వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణాచల్ ప్రదేశ్‌: 'చైనా సైన్యం వాస్తవాధీన రేఖ మీదకు వచ్చింది.. మన సైన్యం తిప్పికొట్టింది'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చైనా

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో డిసెంబర్ 9న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని భారత సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు.

చైనాకు చెందిన పీఎల్ఏ దళాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోకి ప్రవేశించాయని, వారి చర్యలను తిప్పికొట్టామని భారత సైన్యం బీబీసీకి తెలిపింది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం(డిసెంబర్ 13) లోక్‌సభలో ఈ అంశంపై మాట్లాడారు.

"2022 డిసెంబర్ 9న, తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సేలో చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడింది. కానీ భారత సైన్యం వారిని అడ్డుకుంది. ఘర్షణలో రెండువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. మనవైపు సైనికులు ఎవరూ చనిపోలేదు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదు. భారత సైనిక కమాండర్లు సకాలంలో జోక్యం చేసుకోవడంతో, చైనా సైన్యం వెనక్కు మళ్లింది" అని రాజ్‌నాథ్‌ సింగ్‌ సభకు తెలిపారు.

"డిసెంబరు 9న, చైనాకు చెందిన పీఎల్ఏ దళాలు తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సే వద్ద వాస్తవాధీన రేఖను ఆక్రమించాయి. స్టేటస్ కో మార్చడానికి ప్రయత్నించాయి. మన దళాలు దీన్ని తిప్పికొట్టాయి. పీఎల్ఏ మన భూభాగంలోకి చొరబడకుండా నిలువరించాయి. వారిని వెనక్కు మళ్లేలా చేశాయి" అని రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.

ఈ ఘటన తరువాత డిసెంబర్ 11న ఏరియా స్థానిక కమాండర్ చైనా కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి, ఘటనపై చర్చించారని రక్షణ మంత్రి తెలిపారు.

"చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడిందన్న వాదనలను ఆ దేశం తిరస్కరించింది. సరిహద్దుల్లో శాంతిని కొనసాగించాలని చెప్పింది" అని ఆయన తెలిపారు.

అరుణాచల్‌ప్రదేశ్ తూర్పు లోక్‌సభ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ తపిర్ గావో మాట్లాడుతూ, భారత సైనికుల కంటే ఎక్కువ మంది చైనా సైనికులు గాయపడ్డారని చెప్పారు.

హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం ఉన్నంతకాలం మన భూభాగంలో ఒక అంగుళం భూమిని కూడా ఎవరూ ఆక్రమించలేరని అన్నారు.

"డిసెంబర్ 8-9 మధ్య రాత్రి (అరుణాచల్ ప్రదేశ్‌లో) మన భారత ఆర్మీ దళాలు చూపిన పరాక్రమాన్ని అభినందిస్తున్నాను" అని అమిత్ షా అన్నారు.

"తవాంగ్‌పై చైనా కన్నేసింది అనడంలో సందేహం లేదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి' అని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు.

భారతదేశం సరిహద్దులో పరిస్థితి స్థిరంగా ఉందని చైనా తెలిపినట్టు ఏఎఫ్‌పీ వార్తాసంస్థ వెల్లడించింది.

భారత్‌తో సైనిక, దౌత్య స్థాయిలలో చర్చలు జరుగుతున్నాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా ఎల్లప్పుడూ చెబుతూనే ఉంది.

అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా కన్ను

అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో 90,000 చదరపు కిలోమీటర్ల భూమి తమదేనని చైనా చెబుతోంది.

పశ్చిమాన అక్సాయి చిన్ ప్రాంతంలో 38,000 చదరపు కిలోమీటర్లను చైనా అక్రమంగా ఆక్రమించుకుందని భారతదేశం చెబుతోంది.

1962లో చైనా-భారత్ మధ్య యుద్ధం జరిగినప్పుడు చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లో సగానికి పైగా ఆక్రమించింది.

చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ ప్రకటించిన తర్వాత సైన్యం తిరిగి మెక్‌మోహన్ రేఖ నుంచి వెనక్కు వెళ్లిపోయింది.

అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదించిన చైనా, చివరికి 1962 యుద్ధం ముగిసిన తర్వాత, దాని నుంచి ఎందుకు వెనక్కు తగ్గిందనేది వ్యూహాత్మక అంశాల్లో నిపుణులకు కూడా అంతుపట్ట లేదు.

చైనా కావాలనుకుంటే, యుద్ధం తర్వాత సైన్యం ఆక్రమించిన ప్రాంతాన్నితమ దగ్గరే ఉంచుకోగలిగేది.

అయితే, అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని, దానిని తాము రాష్ట్రంగా గుర్తించేది లేదని చైనా ఎల్లప్పుడూ చెబుతూనే ఉంది.

భారత, చైనాల మధ్య 3,500 కి.మీ (2,174 మైళ్లు) పొడవైన సరిహద్దు ఉంది.

గల్వాన్ లోయ

గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణలు

లద్దాఖ్‌లోని గల్వాన్ వ్యాలీ ఘర్షణ తరువాత చైనా, భారత్ సైనికులు బాహాబాహీకి దిగడం మళ్లీ ఇదే.

ఇంతకుముందు లద్దాఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో 2020 జూన్ 15న రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.

అప్పుడు 20 మంది భారతీయ సైనికులు మృతి చెందగా, ఎంతోమంది గాయపడ్దారు. అయితే ఆ ఘర్షణలో చైనా సైనికులు కూడా భారీగానే చనిపోయారని భారత్ పేర్కొంది. కానీ, చైనా మాత్రం తమ సైనికులు కేవలం నలుగురే చనిపోయారని చెప్పింది.

2022 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాకు చెందిన వార్తాపత్రిక 'ది క్లాక్సన్’ విడుదల చేసిన ఇన్వెస్టిగేటివ్ నివేదికలో కనీసం 38 మంది పీఎల్ఏ సైనికులు చనిపోయారని పేర్కొంది.

గల్వాన్ ఘర్షణ తరువాత నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

గల్వాన్‌లో భారత్‌తో ఈ ఘర్షణకు దిగిన కమాండర్‌ను చైనా ఈ ఏడాది జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ సమావేశానికి అతిథిగా ఆహ్వానించింది.

గల్వాన్ లోయ

ఆ రోజు ఏం జరిగింది?

జూన్ 15 నాటి వివాదం ఒక తాత్కాలిక వంతెనపై చెలరేగిందని పరిశోధకులు నివేదికలో పేర్కొన్నారు.

మే 22న గల్వాన్ నదికి ఒక చివర భారత సైనికులు దీనిని నిర్మించారు. పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత, చైనా సైనిక అధికారులు 'బఫర్ జోన్'కు అంగీకరించారు.

అయినప్పటికీ, ఆ ప్రాంతంలో చైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తోందని, గుడారాలు వేసి తమ ఆయుధాలను తీసుకొస్తోందని భారత్ పేర్కొంది.

"ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక వీబో యూజర్ చెప్పిన వివరాల ప్రకారం, పీఎల్ఏ బఫర్ జోన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టింది. తన పెట్రోలింగ్ జోన్ పరిధిని విస్తరిస్తూ వచ్చింది.

చైనా సైనికుల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వీలుగా మే 22న కల్నల్ సంతోష్ నాయకత్వంలో భారత సైన్యం ఒక తాత్కాలిక వంతెనను నిర్మించింది.

స్వయంగా చైనా బఫర్ జోన్‌లో మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టింది. కానీ, భారత సైన్యం వంతెన నిర్మించేసరికి పీఎల్ఏ తీవ్రంగా ప్రతిఘటించింది" అని క్లాక్సన్ నివేదికలో వెల్లడించారు.

గల్వాన్ లోయ

'చైనా ఒప్పందాన్ని ఉల్లంఘించింది'

నివేదిక ప్రకారం, జూన్ 6 న 80 మంది చైనా సైనికులు వంతెనను ధ్వంసం చేయడానికి వచ్చారు. 100 మంది భారత సైనికులు దాన్ని రక్షించేందుకు పూనుకున్నారు.

జూన్ 6 నాటి ప్రతిష్టంభన తరువాత, బఫర్ జోన్‌ దాటి వచ్చిన సైనికులందరినీ వెనక్కు పిలిపించేందుకు ఇరు దేశాల అధికారులూ అంగీకరించారు. కానీ చైనా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

చైనా తమ కార్యక్రమాలు ఆపలేదు. దాంతో, భారత సైన్యం నిర్మించిన వంతెన ధ్వంసం అయింది.

జూన్ 15న కల్నల్ సంతోష్ సహా భారత సైన్యం గల్వాన్ లోయలో ఘటనా స్థలికి చేరుకుంది. చైనా ఆక్రమణను తొలగించడానికి ప్రయత్నించింది.

అప్పటికే సుమారు 150 మంది చైనా సైనికులు అక్కడ మోహరించారు. చర్చలకు బదులుగా, పీఎల్ఏ కల్నల్ తన సైనికులను యుద్ధానికి సిద్ధం కమ్మని ఆదేశించారు.

"గల్వాన్ డీకోడెడ్" అని పిలిచే ఈ నివేదికలో భారత, చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ గురించి విస్తృతమైన సమాచారాన్ని అందించారు.

నాలుగు దశాబ్దాల తరువాత తీవ్ర ఘర్షణ

గత నాలుగు దశాబ్దాలలో భారత, చైనా సరిహద్దులో రేకెత్తిన అత్యంత తీవ్రమైన సంఘర్షణగా 2020 గల్వాన్ ఘర్షణలను పేర్కొన్నారు.

ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయారు. తమ వైపు నష్టాన్ని భారత్ ప్రకటించింది. చైనా మాత్రం ఆ వివరాలు స్పష్టం తెలుపలేదు. అయితే, చైనాకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని భారత్ పేర్కొంది.

గల్వాన్ వివాదం తరువాత ఇరు దేశాల ప్రతినిధుల మధ్య దశలవారీగా చర్చలు జరిగాయి. 2021 ఫిబ్రవరిలో ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సమావేశం తరువాత డిసెంగేజ్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది.

ఇప్పటివరకు రెండు దేశాల మధ్య అనేక రౌండ్ల సైనిక చర్చలు జరిగినా, పెద్దగా ఫలితం రాలేదు.

మళ్లీ డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది.

ఇవి కూడా చదవండి:

English summary
Arunachal Pradesh: 'Chinese army came on LAC... our army repulsed'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X