ఎస్పీలోకి అమర్ సింగ్ రీ-ఎంట్రీ : జయప్రద ఆశలకు మోజులు
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది అక్కడి అధికార పార్టీ సమాజ్ వాదీ. సీఎం అఖిలేష్ యాదవ్ పాలన పట్ల అక్కడి జనాల్లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయి ఉండడంతో, పార్టీలో కొత్త చేరికల ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే.. మాజీ రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ ను తిరిగి పార్టీలోకి చేర్చుకుంది సమాజ్ వాదీ పార్టీ. అమర్ సింగ్ తో పాటు కాంగ్రెస్ నేత బ్రేణి ప్రసాద్ వర్మ కూడా సమాజ్ వాద్ పార్టీలో చేరారు. 2010 లో సమాజ్ వాదీ పార్టీకి అమర్ సింగ్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. అమర్ సింగ్ ను పార్టీ తరుపున మళ్లీ రాజ్యసభకు పంపించే ప్రయత్నాలు జరగవచ్చని తెలుస్తోంది.

అన్ని రాజకీయ పార్టీల్లోనూ అమర్ సింగ్ కు సన్నిహిత సంబంధాలు ఉండడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి లాభిస్తుంది అనే ఆలోచనలో ఉంది సమాజ్ వాదీ నాయకత్వం. ఇకపోతే, అదే అమర్ తో పాటే నేనూ అన్నట్టుగా వ్యవహరించే జయప్రద ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీలో చేరతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
బాలీవుడ్ లో చాలామందే అభిమానులున్న జయప్రదకు యూపీలోను ఫాలోయింగ్ ఎక్కువ. ఈ నేపథ్యంలోనే జయప్రద కూడా సమాజ్‌వాదీలో తిరిగి చేరవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. అయితే అమర్‌సింగ్, జయప్రద అంటే ఏ మాత్రం గిట్టని యూపీ మంత్రి ఆజం ఖాన్ వీరి రాకపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అమర్ సింగ్ రాకతో ఆయన పార్టీలోనే కొనసాగుతారా.. లేక పార్టీ నుంచి పక్కకు తప్పుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications