కాంగ్రెస్ కి మరో బిగ్ షాక్ ! బీజేపీలోకి మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ?
సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా పరాభవం తప్పదని సర్వేలు తేల్చిచెప్పేస్తున్న వేళ.. రాష్ట్రాల్లో సైతం సీనియర్ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి రాజ్యసభ బరిలో నిలిచారు. ఇప్పుడు ఇదే క్రమంలో మరో మాజీ సీఎం కమల్ నాథ్ కూడా చేరేలా ఉన్నారు.
మధ్యప్రదేశ్ లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కమల్ నాథ్ నేతృత్వంలో పోటీ చేసిన కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా సర్దుకోవడం మొదలుపెట్టేశారు. ఇదే క్రమంలో ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేసిన కమల్ నాథ్ సైతం ఆయన కుమారుడు నకుల్ నాథ్ తో కలిసి బీజేపీ తీర్దం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారు.

ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కమల్ నాథ్ బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కమల్ నాథ్ తో పాటు కుమారుడు నకుల్ నాథ్ భవిష్యత్తుకు కూడా హామీ లభిస్తే వెంటనే పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేసిన చరిత్ర ఉన్న కమల్ నాథ్.. బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం ఆ పార్టీ అభిమానులకు మాత్రం రుచించడం లేదు. బీజేపీలో చేరినా భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కమల్ నాథ్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా పలు గుళ్ల నిర్మాణం, ఇతర మతపరమైన కార్యక్రమాల నిర్వహణ ద్వారా తానూ హిందూత్వ వాదినే అని నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. అయినా ఓటర్లు ఆయన్ను నమ్మలేదు. అదే సమయంలో గత 20 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండటం, మధ్యలో ఏడాది పాటు తాను ప్రభుత్వాన్ని నడిపినా అది కూలిపోవడంతో కమల్ నాథ్ కూడా ఒంటరయ్యారు.












Click it and Unblock the Notifications