జార్ఖండ్ సంక్షోభంలో ట్విస్ట్-ఢిల్లీలో హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్-షాపింగ్ కోసమేనంటూ..
జార్ఖండ్ లో సొంతానికి గనులు కేటాయించుకున్న వ్యవహారంలో సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత కత్తి వేలాడుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి గవర్నర్ కు అనర్హత వేటు ప్రతిపాదన వచ్చిందని, ఆయన ఆమోదించి తిరిగి ఎన్నికల సంఘానికి పంపారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకూ సోరెన్ కు మాత్రం ఎలాంటి సమాచారం లేదు. దీంతో బీజేపీ ఎత్తుల్ని తిప్పికొట్టేందుకు జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి నెగ్గారు కూడా. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు బసంత్ సోరెన్ ఢిల్లీలో దర్శనమిచ్చారు.
జార్ఖండ్ అసెంబ్లీలో హేమంత్ సోరెన్ బలపరీక్ష నెగ్గిన అనంతరం ఇందులో పాల్గొన్న ఆయన సోదరుడు బసంత్ సోరెన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. హేమంత్ పై అనర్హత వేటు తప్పదన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన సోదరుడు బసంత్ ఢిల్లీ వెళ్లి ఉంటారన్న చర్చ కూడా జరుగుతోంది. దీనిపై జేఎంఎం ఎమ్మెల్యే కూడా అయిన బసంత్ సోరెన్ ను ప్రశ్నిస్తే ఢిల్లీలో బట్టలు కొనుక్కునేందుకు వెళ్లానంటూ షాకింగ్ సమాధానం ఇచ్చారు.
దీంతో మీడియా ప్రతినిధులు కూడా అవాక్కయ్యారు.

జేఎంఎం ఎమ్మెల్యే బసంత్ సోరెన్ "లోదుస్తులు కొనేందుకు ఢిల్లీ వెళ్లాను" అన్న వ్యాఖ్యలపై గొడ్డ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. "పేదలు, గిరిజనుల నాయకుడు శిబు సోరెన్, అంటే గురుజీ కుమారుడు, ఇప్పుడు దుమ్కా నుండి లోదుస్తులు కొనడానికి ఢిల్లీకి వచ్చారా?" అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో బసంత్ ఢిల్లీ టూర్ పై దుమారం రేగుతోంది. ఇంతకీ ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని తన అన్నకు మద్దతుగా ప్రసన్నం చేసుకునేందుకు వచ్చారా లేక బీజేపీతో కలిసి జేఎంఏంను ఏక్ నాథ్ షిండే తరహాలో చీల్చబోతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications