లెఫ్టినెంట్ గవర్నర్‌తో భేటీ: గడువు కోరిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడానికి పది రోజుల గడువు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు. ఆయన శనివారం ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తూ కాంగ్రెసు పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు శుక్రవారం లేఖ సమర్పించింది. బేషరతుగా మద్దతు ఇవ్వడానికి బిజెపి కూడా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిశారు.
కాంగ్రెసు, బిజెపి తమకు బేషరతుగా మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం పట్ల కేజ్రీవాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని వెనక మతలబు ఏమిటనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. అలా ముందుకు వచ్చాయంటే ఏదో ఒకటి ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయంపై తాము బిజెపి, కాంగ్రెసు అధ్యక్షులకు లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తమకు ఎందుకు మద్దతు ఇస్తానంటున్నాయో బిజెపి, కాంగ్రెసు పార్టీలు చెప్పాలని ఆయన కోరారు. బేషరతుగా మద్దతు ఇవ్పమనేది రాజకీయాల్లో ఉండదని ఆయన అన్నారు. జన్ లోక్‌పల్ బిల్లుకు సంబంధించిన క్లిష్టమైన అంశాలపై ఆ రెండు పార్టీలు మద్దతు ఇవ్వగలవా అని ఆయన అడిగారు. ఢిల్లీలోని నీటి మాఫియాను అరికడితే అడ్డంకులు కల్పించకుండా ఆ పార్టీలు ఉండగలవా అని కూడా ఆయన అడిగారు. గత 15 ఏళ్ల కాంగ్రెసు పాలనపై విచారణకు అంగీకరిస్తారా అని అయన ప్రశ్నించారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు గెలుచుకుంది. 70 సీట్లు గల ఢిల్లీ శాసనసభలో బిజెపి 31 సీట్లను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. తమను ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ అహ్వానించినప్పుడు తమకు ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలం లేదని బిజెపి చెప్పేసింది.












Click it and Unblock the Notifications