• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: రెడ్లు, కాపుల మధ్య ఆధిపత్య పోరులో ఇప్పటం నలిగి పోతోందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇప్పటం: రోడ్డు విస్తరణ కోసం కూల్చిన ఇళ్లు

ఇప్పటం... మంగళగిరి దగ్గర్లోని ఈ చిన్న గ్రామం వేదికగా రాజకీయ వివాదాలు చెలరేగతున్నాయి.

ఈ గ్రామంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు వివాదంగా మారాయి. విస్తరణంలో భాగంగా ఇంటి నిర్మాణాలను కూల్చివేశారు. తమ మీద ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కొందరు విమర్శిస్తుంటే అంతా చట్టప్రకారమే చేస్తున్నామని ప్రభుత్వం అంటోంది.

ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతలకు గురైన బాధితులకు రూ.లక్ష చొప్పున సాయం చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది.

ఈ వివాదం మీద క్షేత్రస్థాయి పరిశీలన కోసం బీబీసీ ఇప్పటంలో పర్యటించింది.

ఇప్పటం గ్రామం వద్ద రైల్వే గేటు

ఊరి బయట 30 అడుగుల రోడ్డు... లోపల 118 అడుగుల రోడ్డు

ఇప్పటం గ్రామం మీదుగా వెళ్లే ఆర్ అండ్ బీ రహదారిని ప్రభుత్వం వెడల్పు చేస్తోంది. ఇందులో భాగంగా 'ఆక్రమణలు' తొలగించడం ప్రారంభించారు. జాతీయ రహదారి-16ను అనుసంధానిస్తూ పెదవడ్లపూడి నుంచి కొలనుకొండ వరకూ ఈ రోడ్డు ఉంటుంది.

కొలనుకొండ, వడ్డేశ్వరం వంటి గ్రామాలలో ఈ రోడ్డు వెడల్పు 30-40 అడుగుల వెడల్పు మాత్రమే. ఇప్పటంలో మాత్రం ఆ దారిని 118 అడుగుల మేర విస్తరించాలని నిర్ణయించారు. ఆ రోడ్డులో ఆటోలు, కార్లు, టూ వీలర్ వంటి వాహనాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటాయి. లారీలు, ట్రాక్టర్లు కూడా తిరుగుతుంటాయి. స్కూలు బస్సులు మినహా ఆర్టీసి బస్సులు తిరగడం లేదు.

అయినా రోడ్డును మాత్రం భారీగా విస్తారించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం విశేషం.

ఇప్పటం గ్రామంలోకి వెళ్లేందుకు ప్రధాన రహదారులు నాలుగున్నాయి. అందులో కొలనుకొండ గ్రామం నుంచి వడ్డేశ్వరం మీదుగా వెళ్లే దారి ఒకటి. పెదవడ్లమూడి నుంచి వచ్చే రోడ్డు మరోటి. మంగళగిరి నుంచి వచ్చే రోడ్డు, వడ్డేశ్వరం నుంచి కూడా జాతీయ రహదారి సర్వీసు రోడ్డు మీదుగా ఇప్పటం వెళ్లొచ్చు.

మంగళగిరి, వడ్డేశ్వరం నుంచి ఇప్పటంలో అడుగు పెట్టాలంటే రైల్వే గేటు దాటాల్సి ఉంటుంది. రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే ఈ మార్గంలో ఎక్కువ మార్లు గేటు వేసి ఉంటుంది.

ఆ గ్రామంలోకి అడుగుపెట్టే అన్ని దారుల వెడల్పు 40 అడుగుల లోపు ఉన్నాయి. కానీ ఇప్పటం గ్రామంలో మాత్రం విశాలమైన రోడ్డు వేసేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది.

రైలు గేటు దాటి గ్రామంలోకి రావాలంటే తొలుత ఓవర్ బ్రిడ్జీలు లేదా అండర్ పాస్‌లు అందుబాటులో ఉండాలి. అవి లేకుండా కేవలం గ్రామంలోనే రోడ్డు విస్తరణ పనులకు ప్రయత్నించడం అనేక ప్రశ్నలకు, అనుమానాలకు తావిస్తోంది.

ఓ వైపు రాష్ట్రమంతా రోడ్ల దుస్థితి మీద విమర్శలు వస్తున్నంటే మరొకవైపు ప్రభుత్వం ఇప్పటం మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం అపోహలకు తావిస్తోంది.

ఇప్పటం: కూల్చిన తరువాత మళ్లీ కట్టిన మెట్లు

ఆక్రమణల పేరుతో తొలగింపు

ఇప్పటం గ్రామంలోని రోడ్డును వెడల్పు చేసే ప్రయత్నాలు ఆరేడు నెలల క్రితమే మొదలయ్యాయి. అప్పటి నుంచి వివాదం మొదలయ్యింది. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు నోటీసులు ఇచ్చారు. రెండు మార్లు నోటీసులు సంబంధిత ఇంటి యజమానులకు అందాయి.

తొలుత నోటీసు ఇచ్చి 'ఆక్రమణ'ల్లో ఉన్న ఇళ్లను తొలగించారు. అయితే ఎక్కడా నివాసాలను పూర్తిగా తొలగించిన ఆనవాళ్లు లేవు. గోడలు, ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న షెడ్లు, దుకాణాలు మాత్రమే తొలగించారు.

రెండు నెలల క్రితం గ్రామంలో కొంత భాగం తొలగించి అక్కడ డ్రెయినేజీ నిర్మించారు. కూలగొట్టిన తర్వాత కొందరు ఇంటి గోడలు, మెట్లు కూడా నిర్మించుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

వడ్డేశ్వరం నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో ఎడమ వైపు 'ఆక్రమణల' తొలగింపు యత్నాలు గతంలో జరిగాయి. ఈసారి కుడివైపు ఇళ్ల ముందు 'ఆక్రమణలు' తొలగించే పని మున్సిపల్, ఆర్ అండ్ బీ అధికారులు చేపట్టారు. అన్ని కులాలకు చెందిన వారి నిర్మాణాలను ఆక్రమణల పేరుతో తొలగించే ప్రయత్నం చేశారు.

ఈ కూల్చివేతలే వివాదానికి కారణమయ్యాయి. తమ ఇళ్ల తొలగింపు ప్రయత్నాలను అడ్డుకోవాలని ఇప్పటం వాసులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలిసినప్పుడు '118 అడుగుల వెడల్పు అవసరం లేకుండా చూస్తామని తమకు హామీ ఇచ్చినట్టు' స్థానికుడు రామనరసయ్య బీబీసీకి తెలిపారు.

ఇతరులు కూడా ఈ విషయాన్ని బీబీసీకి చెప్పారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ ఆచరణ అందుకు భిన్నంగా ఉండడమే తమకు ఆందోళన కలిగిస్తోందని వారు అన్నారు.

ఇప్పటం: రోడ్డు విస్తరణ కోసం కూల్చిన ఇళ్లు

కులాల మధ్య ఆధిపత్య పోరు

ఈ ఘటనకు ముందు వరకూ ఇప్పటం గుంటూరు జిల్లాలోని ఓ కుగ్రామం. మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. తాడేపల్లి మండలంలో ఉన్న ఈ గ్రామ జనాభా 4వేలకు అటుఇటు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. పూల సాగు ఎక్కువగా జరుగుతుంది. ప్రధానంగా నాయుళ్లు, రెడ్లతో పాటుగా గౌడ్ కులస్తులుంటారు. రాజకీయంగా కాపు, రెడ్డి కులాల మధ్య ఆధిపత్యం ఉంటుంది. గౌడ్ కులానికి చెందిన వారు ఎవరికి అండగా నిలిస్తే వారిదే ఆధిపత్యం.

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2022 మార్చి 14న ఇప్పటం గ్రామానికి చెందిన రైతుల భూముల్లో బహిరంగసభ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆ సభా వేదికపై నుంచే ఇప్పటం గ్రామ రైతులను అభినందించారు. గ్రామాభివృద్ధికి రూ.50 లక్షల సహాయం ప్రకటించారు. తమ పార్టీ సభ విజయవంతానికి సహకరించినందుకు ధన్యవాదాలు చెబుతూ సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

రాజకీయ వివాదాలకు దూరంగా ఉన్న ఇప్పటంలో ఇప్పుడు ఆధిపత్యం కోసం బహిరంగ ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో గ్రామ రాజకీయాల్లో స్వల్ప విబేధాలు తప్ప బహిరంగంగా ఎదురుపడని వర్గాల మధ్య కుల విబేధాలు రాజుకున్నాయి. కమ్యూనిటీ హాలు మీద పెత్తనం విషయంలో కూడా పట్టింపులు రావడం, అధికార పార్టీ అండతో రెడ్లు ఆధిపత్యం ప్రదర్శించడం వంటివి జరిగాయి. ఆ క్రమంలోనే జనసేన సభ తర్వాత రోడ్ల విస్తరణ తెరమీదకు వచ్చింది.

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కొన్ని చోట్ల రోడ్ల విస్తరణ జరుగుతోంది. అందుకు తోడుగా ఇప్పటం సమీపంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఒకటి రాజకీయ పెత్తనం, రెండు వ్యాపార ప్రయోజనం ముడిపడి ఉన్నందునే రోడ్ల వెడల్పు అవసరం ఏర్పడినట్టుగా భావించాల్సి ఉంటుందని స్థానికంగా ఉండే సీనియర్ జర్నలిస్ట్ వి.సురేష్ అన్నారు.

పవన్ కల్యాణ్ పర్యటన

మార్చి 4వ తేదీ ఉదయాన్నే మూడు బుల్డోజర్ల సహాయంతో రోడ్డుని ఆనుకుని ఉన్న గోడలు, ఇతర నిర్మాణాలను తొలగించే ప్రయత్నం జరిగింది. ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సహకరించినందుకు కక్షసాధింపు ధోరణితోనే ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను అడ్డుకోవాలని కొందరు కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో అదే రోజు మధ్యాహ్నంతో ఈ కూల్చివేతలు నిలిచిపోయాయి.

ఇటీవల ఇప్పటం గ్రామంలో పవన్ కల్యాణ్ పర్యటించారు. కూల్చివేతల ప్రాంతాన్ని పరిశీలించారు. ఇళ్లు కూల్చిన ప్రభుత్వాన్ని త్వరలోనే కూల్చివేస్తామని ప్రకటించారు. 'వైఎస్సార్ విగ్రహాలకు కాపలా పెట్టి, పేదల ఇళ్లు కూల్చేస్తారా' అంటూ ఆయన విమర్శించారు.

మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయం నుంచి జాతీయ రహదారి మీదుగా వడ్డేశ్వరం వరకూ వచ్చి అక్కడి నుంచి ఆయన ఇప్పటం వెళ్లారు. ఆ సమయంలో వేగంగా ప్రయాణించే కారు పైన పవన్ కల్యాణ్ కూర్చోవడం విమర్శలకు తావిచ్చింది.

జనసేనతో పాటుగా తెలుగుదేశం, సీపీఎం, కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటం గ్రామంలో పర్యటించారు. బాధితులతో మాట్లాడారు. న్యాయం కోసం పోరాడుతున్న వారికి అండగా ఉంటామని ఆయా పార్టీల నాయకులు ప్రకటించారు.

ఆ తర్వాత రెండు రోజులకు గ్రామంలో వాతావరణం సద్దుమణిగింది. వరుసగా రెండు రోజుల పాటు రాజకీయ, ఇతర వర్గాల పర్యటనలతో పాటుగా పోలీసుల హడావిడి కూడా కనిపించింది. సోమవారం నాటికి సాధారణ స్థితికి చేరుతోంది. కొందరు తమ ఇళ్ల ముందు కూల్చివేసిన భాగాలకు సంబంధించిన శిథిలాలు తొలగించే పనిలో పడ్డారు. ఇంకా కొందరు మాత్రం వాటి జోలికి పోలేదు.

వైఎస్సార్ విగ్రహాలను తొలగించలేదని విమర్శలు రావడంతో సోమవారం ఉదయాన్నే గౌండ్ల పేటని ఆనుకుని ఉన్న విగ్రహాన్ని తొలగించారు. రెడ్ల పేట వద్ద ఉన్న విగ్రహం ఇప్పటికీ అలానే ఉంది.

ఇప్పటం గ్రామంలోని వైఎస్‌ఆర్ విగ్రహం

స్థానికులు ఏమంటున్నారు

ఇప్పటంలో చాలాకాలంగా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని కొందరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. హోటళ్లు, కిరాణా దుకాణాలు పెట్టుకుని గడుపుతున్నారు. అలాంటి వారికి ఒక్కసారిగా తమ నిర్మాణాలు తొలగించడం సమస్యగా మారింది.

'మాకు నోటీసులు ఇచ్చారు. కానీ షాపు తీసేస్తారని అనుకోలేదు. ఇద్దరు ఆడపిల్లలున్నారు. మా ఆయన పనికి వెళితే నెలకు రూ.8 వేలు వస్తాయి. ఇంటి దగ్గరే కిరణా షాపు పెట్టుకుంటే కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదని అనుకున్నాం. కానీ పదేళ్లుగా నడుస్తున్న షాపు ఇప్పుడు పోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశిస్తున్నాం' అంటూ వి.సుమలత అనే మహిళ బీబీసీ వద్ద వాపోయింది.

రెండు నెలల క్రితమే తమకు నోటీసులు ఇచ్చి, ఇంటి గోడ కూల్చేయడంతో తిరిగి వాటిని కట్టుకోవడానికి రూ.50 వేలు ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నపూర్ణమ్మ అనే మరో మహిళ తెలిపింది.

'నిజానికి గ్రామంలో రోడ్డు 50, 60 అడుగులకు పెంచుతామంటే అర్థముంది. పొలిమేర వరకూ 40 అడుగుల లోపు ఉండే రోడ్డు ఊళ్లో మాత్రం 118 అడుగులు చేస్తామంటే అర్థముంటుందా? దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి.

అనవసర వివాదాలకు తావు లేకుండా చూడాలి. అధికారులు బాధ్యత వహించి, సమస్య పరిష్కరించాలి. అనేక సంవత్సరాలుగా 101 అడుగుల రోడ్డుగా రికార్డుల్లో ఉందనివారు చెబుతున్నారు. అంతవరకూ ఆక్రమణలను తొలగించి సరిపెడితే సమస్య ఉండదు. కానీ వివాదం పెంచేలా చూడకూడదు' అంటూ రామ నరసయ్య బీబీసీతో అన్నారు. కూల్చివేతల్లో ఆయన ఇంటి గోడ పోయింది.

'న్యాయపోరాటం చేస్తున్నాం. ఆక్రమణల పేరుతో అన్యాయం చేస్తామంటే సహించం. కక్ష సాధించాలనే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రయత్నాలు సాగనివ్వం' అంటూ ఆయన అన్నారు.

తమ గ్రామం పేరు ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద వివాదంలోకి రావడం మీద చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యను రాజకీయ కారణాలతో పెద్దది చేయకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని మున్నంగి రామలింగారెడ్డి అన్నారు.

ఈ రోడ్డు విస్తరణ అంశంపై రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. ఈ వివాదం మీద మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, ఆర్ అండ్ బీ గుంటూరు జిల్లా అధికారులను బీబీసీ సంప్రదించినా స్పందించడానికి వారు నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: Is it getting crushed in the power struggle between the Reds and the Cops?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X