mukesh ambani seized mercedes benz stay mumbai cctv footage nia discussion link బాంబు బెదిరింపు ముఖేష్ అంబానీ స్వాధీనం ముంబై ఎన్ఐఏ చర్చ లింక్
ముఖేష్ అంబానీ బెదిరింపు కేసు .. సచిన్ వాజేతో పాటు హోటల్ లో ఓ మహిళ , 5 బ్యాగుల మిస్టరీ
ముఖేష్ అంబానీ బాంబు బెదిరింపు కేసులో రోజుకో కొత్త మలుపు చోటుచేసుకుంటుంది . ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే ఒక కాస్ట్లీ హోటల్లో ఫిబ్రవరి 16 నుంచి 20వ తేదీ వరకు బస చేసినట్లుగా గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆ సమయంలో ఆయన వెంట ఎవరువెళ్లి కలిశారు అన్నదానిపై కూపీ లాగుతోంది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

సచిన్ వాజేతో పాటు హోటల్ కు వెళ్ళిన మహిళ
దక్షిణ ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సచిన్ వాజే బస చేసిన సమయంలో అతనితోపాటు అనుమానాస్పదంగా ఒక మహిళ కూడా హోటల్లో ఉండడాన్ని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు అన్న వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు .
మన్సుఖ్ హిరెన్ కు సంబంధించిన స్కార్పియో మిస్సింగ్ కేసుకు ఒకరోజు ముందు సచిన్ వాజే ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసిన సమయంలో నకిలీ ఆధార్ కార్డు ఉపయోగించినట్లు గా గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు, అతనితో పాటు ఓ గుర్తు తెలియని మహిళ ఉన్నట్లుగా గుర్తించారు.

సచిన్ వాజే తనతో పాటు ఒక ఐదు బ్యాగులు హోటల్లోకి తీసుకెళ్లటంపై ఆరా
అంతేకాదు సచిన్ వాజే తనతో పాటు ఒక ఐదు బ్యాగులు హోటల్లోకి తీసుకెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ ఐదు బ్యాగ్ లలో ఏముంది అన్నదానిపై జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సచిన్ వాజే క్రైం ఇంటెలిజెన్స్ యూనిట్ లో పని చేసినప్పుడు అతని పై దర్యాప్తు చేయబడుతున్న మరో కేసులో సచిన్ వాజే ప్రశ్నించిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు . ఆ మహిళ ఈ మహిళనేనా అన్న అనుమానం కూడా ఎన్ఐఏ అధికారులు వ్యక్తం చేస్తున్నారు

సచిన్ వాజేతో పాటు వెళ్ళిన మహిళపై వాజేను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ
మహిళ యొక్క గుర్తింపు గురించి ఎన్ఐఏ సచిన్ వాజ్ ను ప్రశ్నించింది, కాని అతను దర్యాప్తు సంస్థతో సహకరించడం లేదు. ఎన్‌ఐఏ వర్గాల సమాచారం ప్రకారం, మహిళ యొక్క గుర్తింపు మరియు ఆమెతో అతని సంబంధం గురించి వివరాలను వెల్లడించడానికి అతను నిరాకరించాడు. ప్రస్తుతం ఆ మహిళను గుర్తించే ప్రయత్నం ఎన్‌ఐఏ చేస్తోంది. ఇదే సమయంలో హోటల్ సిబ్బందిని కూడా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హోటల్‌లో తన ఐదు రోజుల బసలో సచిన్ వాజేను కలిసిన ప్రతి వ్యక్తి గురించి వివరాలు తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

హోటల్ సిబ్బందిని విచారిస్తున్న ఎన్ఐఏ
హోటల్‌లోకి సచిన్ వాజే ద్వారా తీసుకువెళ్ళిన బ్యాగ్‌ల వివరాలను ఎన్ఐఏ పరిశీలిస్తోంది. హోటల్ నుండి వచ్చిన సిసిటివి ఫుటేజీలో, సచిన్ వాజే ఐదు బ్లాక్ బ్యాగులతో ప్రవేశించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తనిఖీ చేసే కియోస్క్ వద్ద బ్యాగులు స్కాన్ చేయబడ్డాయి . అందువల్ల బ్యాగ్ యొక్క విషయాలు కియోస్క్ అసిస్టెంట్ ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
హోటల్‌లోని కొంతమంది ఉద్యోగులను ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నించగా మరికొందరిని ఇంకా ప్రశ్నించాల్సి ఉంది.

సచిన్ వాజేకు 100 రోజుల పాటు హోటల్ గదిని బుక్ చేసిన ఒక వ్యాపారవేత్త
ఆ బ్యాగ్స్ లో ఉన్న వస్తువులు ఏంటి ఎవరైనా చూశారా అన్న దానికి సంబంధించి ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఆ హోటల్ గదిని సచిన్ వాజే కోసం ఒక వ్యాపారవేత్త 100 రోజులపాటు బుక్ చేశాడు. అతను ట్రావెల్ ఏజెంట్ ద్వారా సుమారు 13 లక్షల రూపాయలు చెల్లించాడు. ముంబై మాజీ పోలీసు అధికారి నకిలీ ఆధార్ ఐడిని ఉపయోగించి హోటల్‌కు చెక్-ఇన్ చేశారు. మొత్తానికి ముఖేష్ అంబానీ బాంబు బెదిరింపు కేసులో కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఈ కేసులో ఉన్న పెద్ద పెద్ద వాళ్లను, వాళ్లతో ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే కు ఉన్న లింకులను ఒక్కొక్కటిగా బయట పెడుతుంది.