ఆ మూడు బిజెపివే: కేజ్రీవాల్ ఫస్ట్, నరేంద్ర మోడీ సెకండ్
న్యూఢిల్లీ: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు సర్వేలు ప్రజల నాడిని పట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. చాలా సర్వేల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రజలు ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారని తేలుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రేసులో ఉన్నారు.
రానున్న లోకసభ ఎన్నికల్లో బిజెపి గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విజయకేతనం ఎగురవేయనుందని సిఎన్ఎన్-ఐబిఎన్ సర్వేలో తేలింది. 48 ఎంపీ సీట్లున్న మహారాష్ట్రలో కూడా బిజెపి, తన మిత్రపక్షం శివసేనతో కలిసి ముందంజలో ఉంటుందని, ఈ రెండు పార్టీలు కలిసి 25 నుండి 33 సీట్ల వరకు గెలుచుకోవచ్చునని సర్వే తెలిపింది. కాంగ్రెస్ - ఎన్సీపి కూటమి 12-20 సీట్లు గెలుచుకుంటుంది.

29 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్‌లో బిజెపి 23 నుండి 27, కాంగ్రెసు రెండు నుండి ఐదు సీట్లు గెలుచుకోనుంది. 26 లోకసభ స్థానాలున్న గుజరాత్‌లో బిజెపి 20 నుండి 25 స్థానాల్లో, కాంగ్రెసు ఒకటి నుండి నాలుగు స్థానాల్లో గెలుస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు యాభై శాతం ఓట్లు బిజెపికే పడతాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో ప్రధాని అభ్యర్థఇగా మోడీ మొదటి స్థానంలో ఉన్నారు.
మరోవైపు ఇండియా టుడే గ్రూప్- సి వోటరు సర్వేలో హానెస్ట్ రాజకీయ నాయకుడి లిస్టులో అరవింద్ కేజ్రీవాల్ ముందు స్థానంలో ఉన్నారు. నరేంద్ర మోడీ ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్సేతర, బిజెపియేతర ప్రధానమంత్రి అభ్యర్థులలో మిగతా వారికంటే కేజ్రీవాల్ ముందు స్థానంలో ఉన్నారు. ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేజ్రీవాల్ పార్టీకి ఎనిమిది శాతం ఓట్లు వస్తాయట.












Click it and Unblock the Notifications