• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి పాదయాత్ర: రైతుల ఉద్యమమా, రాజకీయ పోరాటమా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అమరావతి పాదయాత్ర

"అమరావతి పేరుతో సాగుతున్న పాదయాత్రని ఆపాలంటే మాకు 5 నిమిషాల పని".. ఈ మాటలు అన్నది ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

"అది ఒళ్లు బలిసిన వాళ్ల యాత్ర. అందులో పాల్గొన్న వాళ్లంతా ధనికులే".. ఇది ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్య.

ఈ ఇద్దరు మంత్రులు మాత్రమే కాదు, ఇప్పటికే అనేక మంది మంత్రులు 'అమరావతి రైతుల' పాదయాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మహా పాదయాత్ర’ పేరుతో అమరావతి నుంచి అరసవల్లి వరకు సాగుతున్న యాత్రను ఘాటుగా విమర్శిస్తున్నారు.

పాదయాత్రలో పాల్గొంటున్న వారు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు. గుడివాడలో జరిగిన పరిణామాలు అందుకు నిదర్శనం. మాజీ ఎంపీ మాగంటి బాబు చెప్పు తీసి చూపించడం, టీడీపీ మహిళా నేతలు కారు పైకి ఎక్కి తొడలు కొట్టడం వంటి పరిణామాలు చర్చకు దారితీశాయి.

గుడివాడలో పోలీసులు అనూహ్యంగా బలగాలను మోహరించడం, రక్షణ పేరుతో చేసిన హడావుడికి ప్రతిస్పందనగా తాము అలా చేసినట్టు వారు వివరణ కూడా ఇచ్చారు.

ఇప్పటికే 15 రోజులు దాటిన ఆ యాత్ర మూడు జిల్లాలు దాటింది. మరో ఆరు జిల్లాల్లో సాగాల్సి ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో దీనికి పోటీగా యాత్రలు చేపట్టేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో అమరావతి యాత్ర చుట్టూ సాగుతున్న పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి.

అమరావతి పాదయాత్ర

కోర్టు ఆదేశాలతోనే రెండో యాత్ర

అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికే ఒక పాదయాత్ర నిర్వహించారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లలో అమరావతి నుంచి తిరుమల వరకు.. దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ మీదుగా తొలి యాత్ర సాగింది.

అప్పట్లో ప్రకాశం జిల్లాల్లోని కొన్నిచోట్ల పాదయాత్ర సందర్భంగా కొంత ఉద్రిక్తత ఏర్పడినా చివరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగిసింది.

అయితే, తొలి పాదయాత్రకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో కొన్ని ఆంక్షల మధ్య అనుమతి ఇచ్చారు. ఈసారి కూడా ప్రభుత్వం పాదయాత్రకు అంగీకరించలేదు. అందుకు అనుమతి లేదంటూ డీజీపీ ఆఫీసు తెలిపింది.

కానీ, ఏపీ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో 'మహా పాదయాత్ర' పేరుతో రెండో విడత యాత్రను ప్రారంభించారు.

ఈ యాత్ర తొలుత గుంటూరు జిల్లాలో మొదలైంది. బాపట్ల, కృష్ణా జిల్లాల్లో పూర్తి కాగా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో సాగుతోంది.

అమరావతి తొలి పాదయాత్ర

రాష్ట్రమంతా విస్తరించే లక్ష్యం...

2019 డిసెంబర్ 19న మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచి అమరావతి పరిరక్షణ పేరుతో ఉద్యమం సాగుతోంది.

'మూడు రాజధానులు వద్దు- ఏకైక రాజధానిగా అమరావతి ముద్దు' అంటూ ఉద్యమం జరుగుతోంది.

చాలా కాలం పాటు అమరావతి ప్రాంతంలోనే నిరసనలు సాగాయి. ఈ ఆందోళనలకు వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. నాడు నిరసనల్లో కొన్నిసార్లు ఉద్రిక్త పరిణామాలు, అరెస్టులు, లాఠీఛార్జీలు చోటుచేసుకున్నాయి.

కరోనా సంక్షోభం కారణంగా ఉద్యమ కార్యాచరణకు కొంత ఆటంకం కలిగినప్పటికీ, 'అమరావతి పరిరక్షణ' కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అమరావతి ప్రాంతంలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి వంటి ప్రాంతాల్లో శాశ్వత నిరసన శిబిరాలు కూడా వెలిశాయి.

ఈ ఉద్యమం కేవలం కొన్ని గ్రామాలకే పరిమితం కాకుండా, రాష్ట్రమంతా 'అమరావతి పరిరక్షణ' నినాదం వ్యాపించేలా చేయాలనే లక్ష్యంతో పాదయాత్రలు మొదలు పెట్టారు. తొలి విడత తిరుమల వరకు చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని భావించిన జేఏసీ నాయకులు, ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు యాత్ర ప్రారంభించారు. ఈసారి శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి ఆలయం వరకు ఈ యాత్ర జరగనుంది.

అమరావతి

పోటీ ఉద్యమాలు

అమరావతిలోనే బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో, మూడు రాజధానులకు మద్దతుగా చాలా కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. 2020లో మొదలైన నిరసన శిబిరం నేటికీ కొనసాగుతోంది.

ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు ఈ ధర్నా శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ఆందోళనకారులు వచ్చి అమరావతి పరిరక్షణ ఉద్యమానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, మూడు రాజధానుల అంశంలో ప్రభుత్వ వైఖరిని సమర్థించడం జరుగుతోంది.

ఇంతకుముందు 'అమరావతి పరిరక్షణ' అంటూ చేపట్టిన పాదయాత్రల సమయంలోనూ కొన్ని చోట్ల పోటీ కార్యక్రమాలు జరిగాయి.

మొదటి పాదయాత్ర సమయంలో నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లిలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల నుంచి పోటీ కార్యక్రమాలు కనిపించాయి.

ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైపు పాదయాత్ర సాగుతున్న దశలో పోటీ కార్యక్రమాలకు అధికార పార్టీ నాయకులు తెర తీశారు. విశాఖ రాజధానికి మద్దతుగా ఉత్తరాంధ్ర హక్కుల కోసమంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఓ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

'అమరావతి పరిరక్షణ' పేరుతో సాగుతున్న యాత్రను ఉత్తరాంధ్రపై దండయాత్రగా వారు పేర్కొంటున్నారు. త్వరలోనే ఉత్తరాంధ్ర హక్కుల కోసం ఓ యాత్ర చేపడతామంటూ కొందరు ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు.

దాంతో, గోదావరి జిల్లాలు దాటుకుని ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే సమయానికి ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో అనే ఆందోళన అంతటా కనిపిస్తోంది. అధికార పార్టీ అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని రాజకీయంగా ఎదుర్కొనే ఆలోచనలో ఉన్నట్టు మంత్రుల ప్రకటనలు ద్వారా తెలుస్తోంది.

'రాజకీయాల కోసమే..'

చంద్రబాబు సహా టీడీపీ నేతలకు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే అవకాశం లేకపోవడంతో, అమరావతి పాదయాత్ర పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసమే వస్తున్నారని ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

"ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అన్ని విధాలుగా అడ్డుపడుతున్నారు. ఇప్పటికే రాజధానిగా విశాఖ ఓ రూపం సంతరించుకునేది. కానీ అసెంబ్లీ చేసిన చట్టాన్ని అడ్డదారిలో అడ్డుకున్నారు. ప్రజల ఆకాంక్ష అమలుకాకుండా మోకాలడ్డారు. చట్టపరమైన చిక్కులు తొలగించి త్వరలో విశాఖను రాజధాని నగరంగా మార్చే ప్రక్రియ వైపుగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకే తమ రాజకీయ లక్ష్యాల సాధన కోసం రైతుల ముసుగులో టీడీపీ నేతలు యాత్ర చేస్తున్నారు. గుడివాడలో గానీ, ఏలూరులో గానీ ఎక్కడైనా టీడీపీ నేతలే యాత్ర చేస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ ఉద్యమమే తప్ప రైతులకు సంబంధమే లేదు" అని మంత్రి విమర్శించారు.

"రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడుకోవాలనే చంద్రబాబు రాజకీయ అవసరాల రీత్యా ఆ యాత్ర జరుగుతున్న సంగతి ప్రజలందరికీ తెలుసునని" మంత్రి అప్పలరాజు బీబీసీతో అన్నారు. ఇలాంటి యాత్రలకు ఆదరణ ఉండదని, ఉత్తరాంధ్రవాసులు వారి ప్రయత్నాలను తిప్పికొడతారని ఆయన అన్నారు.

'రైతుల ఉసురు తప్పదు'

"అమరావతి కోసం భూములు ఇచ్చినప్పుడు వారు రైతులు. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులయ్యారా?" అంటూ అమరావతి జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి ప్రశ్నించారు.

"ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగానూ అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. హైకోర్టు నుంచి పాదయాత్రకు అనుమతులు తీసుకోవాల్సిన దుస్థితి ఉందంటే ఎంత నిరంకుశంగా ఉన్నారో అర్థమవుతోంది. రైతుల యాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తుండడంతో అధికార పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. పోలీసులను ఉపయోగించి అనవసర ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. 15 రోజుల్లో ఎక్కడా లేనిది గుడివాడలో ఎందుకు పోలీసులు అతిగా స్పందించాలి? ఇలాంటి ప్రయత్నాలు మా యాత్రను అడ్డుకోలేవు. ప్రభుత్వ కుయుక్తులు చెల్లవు. అమరావతి యాత్ర లక్ష్యాలకు అనుగుణంగా సాగుతోంది. ప్రభుత్వ తీరును ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో చేపట్టిన యాత్ర ఎన్ని ఆటంకాలు వచ్చినా అరసవల్లి వరకు సాగుతుంది. దీన్ని ఆపేది లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర రాజధాని కోసం అడిగిన వెంటనే భూములిచ్చిన రైతులతో ఆటలాడుకోవడం సమంజసం కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపడానికి అడ్డంకులు సృష్టించడం తగదని శివారెడ్డి బీబీసీతో అన్నారు. ఇలాంటి ప్రయత్నాలతో రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని వ్యాఖ్యానించారు.

అమరావతి పాదయాత్ర

'ఉద్యమకారులపై నిందలా..'

అమరావతి రాజధాని మీద అనేక ముద్రలు వేసి ప్రజల్లో అపోహలు సృష్టించిన వారే ఇప్పుడు ఉద్యమంలో ఉన్న వారి మీద నిందలు వేస్తున్నారని అమరావతి పరిరక్షణ ఉద్యమ నాయకురాలు డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు.

"ఉద్యమంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మా యాత్ర పొడవునా అన్ని గ్రామాల్లోనూ మహిళలే ఎక్కువగా కదులుతున్నారు. అందుకే మహిళల మీద నిందా ప్రచారం చేస్తున్నారు. అమరావతి పాదయాత్రకు అండగా ఉన్నవారిని, పాల్గొంటున్న వారిని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలతో మమ్మల్ని ఆపలేరు. మూడు రాజధానుల పేరుతో మూడేళ్లు వృధా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఇప్పటికైనా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలి. అమరావతిని అభివృద్ధి చేయాలి. అప్పటివరకూ మా పోరాటం ఆగదు" అని ఆమె బీబీసీతో అన్నారు.

గుడివాడలో వేలమంది పోలీసులను మోహరించి, అడుగడుగునా ఆటంకాలు సృష్టించడం మూలంగానే టెన్షన్ వాతావరణం ఏర్పడిందని ఆమె ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళల మీద తప్పుడు పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఉత్తరాంధ్ర కోసం యాత్ర..

ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాడే కర్నూలును తాత్కాలిక రాజధానిగా ఎంపిక చేశారని, ఆ తర్వాత విశాఖలో రాజధాని ఏర్పాటు కావాల్సి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం మూలంగా హైదరాబాద్‌కు తరలించారని ఉత్తరాంధ్ర బీసీ హక్కుల వేదిక నాయకుడు రాజు యాతం అన్నారు.

"ఆరు దశాబ్దాల క్రితమే విశాఖ రాజధాని కావాల్సి ఉంది. ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చింది. దానిని అడ్డుకోవడమంటే ఉత్తరాంధ్రవాసులను అవమానించడమే. అందుకే ఉత్తరాంధ్ర హక్కులను చాటే రీతిలో మేం పాదయాత్రకు చేస్తాం. ఇచ్ఛాపురం నుంచి విశాఖ వరకూ యాత్ర ఉంటుంది. అమరావతి తప్ప ఇంకే ఊరూ అభివృద్ధి కాకూడదని చేస్తున్న యాత్రలను ఇక్కడి ప్రజలు సహించరు. తెలుగుదేశం నేతల ప్రకటనలు చూస్తుంటే ఉత్తరాంధ్రను కించపరుస్తున్నట్టుగా ఉన్నాయి. అలాంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఉత్తరాంధ్ర వైపు నిలబడాలి" అని ఆయన అన్నారు.

అమరావతిలో బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని కులాలవారు మూడు రాజధానులకు మద్ధతుగా ఉంటే, విశాఖ రాజధానిని అడ్డుకోవడానికి పాదయాత్రలు ఎలా చేస్తారని రాజు ప్రశ్నించారు. త్వరలోనే విశాఖ రాజధాని కోసం తమ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు.

అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలు పాల్గొంటున్న యాత్రను ప్రభుత్వం రాజకీయ యాత్రగానే భావిస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చేటుచేసుకుంటాయన్నాది కీలకం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Amaravati Padayatra: A farmer's Movement or a Political Struggle?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X