Arvind Kejriwal: ఢిల్లీలో మళ్లీ ఎన్నికలకు కేజ్రీ డిమాండ్-బీజేపీకి 10 సీట్లొస్తే..!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ తో ఊపుమీదున్న మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) బీజేపీపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, అందులో బీజేపీ 10 సీట్లు సాధిస్తే తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తానని సవాల్ విసిరారు. మద్యం కేసులో కోర్టు తీర్పు తర్వాత మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నేతలతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఢిల్లీ కోర్టు తీర్పు తర్వాత మాట్లాడిన అరవింద్ కేజ్రివాల్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గత ఫిబ్రవరిలో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఢిల్లీ నష్టపోయిందన్నారు. మొత్తం ఢిల్లీ నాశనం అయ్యిందన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా అధికార దాహాన్ని 3 కోట్ల మంది ఢిల్లీ ప్రజలు భరించారని ఆయన తెలిపారు. వెళ్లి ఢిల్లీ ప్రజలను అడగాలని మోడీని సవాల్ చేశారు.

మీకు ధైర్యం ఉంటే, ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించండి, మీకు పది కంటే ఎక్కువ సీట్లు వస్తే, నేను రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. ఢిల్లీ ప్రజలు మీతో విసుగు చెందారన్నారు. తన కేసు స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద రాజకీయ కుట్రగా కేజ్రివాల్ అభివర్ణించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో అధికారం నుండి తొలగించడానికి బీజేపీ ఈ కుట్ర చేసిందన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా విధ్వంసం చేయడానికి, ఇతరులను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించే కంటే దేశ ప్రయోజనాల కోసం పనిచేయడంపై దృష్టి పెట్టాలని కేజ్రీవాల్ సూచించారు.












Click it and Unblock the Notifications