వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమేయ కృషి వికాస కేంద్రం: పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అమేయ కృషి వికాస కేంద్రం, బాల్ రెడ్డి

'భోగీ భోగీ నీ భోగం ఎన్నాళ్లూ అంటే, మట్టసంగా నా కంచంలోకి అన్నం అందినన్నాళ్లే అన్నాట్ట...’ వ్యవసాయం ప్రాధాన్యం గురించి చెబుతూ బాల్ రెడ్డి గుర్తు చేసిన సామెత ఇది. నిజమే ఎంతటివారైనా, వారి భోగం కంచంలో నిండుగా భోజనం ఉన్నంత వరకే. అందుకే వ్యవసాయం 'మోస్ట్ శాటిసిఫైయింగ్, మోస్ట్ క్రియేటివ్ జాబ్’ అంటారు బాల్ రెడ్డి.

వ్యవసాయానికి పరిమితి ఉండదు, రైతు శ్రమకు కొలమానం ఉండదు. ఆ కొలవలేని అపరిమిత భావాన్ని సంస్కృతంలో అమేయం అంటారు. అదే ఆయన వ్యవసాయ క్షేత్రం పేరు, ఆయన కుమార్తె పేరు కూడా.

అమేయ కృషి వికాస కేంద్రంలో ఉన్న ఒక్కో మొక్క గురించీ తెలుసుకుంటే అబ్బురపడుతుంటాం. ఏడాది పొడవునా కాసే పనస పండు, ప్రపంచంలోనే అత్యంత తీయని మామిడి పండు, చక్కెర కలపక్కర్లేనంత కమ్మని బత్తాయి, ఒకసారి వేస్తే ఐదేళ్ల పాటూ పండే కంది, నాటిన ఏడాదిలోనే కాపు కాసే పండ్ల మొక్కలు... ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడన్నీ ప్రత్యేకతలే. ఇది కేవలం నర్సరీయే కాదు... అంతకుమించి.

అమేయ కృషి వికాస కేంద్రం, బాల్ రెడ్డి

భువనగిరి దగ్గర్లోని రామకృష్ణాపురం గ్రామంలో బాల్ రెడ్డి కుటుంబం ఈ అమేయ కృషి వికాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. విలేకరి నుంచి రైతుగా మారారు బాల్ రెడ్డి. 2009లో ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం ప్రారంభించి, ఆ తరువాత పూర్తి స్థాయిలో సాగులోకి దిగారు.

బాల్ రెడ్డి తన పొలంలోనే ఇల్లు కట్టుకున్నారు. ఆయన భార్య జ్యోతి, కుమార్తె అమేయ కూడా వ్యవసాయంలో ఆయనకు తోడుగా ఉంటారు. కుమార్తె చిన్న వయసులోనే సాగుకు సంబంధించిన ఎన్నో విషయాలను ఔపోసన పట్టింది. వీరి దగ్గర 180 రకాల పండ్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. 28 రకాల వరి పండించారు.

అన్నీ కలిపి సుమారు 300 వరకూ రకాలను కేవలం 6 ఎకరాల స్థలంలోనే పండించి చూపించింది బాల్ రెడ్డి కుటుంబం. ఒక్క మాటలో చెప్పాలంటే, పూర్వీకుల నుంచి వచ్చిన బీడు భూమిని ఆకుపచ్చటి ప్రయోగశాలగా మార్చేశారు.

నిజానికి బాల్ రెడ్డి వ్యవసాయంలోకి దిగేనాటికి ఆయనకు ఇందులో అనుభవం లేదు. పుట్టింది వ్యవసాయ కుటుంబంలోనే అయినా, చదువు, ఉద్యోగం వల్ల ఆయన ఆలస్యంగా ఇందులోకి దిగారు.

''నేను మొదలుపెట్టేనాటికి నాకు అనుభవం లేదు. ఆసక్తి మాత్రమే ఉంది. మొదట్లో కొన్ని పంటలు పోయాయి. ఆర్థిక ఇబ్బందులు, ఇతర ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ, ఇప్పుడు నిలదొక్కుకున్నాను. నా గురించి రైతుల్లో మౌత్ పబ్లిసిటీ ఎక్కువ. అందుకే ఎక్కడెక్కడి నుంచో రైతులు వస్తారు. నిత్యం ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా సలహాలు ఇస్తూనే ఉంటాను'' అంటూ వివరించారు బాల్ రెడ్డి.

దేశ విదేశాలకు చెందిన ప్రత్యేక వంగడాలు తెప్పించారు. వాటిని అంటు కట్టి వృద్ధి చేస్తున్నారు. వియత్నాం, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, అమెరికా, శ్రీలంక దేశాల నుంచి రకరకాల మొక్కలు తెప్పించి వాటిని స్థానిక రకాలతో కలిపి అభివృద్ధి చేస్తున్నారు.

అమేయ కృషి వికాస కేంద్రం, బాల్ రెడ్డి

పంటలకు హోమియో మందులు

హోమియోపతి వైద్యం మొక్కలకు కూడా బాగా పనిచేస్తుందనీ, పురుగు మందుల స్థానంలో హోమియో మందులు వాడితే, ప్రకృతికి మేలు చేయడమే కాకుండా, రైతుకు ఖర్చు భారీగా తగ్గుతుందనీ బాల్ రెడ్డి అంటున్నారు.

ఆయన పొలంలో హోమియో మందులను వాడుతున్నారు. తన సలహా విని హోమియో మందులు వాడి మంచి ఫలితాలను సాధించిన రైతులు ఉన్నారని కూడా ఆయన చెబుతున్నారు.

''మొదట్లో నమ్మకంతో ఒకరిద్దరు హోమియో వాడి ఉండొచ్చు. కానీ, వారికి వచ్చిన ఫలితాలు చూసి నిజం అని నమ్మిన తర్వాతే మిగతా రైతులు హోమియో మొదలుపెడుతున్నారు. వైరస్ సోకిన తరువాత ఈ పంట ఇక అనవసరం తగలబెట్టేయండి అన్న పొలాలను సైతం హోమియో వాడి బాగు చేశాం. ఎందరో రైతులు దీని వల్ల లాభం పొందారు'' అంటూ హోమియో గురించి చెప్పారు బాల్ రెడ్డి.

తాను హోమియో ద్వారా చేసిన ప్రయోగాలు, వాటి వివరాలను రైతులకు నేరుగా అందించాలని ఆయన భావిస్తున్నారు. చాలా మందికి అలా సలహాలు ఇస్తున్నారు.

''హోమియో వల్ల రెండు లాభాలు ఉంటాయి. పురుగు మందుల వాడకం బాగా తగ్గిపోతుంది. దీనివల్ల ఆరోగ్యకరమైన పంటలు వస్తాయి. అలాగే ఖర్చు పదింతలు తగ్గిపోతుంది. దీనివల్ల రైతు ఆర్థికంగా దెబ్బతినడు. ఇప్పుడు పెట్టుబడుల్లో పురుగుమందుల ఖర్చు చాలా ఎక్కువ. రైతులపై ఆ భారం ఉండదు. రసాయనాల సమస్య లేకుండా, మనుషులకు స్వచ్ఛమైన ఆహారం అందించే మార్గం ఇది'' అని హోమియో గురించి వివరించారాయన.

అమేయ కృషి వికాస కేంద్రం, బాల్ రెడ్డి

ఇదే పరిష్కారం

ఆహార ధాన్యాలైనా, ఉద్యాన పంటలైనా, పూర్తిగా ప్రకృతి ఆధారిత వ్యవసాయమే చేస్తున్నారు బాల్ రెడ్డి. వ్యవసాయ సంక్షోభ నివారణకు ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం అనేది బాల్ రెడ్డి నమ్మకం. అందుకు అనుగుణంగానే ఆయన వ్యవసాయ క్షేత్రం నడిపిస్తున్నారు.

బయటి పెట్టుబడి తగ్గించేలా, పంట దిగుబడి పెంచేలా ఆయన విధానాలు ఉన్నాయి. పూర్వంలా సేంద్రీయ కర్బన ఎరువులు సిద్ధం చేస్తున్నారు.

''ప్రస్తుతం దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ వంటి ఎన్నో దేశాలు విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాయి. దీనివల్ల మంచి దిగుబడి, ఆరోగ్యకరమైన పంటలు, రైతుకు ఆర్థిక చేయూత దొరుకుతోంది'' అంటూ వివరించారు బాల్ రెడ్డి.

పూర్వం ప్రకృతి ఆధారిత వ్యవసాయం ఎలా జరిగేది? మొక్కలకు పోషకాలు ఎలా అందేవి? కాల క్రమంలో ఆ పద్ధతి దెబ్బతిని రసాయనాలు, కృత్రిమ ఎరువులు ఎలా వచ్చాయి? తిరిగి పాత పద్ధతులను ఎలా అమలు చేయాలి? వంటి ఎన్నో విషయాలను కూలంకషంగా వివరించారాయన.

అయితే 'జీరో బడ్జెట్’ ప్రకృతి వ్యవసాయం అనే కాన్సెప్ట్ మాత్రం ఆయన తప్పు అని అంటున్నారు.

''జీరో బడ్జెట్ వ్యవసాయం అంటూ ఏమీ ఉండదు. కచ్చితంగా చాలా వస్తువులు డబ్బు ఇచ్చే తేవాలి. దీనితోపాటూ శ్రమ కూడా ఉంటుంది. దాన్ని సులభతరం చేసేలా, పెట్టుబడులను బాగా తగ్గించేలా మా అధ్యయనాలు ఉంటాయి'' అన్నారు జ్యోతి.

ప్రకృతి సాగుతో సాధ్యమే

ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యకరమైన ఉత్పత్తిని ఇస్తుంది. కానీ, దీనికి చాలా పరిమితులు ఉన్నాయి. ధరలు ఎక్కువ. దిగుబడి తక్కువ. భారీ ఎత్తున అంటే, వందల ఎకరాల్లో సాగు చేయడం కష్టం. కోట్లాది మంది ప్రజల అవసరాలకు తగినంత దిగుబడి రాదు... ఇవన్నీ ప్రకృతి సాగుతో ఉన్న ప్రతికూలాంశాలని చాలా మంది చెబుతుంటారు.

కానీ, ప్రకృతి వ్యవసాయం కూడా భారీ ఎత్తున చేయడం సాధ్యమేనంటారు బాల్ రెడ్డి. అలా వందల ఎకరాల్లో సాగు చేసేందుకు వీలుగా రైతులకు ఉపయోగపడేలా కొన్ని పద్ధతులను సిద్ధం చేస్తున్నారు ఆయన.

''రసాయన పురుగు మందులు, కృత్రిమ ఎరువుల వ్యవసాయం వ్యాపారుల ప్రయోజనాల కోసం వచ్చిందే. ప్రకృతి వ్యవసాయం భారీ దిగుబడులకు చక్కగా సరిపోతుంది. పురుగు మందులు కూడా హోమియోపతి వాడవచ్చు. ప్రకృతి సేద్యం చేసి భారీ దిగుబడులు సాధించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి'' అని అన్నారు బాల్ రెడ్డి.

అమేయ కృషి వికాస కేంద్రం, బాల్ రెడ్డి

జీవామృతం చెరువు

ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన సేంద్రీయ పదార్థాలు, జీవామృతం వంటి ఎరువు అందించడానికి ఎంతో శ్రమ, ఓపిక కావాలి. పైగా భారీ ఎత్తున చేయడం చాలా కష్టం.

ఆ సమస్యకు పరిష్కారంగా ఒక చిన్న సైజు చెరువే నిర్మించారు వీరు. ప్రత్యేకమైన ఫర్టిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సేంద్రయ పోషకాలను నేరుగా ప్రతి మొక్కకూ నీటితో పాటు అందేలా ఏర్పాట్లు చేశారు.

తన దగ్గరకు వచ్చే రైతులకు అది ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నారు. దీనివల్ల కొన్ని వందల పని గంటలూ, కొన్ని వేల రూపాయలూ ఆదా అవుతున్నాయి. అంతేకాదు, ప్రకృతి వ్యవసాయం భారీ ఎత్తున సాగడానికి వీలుగా ఉంది ఈ వ్యవస్థ.

''ఈ పద్ధతిలో శ్రమ ఎక్కువ ఉంటుంది. ఆ శ్రమను తగ్గించడానికి ఈ సరికొత్త ఫర్టిగేషన్ విధానాన్ని సిద్ధం చేసి, దాన్ని డ్రిప్ ద్వారా అందిస్తున్నాం. దీనివల్ల 100 ఎకరాలైనా నేచురల్ ఫామింగ్ బాగా చేసుకోవచ్చు'' అని అన్నారు జ్యోతి.

అమేయ కృషి వికాస కేంద్రం, బాల్ రెడ్డి

ఉద్యాన పంటలపై దృష్టి

బాల్ రెడ్డి అన్ని రకాల పంటలపై ప్రయోగాలు చేశారు. సమగ్ర వ్యవసాయ విధానం కింద ఎన్నో రకాల పంటల్నీ, పశువుల్నీ, జీవాల్నీ, చేపల్నీ ఒకే చోట పెంచే విధానాన్ని వారు సమగ్రంగా నిర్వహించి నిరూపించారు.

ప్రస్తుతం ఎక్కువగా ఉద్యాన పంటలు, అంటే పండ్ల మొక్కలపై దృష్టిపెట్టారు. వాటిపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. వాటితో పాటూ కూరగాయలు, ఇతర ఆహార పంటలపై కూడా కృషి చేస్తున్నారు.

''మేం సొంతంగా రకరకాల అంటు మొక్కలతో ప్రయోగాలు చేసేవాళ్లం. అది చూసి మాకు కూడా అలాంటివి కావాలి అని రైతులు అడిగేవారు. వారి కోసం మెల్లిగా మొదలుపెట్టాం'' అంటూ వివరించారు బాల్ రెడ్డి భార్య జ్యోతి.

అమేయ కృషి వికాస కేంద్రం, బాల్ రెడ్డి

సాగు బడి ఆలోచన

తాను అంటు కట్టే, అభివృద్ధి చేసే మొక్కలను భారీ వ్యాపార సంస్థలకు కాకుండా, నేరుగా రైతులకే అమ్ముతారు బాల్ రెడ్డి. వ్యవసాయం, రైతు బాగుండాలనేది తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు.

ఈ మొక్కల కోసం వివిధ రాష్ట్రాల నుంచి రైతులు బాల్ రెడ్డి దగ్గరికి వస్తుంటారు.

తను వ్యవసాయంపై చేసిన పరిశోధనలను నిరంతరం ఫోన్, సోషల్ మీడియా ద్వారా రైతులకు తెలియపరుస్తూ వారికి ఆయన అవగాహన కల్పిస్తున్నారు. అయితే తన కాన్సెప్ట్‌లపై రైతులకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడానికి ఒక బడి కూడా ప్రారంభించాలనే ఆలోచన ఆయనకు ఉంది.

అమేయ కృషి వికాస కేంద్రం, జ్యోతి

అందుకే సంక్షోభం

''వ్యవసాయం ఒక జీవిక. ఇది జీవన విధానం. 60వ దశకంలోనే హరిత విప్లవానికి మూలాలు పడ్డాయి. వ్యవసాయం వ్యాపారంగా మారడం ప్రాంరంభం అయింది. 80వ దశకం మధ్య నాటికి తీవ్రత పెరిగింది. ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారంగా మారిందో సంక్షోభం కూడా మొదలైంది. ఒకప్పుడు నల్లగొండ ప్రాంతం సజ్జలు, ఆముదాలకు ప్రసిద్ధి. 80ల తరువాత అవి కంటికి కనపడకుండా పోయాయి. పత్తిని తెల్ల బంగారం అని ఊరించారు. డబ్బు ఆశతో అందరూ అటు మళ్లారు. రైతు ఆత్మహత్యలు కూడా 80ల తరువాతే పెరిగాయి'' అంటూ వ్యవసాయ సంక్షోభం మూలాలను వివరించారు బాల్ రెడ్డి.

''మేం చేసేది భిన్నమైనది కాదు. ప్రాచీన వ్యవసాయ మూలాల్ని మళ్లీ తవ్వితీస్తున్నాం. వ్యవసాయానికి ఒక సమగ్రత కల్పించడం లక్ష్యం. ఒకప్పుడు మనది సమగ్ర వ్యవసాయం. భిన్నమైన పంటలు, అవసరానికి తగిన పశువులు పెంచుకునే వారు. ఉమ్మడి కుటుంబాలు శ్రమకు అందివచ్చాయి. ఒక ఏడాది పంట లేకపోయినా ఇతర వనరుల మీద కుటుంబం నెట్టుకొచ్చేది. కానీ, తరువాత ఒకటే పంట విధానం వచ్చింది. సంక్షోభానికి మూలం సమగ్రత లోపించిడమే. సమగ్ర వ్యవసాయ విధానాన్ని రైతుకు తిరిగి పునరుద్ధరించి అందించడమే లక్ష్యంగా మేం ముందుకు వచ్చాం'' అని అన్నారు.

''ఈ ప్రపంచంలోని సమస్త వృత్తులకూ ఆధారం అన్నం. అంటే వ్యవసాయమే. భోగీ భోగీ నీ భోగం ఎన్నాళ్లూ అంటే, మట్టసంగా నా కంచంలోకి అన్నం అందినన్నాళ్లే అన్నాట్ట.. అన్నం లేకుండా ఏ వృత్తీ ఎవరూ చేయలేరు. నాగలి కర్రు కదలినంత వరకే రాజైనా బంటైనా కవైనా వారికి సాగుద్ది. వీరంతా సవ్యంగా బతకాలంటే నాగలి కర్రు నేలను చీల్చాలి. సమస్త వృత్తులకు జీవనాడి, జీవనాధారం వ్యవసాయం అనుకున్నప్పడు ఇంతకంటే ఉత్కృష్టమైనది ఇంకొకటి ఉండదు’’ అని బాల్ రెడ్డి వివరించారు.

''వ్యవసాయ కుటుంబంలో పుట్టి బతుకుతెరువు కోసం నానా పనులు చేస్తున్నాం కానీ, వ్యవసాయంలోని రైతు మాత్రం రోజురోజుకూ నాశనమైపోతున్నాడు. అతని జీవన ప్రమాణం పడిపోతోంది. ప్రపంచానికంతా అన్నం పెడుతున్నవాడికి అన్నం లోటు వస్తోంది. ఆఖరికి ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదెందుకు వస్తోంది అని ఆలోచించుకుంటే దీంట్లో ఉన్న సమస్యలు అర్థమవుతున్నాయి. వ్యవసాయంలోని సమస్యలు అర్థమవుతున్నాయి కాబట్టి, వాటిని పరిష్కరించాలి. రైతుకు ఉన్నతమైన జీవితం ఇవ్వాలి అనుకుంటే, దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే సాధ్యం అవుతుంది. సమస్యకు పరిష్కారం దొరకాలి అనుకుంటే, అందులో మనం భాగం అవ్వాలి. భాగం అవ్వాలి అంటే నేను ప్రత్యక్షంగా వ్యవసాయంలో దిగాలి అనిపించింది. అలా మిగతా వాటిని వదిలేసుకుని వ్యవసాయంలో దిగాను'' అని అన్నారు ఆయన.

వ్యవసాయం చేసుకుంటూనే తమ పరిశోధనల ఫలితాలను అందరికీ అందుబాటులో ఉంచాలని తపన పడుతోంది ఈ రైతు కుటుంబం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
This farmer applies homeopathic medicines for his crop
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X