కోవిడ్‌పై అత్యున్నత స్థాయి సమీక్ష: కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రధాని..!!
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత సమావేశాన్ని నిర్వహించారు. కీలక ఆదేశాలు జారీ చేశారు.
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తోన్నట్టే కనిపిస్తోంది. కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. మరణాలు సైతం నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. కోవిడ్ స్థితిగతులపై ఆరా తీయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతోన్న రాష్ట్రాలకు స్టాండర్ట్ ప్రొటోకాల్స్ ను జారీ చేశారు.
దేశంలో కోవిడ్, ఇన్‌ఫ్లుయెంజాల్లో భారీగా పెరుగుదల కనిపించినందున అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శ్వాసకోశ సంబంధ ఇబ్బందులతో బాధపడే వారిని గుర్తించడానికి ప్రత్యేకంగా ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని, టెస్టింగ్ సంఖ్యను పెంచాలని సూచించారు. సర్వైలెన్స్ పెంచాలని, జన్యు పరీక్షలను ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. టెస్టింగ్ లను పెంచడం ద్వారా పాజిటివ్ కేసుల సంఖ్యను నిర్ధారించడానికి వీలు పడుతుందని అన్నారు.

24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,134 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని ఈ సందర్భంగా అధికారులు ప్రధానికి వివరించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 7,026కి పెరిగిందని చెప్పారు. ఆసుపత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్ ను నిర్వహించాలని ప్రధాని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు స్టాండర్డ్ ప్రొటోకాల్స్ ను జారీ చేయాలని చెప్పారు. కోవిడ్ విస్తృతి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అన్నారు.
ఇన్సాకాగ్ జీనోమ్ సీక్వెన్సింగ్ లేబొరేటరీల్లో నమూనాల నిర్ధారించాలని, కంప్లీట్ జీనోమ్ సీక్వెన్సింగ్ పద్ధతులను మరింత మెరుగుపర్చాలని ప్రధాని ఆదేశించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ను మెరుగుపర్చడం వల్ల కోవిడ్ వేరియంట్లను గుర్తించవచ్చని అన్నారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, కోవిడ్ వ్యాప్తి చెందకుండా అయిదంచెల వ్యూహాలను అనుసరించాలని ప్రధాని సూచించారు.
మహారాష్ట్రలో ఇవ్వాళ కొత్తగా 334 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు కూడా. ఈ మధ్యకాలంలో ఎప్పుడే గానీ ఒక్కరోజులో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు రికార్డు కాలేదు. మరణాలు కూడా నమోదు కాలేదు. ఇవ్వాళ మాత్రం దాని తీవ్రత అనూహ్యంగా పెరిగింది. కేసులు భారీగా పెరిగాయి. ఒకరు మరణించడం కలకలం రేపుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,648కి చేరింది.












Click it and Unblock the Notifications