వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్ర ప్రదేశ్: బస్సులో చనిపోయిన వృద్ధుడు... శవాన్ని, భార్యను మధ్యలోనే దించేసిన ఆర్టీసీ సిబ్బంది: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

Click here to see the BBC interactive

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులో ఓ వృద్ధుడు చనిపోయారు. మృతదేహాన్ని, వృద్ధుడి భార్యను సిబ్బంది దారి మధ్యలోనే దించేశారని ఈనాడు దినపత్రిక వార్తాకథనం ప్రచురించింది.

ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో సోమవారం చోటుచేసుకుంది.

సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన దాసరి పైడయ్య (82), పైడమ్మ దంపతులు బుట్టలు అల్లుకుంటూ జీవిస్తున్నారు. వారిద్దరూ కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని పత్రిక రాసింది.

పలు ఆస్పత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో పార్వతీపురంలో నాటువైద్యం పొందేందుకు సోమవారం బస్సులో భార్యాభర్తలు బయల్దేరారు.

మార్గమధ్యంలో గుండెపోటుతో వృద్ధుడు చనిపోయాడు. దంపతులను బస్సు సిబ్బంది మధ్యలోనే బొబ్బిలి పెట్రోల్ బంక్ కూడలి వద్ద దించేసి వెళ్లిపోయారు.

ఉపాధ్యాయుడు కృష్ణదాస్, స్థానికులు కొందరు వారిని ఆటోలో స్వగ్రామానికి పంపించారని ఈనాడు రాసింది.

హైదరాబాద్‌ ఆర్ఆర్ఆర్ కేంద్రమే నిర్మిస్తుంది

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని కేంద్రం రెండు భాగాలుగా చేపట్టనుందని ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తాకథనం ప్రచురించింది.

హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను కేంద్రం నిర్మించనుందని, ఇందుకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేయనుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

రీజనల్‌ రింగ్‌ రోడ్డు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, తద్వారా, హైదరాబాద్‌ నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నట్లు పత్రిక రాసింది..

ఆర్‌ఆర్‌ఆర్‌లో భాగంగా చేపట్టాల్సిన సంగారెడ్డి - చౌటుప్పల్‌ సెక్షన్‌ను జాతీయ రహదారిగా నోటిఫై చేయాలని సోమవారం కిషన్‌ రెడ్డితోపాటు బీజేపీ నేతలు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు.

అనంతరం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ''ఆర్‌ఆర్‌ఆర్‌ను రెండు భాగాలుగా కేంద్రం చేపట్టనుంది. హైదరాబాద్‌కు ఉత్తర ప్రాంతంలో సంగారెడ్డి - నర్సాపూర్‌ - తూప్రాన్‌ - గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌ - యాదాద్రి - భువనగిరి - చౌటుప్పల్‌ వరకు 158 కిలోమీటర్లు నిర్మిస్తుంది. దీనికి ఎన్‌హెచ్‌ 161ఏఏ అనే నంబరు కూడా ఇచ్చింది" అన్నారు.

ఇక, హైదరాబాద్‌కు దక్షిణ ప్రాంతంలో చౌటుప్పల్‌ - ఇబ్రహీంపట్నం - కందుకూరు - షాద్‌నగర్‌ - చేవెళ్ల - శంకర్‌పల్లి - సంగారెడ్డి వర కు 182 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలిపారు.

భూసేకరణకయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు అంటే, రూ.1,905 కోట్లు భరించాల్సి ఉంటుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ పూర్తి చేస్తే మూడేళ్లలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని గడ్కరీ తమకు చెప్పారని ఆయన వెల్లడించినట్లు ఆంధ్రజ్యోతి రాసింది.

పోలవరంలోమరో కీలక ఘట్టం

పోలవరంలో మరో కీలక ఘట్టం

పోలవరం ప్రాజెక్టులో గేట్లకు కీలకమైన నిర్మాణ పనులు పనులు సోమవారం ప్రారంభమయ్యాయని సాక్షి వార్తాపత్రిక కథనం ప్రచురించింది.

పోలవరం స్పిల్‌ వే పనుల్లో మరో కీలక ఘట్టం మొదలైంది. స్పిల్‌ వే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లను అమర్చే ప్రక్రియను మేఘా సంస్థ సోమవారం ప్రారంభించింది.

ఈ హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లను జర్మనీకి చెందిన మాంట్‌ హైడ్రాలిక్‌ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. జర్మనీ నుంచి సంస్థ ఇంజనీర్లు పోలవరానికి చేరుకుని గేట్లకు సిలిండర్ల బిగింపు పనులను పర్యవేక్షిస్తున్నారని సాక్షి రాసింది.

పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 అడుగులు కాగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాక మిగులు జలాలను స్పిల్‌ వే ద్వారా దిగువకు విడుదల చేస్తారు.

1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజీకి గోదావరి నుంచి 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. గోదావరి చరిత్రలో ఇప్పటివరకూ వచ్చిన గరిష్ట వరద ప్రవాహం అదే.

పోలవరం జలాశయం భద్రత దృష్ట్యా గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌ వే నిర్మాణ డిజైన్లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించింది.

ఆ మేరకు 1,128 మీటర్ల పొడవున స్పిల్‌ వేను నిర్మిస్తున్నారు. స్పిల్‌ వే పిల్లర్లకు 25.72 అడుగుల నుంచి 45.72 అడుగుల మధ్య 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. ఇప్పటికే 29 గేట్లను అమర్చారు. ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుందని పత్రిక చెప్పింది.

పోలవరం ప్రాజెక్టులోకి నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాక వరదను దిగువకు విడుదల చేయాలంటే గేట్లను ఎత్తాలి. వరద ప్రవాహం తగ్గాక నీటిని గరిష్ట స్థాయిలో నిల్వ చేయాలంటే గేట్లను దించాలి.

ఇలా గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ఒక్కో గేటుకు కుడి వైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి చొప్పున రెండు హైడ్రాలిక్‌ సిలిండర్లను అమర్చాలి. తాజాగా ఈ పనులు ప్రారంభమయ్యాయని సాక్షి వివరించింది.

తెలంగాణలో దేశంలోనే తొలి సైబర్ వారియర్స్ నియామకం

తెలంగాణ పోలీసు శాఖ సైబర్ వారియర్స్‌ను నియమించినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

మానవ జీవితంలో డిజిటలైజేషన్‌ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో సైబర్‌ వారియర్స్‌ను నియమించినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్‌శాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారని పత్రిక రాసింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల నుంచి ఎంపిక చేసిన మొత్తం 1,988 మంది పోలీసులకు ఆన్‌లైన్‌లో వారంపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు.

ఈ మేరకు సోమవారం డీజీపీ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ద్వారా శిక్షణ తరగతులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అన్ని పోలీస్‌ స్టేషన్లలో విధులను ఇప్పటికే 17 వర్టికల్స్‌ (పని విభజన అంశాలు) చేశామని, సైబర్‌ నేరాలు 18వ అంశంగా ఉంటుందని సూచించారని నమస్తే తెలంగాణ చెప్పింది.

మారుమూల గ్రామాల్లో సైతం 4జీ మొబైల్‌ సేవలు విస్తరిస్తుండటంతో ప్రస్తుతం ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా నేరగాళ్లు సైబర్‌ మోసాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని తెలిపారు.

సైబర్‌ నేరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వివిధ రాష్ట్రాల పోలీస్‌ అధికారులతో ఐజీ రాజేశ్‌కుమార్‌ సమన్వయ అధికారిగా ఉంటారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా 'సైబర్‌ వారియర్స్‌' పుస్తకాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారని నమస్తే తెలంగాణ చెప్పింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Old man died in a bus,RTC personnel unloaded both the body and wife in the middle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X