ప్రధాని మోడీతో యాపిల్ సీఈవో భేటీ: థ్యాంక్సంటూ టిమ్ కుక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ దిగ్గజ సంస్థ యాపిల్ సీఈవో టిమ్‌కుక్(Tim Cook) బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వివిధ రంగాల్లో సాంకేతికత ప్రభావంతోపాటు దేశంలో పెట్టుబడులకు సంబంధించిన విషయాలను ప్రధానితో చర్చించారు. ఈ భేటీపై ఇరువురు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
వివిధ అంశాలతోపాటు భారత్‌లో సాంకేతికత పరంగా చోటు చేసుకుంటున్న మార్పులపై ఇద్దరం తమ అభిప్రాయాలను పంచుకున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రధాని మోడీకి టిమ్ కుక్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఘనస్వాగతం పలికినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

విద్యారంగం మొదలు అభివృద్ధి, తయారీ రంగంతోపాటు పర్యావరణం వరకు భారత భవిష్యత్తుపై సాంకేతికత సానుకూల ప్రభావం చూపుతుందనే విషయాన్ని మీతో పంచుకుంటున్నాం. మేం దేశ వ్యాప్తంగా విస్తరించడంతోపాటు పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని యాపిల్ సీఈవో టిమ్ కుక్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ప్రధాని మోడీ.. విభిన్న అంశాలతోపాటు భారత్‌లో సాంకేతిక పరంగా చోటు చేసుకుంటున్న మార్పులపై అభిప్రాయాలను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.
కాగా, భారతదేశంలో యాపిల్ సంస్థ తొలి సొంత రిటైల్ స్టోర్‌ను ఏప్రిల్ 18న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకోసం భారత పర్యటనకు వచ్చిన టిమ్ కుక్ ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో టిమ్ కుక్ నేరుగా వినియోగదారులకు స్వాగతం పలికారు. దేశంలో రెండో విక్రయ కేంద్రాన్ని ఏప్రిల్ 20న ఢిల్లీలో టిమ్ కుక్ ప్రారంభించనున్నారు.
An absolute delight to meet you, @tim_cook! Glad to exchange views on diverse topics and highlight the tech-powered transformations taking place in India. https://t.co/hetLIjEQEU
— Narendra Modi (@narendramodi) April 19, 2023
ముంబైలో ఏర్పాటు చేసిన యాపిల్ స్టోర్‌కు భారీ స్పందన వచ్చింది. స్టోర్ ప్రారంభం కాకముందు నుంచి పెద్ద ఎత్తున యాపిల్ అభిమానులు అక్కడకు చేరుకున్నారు. కొత్త యాపిల్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. యాపిల్ ఫోన్లుక మనదేశంలో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications