కేజ్రీవాల్ క్యాబినెట్ నుంచి మరో మంత్రి ఔట్
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ క్యాబినెట్ నుంచి ఆహార శాఖ మంత్రి అసీంఖాన్ ఉద్వాసనకు గురయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో అసీంఖాన్‌ను తొలగించినట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. ఓ బిల్డర్ నుంచి రూ. 6 లక్షలు లంచం తీసుకుంటూ అసీంఖాన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
అవినీతి విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అసీంఖాన్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. అహ్మద్ ఖాన్ స్థానంలో నూతన ఆహార శాఖ మంత్రిగా ఇమ్రాన్ హుస్సేన్ నియమితులయ్యారు.

ఢిల్లీలో రెండోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు నాయకులు, మంత్రులు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. న్యాయశాఖ మంత్రులుగా పనిచేసిన సోమనాథ్ భారతి, జితేందర్ సింగ్ తోమర్ కేసుల్లో ఇరుక్కున్నారు. సోమనాథ్ భారతి గృహహింస కేసులో ఇరుక్కోగా, తోమర్ నకిలీ డిగ్రీ కేసులో చిక్కుకున్నారు.
తన మంత్రి అవినీతికి పాల్పడినా సహించేది లేదని, అవినీతిని సహించబోమనే విషయాన్ని ఆసిం ఖాన్ ఉద్వాసన ద్వారా ప్రజలకు సంకేతాలు ఇవ్వదలుచుకున్నామని, ప్రతి ఒక్కరికీ బెంచ్ మార్కును నిర్దేశించామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.












Click it and Unblock the Notifications