'బుట్టబొమ్మ' అకౌంట్‌లో మరో రికార్డ్.. ఏకంగా 70 కోట్ల వ్యూస్ - ప్రెస్‌రివ్యూ
'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ’ పాట మరో మైలురాయిని చేరిందని 'ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.
''యూట్యూబ్‌లో 'బుట్టబొమ్మ' వీడియో సాంగ్ 700 మిలియన్ల (70 కోట్ల) వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ పాట 700 మిలియన్ల వ్యూస్ సాధించినట్లుగా చెబుతూ.. సింగర్ ఆర్మాన్ మాలిక్ ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్, నివేతా పేతురాజ్, జయరామ్, టబు, రాజేంద్రప్రసాద్, మురళీశర్మ వంటి వారు నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇక రికార్డులు క్రియేట్ చేస్తున్న 'బుట్టబొమ్మ' పాటని రామజోగయ్య శాస్త్రి రచించగా.. ఆర్మాన్ మాలిక్ ఆలపించారు.
ఈ పాటకు జానీ మాస్టర్ నృత్యాన్ని అందించారు. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన ఈ వీడియో సాంగ్.. రికార్డుల పరంపరను కొనసాగిస్తూనే ఉంద’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.
- ఆంధ్రప్రదేశ్: పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు... ఎందుకీ జాప్యం? ప్రభుత్వం ఏమంటోంది?
- తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం ఎవరు? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?
ఏడడుగుల బంధం.. ఏడాదిలోనే విషాదం
మన్యంలో ప్రకృతి అందాలను చూసేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరి విశాఖ నగరం నుంచి వచ్చిన దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని 'ఈనాడు’ కథనం తెలిపింది.
''పాడేరు ఎస్సై లక్ష్మణ్, స్థానికుల వివరాలు తెలిపిన ప్రకారం.. విశాఖ నగరంలోని సీతంపేటకు చెందిన తరుణ్, హేమలత దంపతులు పాడేరు సమీపంలోని వంజంగి మేఘాలకొండ అందాలను తిలకించేందుకు శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో స్నేహితులతో కలిసి మూడు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు.
ఉదయం 6.45 గంటల ప్రాంతంలో పాడేరు పట్టణ శివారులోని వంతాడపల్లి చెక్‌గేట్ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోతున్న క్రమంలో వర్షం కారణంగా రోడ్డు తడిగా ఉండటంతో ద్విచక్రవాహనం అదుపుతప్పింది.
ఈ క్రమంలో కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న హేమలత (21) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తరుణ్‌కు గాయాలవడంతో స్నేహితులు పాడేరు జిల్లా ఆసుపత్రికి అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
భార్య మృతిచెందిన విషయం తెలియక నా హేమ ఎక్కడుంది, ఎలా ఉంది అంటూ తరుణ్ బోరున విలపించడం అక్కడివారిని కంటతడి పెట్టించింది.
వీరికి గతేడాది డిసెంబరులోనే వివాహమైంది. తరుణ్ పెదవాల్తేరులో సొంతంగా ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకొని టెక్నీషియన్‌గా సేవలందిస్తున్నారు.
కుటుంబంలో చిన్న పొరపొచ్చాలొచ్చి ఈ ఏడాది దసరా రోజుల్లో వేరే కాపురం పెట్టారు. కార్తికమాసం కావడంతో పాడేరు సమీపంలోగల వంజంగి కొండల అందాలను చూసేందుకు భార్యతో బయలుదేరి వచ్చారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం సంభవించింది.
ఉదయం 8 గంటల సమయంలో సమాచారం అందడంతో బంధువులు హుటాహుటిన పాడేరు బయలుదేరి వెళ్లారు. దంపతులిద్దరిలో ఎవరూ పాడేరు వెళ్తున్న విషయం తమకు చెప్పనేలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పార’’ని ఆ కథనంలో రాశారు.
- కుప్పం మున్సిపల్ ఎన్నికల పోరు కురుక్షేత్రంలా ఎందుకు మారింది?
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?

'భాగ్యనగరంలో మింట్ మ్యూజియం.. దేశంలోనే తొలిసారిగా’
నిజాం హయాంలోనే హైదరాబాద్‌లో నోట్లు ముద్రించిన సైఫాబాద్‌లోని మింట్‌ను మ్యూజియంగా మార్చనున్నారని 'సాక్షి’ కథనం తెలిపింది.
''వందేళ్ల కంటే పూర్వం నాటి యంత్రాలతో కూడిన ఆ భవనంలోనే 'మింట్ మ్యూజియం' ఏర్పాటు కాబోతోంది.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని 'సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పీఎంసీఐఎల్)' ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది.
'ఆజాదీ కా అమృతోత్సవ్'లో భాగంగా వచ్చేనెల రెండో వారంలో సైఫాబాద్ మింట్ భవనంలో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. తర్వాత దాన్ని మ్యూజియంగా మార్చే పని ప్రారంభం కానుంది.
ఇక్కడి పురాతన యంత్రాలను పునరుద్ధరించే కసరత్తు మొదలుపెట్టారు. తొలుత ఎగ్జిబిషన్ కోసం 'ఇంటాక్' హైదరాబాద్ చాప్టర్ సహకారంతో పనులు మొదలయ్యాయి.
వందేళ్లకు పైబడి కరెన్సీని ముద్రించిన మింట్‌ను మ్యూజియంగా మార్చుతుండటం దేశంలో ఇదే మొదటిసారి’’ అని ఆ కథనంలో రాశారు.
- తిరుమలలో విరిగి పడుతున్న కొండ చరియలు... దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
- అందరూ అడవి బిడ్డలే, కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి?
'హైదరాబాద్‌లో రక్షణ శాఖ అధికారులు సమాంతర వ్యవస్థ నడిపే ప్రయత్నం చేస్తున్నారు’
తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సాయం చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవటంలేదని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారని 'నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.
''గత ఏడున్నరేండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీలో ప్రధానమంత్రికి, మంత్రులకు లెక్కలేనన్ని విజ్ఞాపనలు ఇచ్చారని, అవన్నీ బుట్టదాఖలయ్యాయని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ నగరానికి సంబంధించిన పనుల్లో కేంద్రం ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రోడ్ల విస్తరణ కోసం రక్షణశాఖ భూములివ్వాలని కోరితే ఇప్పటివరకూ స్పందనేలేదని విమర్శించారు.
నగరంలో రక్షణశాఖ అధికారులు ఇష్టంవచ్చినట్టు ప్రవర్తిస్తూ సమాంతర వ్యవస్థను నడిపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఇకనుంచి కేంద్ర ప్రభుత్వం వెంటపడి, వేధించి రాష్ట్ర హక్కులు సాధిస్తామని ప్రకటించారు. పెండింగ్ పనులను సాధించేవరకు కేంద్రాన్ని వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు.
రాష్ట్ర ప్రజల మనవిని వినకపోతే కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతూనే ఉంటామని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు, ప్రశంసలు ఇస్తున్నదికానీ.. అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా ఇవ్వడంలేదని విమర్శించార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- అమరావతిలో బంద్ హింసాత్మకం, షాపులు ధ్వంసం, నగరంలో కర్ఫ్యూ విధించిన పోలీసులు
- గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్: 26 మంది మావోయిస్టులు మృతి
- న్యూజీలాండ్: ఈ అరుదైన అంటార్కిటికా పెంగ్విన్ 3 వేల కిలోమీటర్లు ఎందుకు ప్రయాణించింది?
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- కార్పొరేట్ కంపెనీల లాభాలపై కనీసం 15 శాతం పన్ను.. భారత్‌కు లాభమా? నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications