాయి. దీనికి కారణం ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్న గిరిజన జనాభా ప్రభావమే. ఇక్కడి గిరిజనులు వేసే ఓట్ల ప్రభావం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపైనా ఉంటుంది. గతంలో జేఎంఎంలో ఉండి సీఎం పదవి కూడా అనుభవించి ఆ తర్వాత బీజేపీలో చేరిపోయిన సీఎం హేమంత్ సోరెన్ బాబాయ్ చంపై సోరెన్ ప్రభావం కొల్హాన్ లో ఎక్కువే. దీంతో ఆయన్ను చేర్చుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా ఇక్కడ ఆధిపత్యంపై ధీమాగా కనిపిస్తోంది.
దశాబ్దాలుగా కొల్హాన్ జార్ఖండ్‌లోని అత్యంత శక్తిమంతమైన రాజకీయ ప్రముఖుల కోటగా ఉంది. వీరిలో అర్జున్ ముండా, మధు కోడా, చంపై సోరెన్, రఘుబర్ దాస్ వంటి నేతలు ఇక్కడి నుంచే గెలిచారు. 2019లో ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించిన జేఎంఎం ఈసారి కూడా దాన్ని రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది. బీజేపీ దాన్ని బ్రేక్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.












Click it and Unblock the Notifications