ఆర్యన్ ఖాన్ అప్పటివరకు జైల్లోనే, ఎన్‌సిబి అఫిడవిట్ దాఖలు తర్వాతే బెయిల్ పిటిషన్ విచారణ: ముంబై కోర్టు
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై బుధవారంలోగా కోర్టుకు సమాధానం ఇవ్వాలని ముంబై కోర్టు ఆదేశించింది. బుధవారం ఉదయం 11 గంటలలోపు ఎన్‌సిబి తన సమాధానాన్ని దాఖలు చేయాలని ఆదేశించగా, ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ అదే రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు జరగాల్సి ఉందని ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది సతీష్ మానషిండే సోమవారం వెల్లడించారు.

ముంబై కోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ కేసు విచారణ
ఇదిలా ఉండగా, ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్, కేసు తదుపరి విచారణ జరిగే వరకు జైల్లోనే ఉండనున్నారు. విచారణ సమయంలో, ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది ఎన్‌సిబి సోమవారం మధ్యాహ్నం లేదా మంగళవారం ఉదయం లోపు తన జవాబును దాఖలు చేయాలని, తద్వారా వీలైనంత త్వరగా ఈ కేసులో విచారణ జరగాలని ధర్మాసనం ముందు వాదించారు. అయితే, నివేదికను సమర్పించడానికి దర్యాప్తు సంస్థ ఒక వారం సమయం కోరింది.

ఆర్యన్ ఖాన్ కేసులో అఫిడవిట్ దాఖలుకు సమయం కోరిన ఎన్సీబీ
ఎన్‌సిబికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎఎమ్ చిమల్కర్, విచారణ ఇంకా కొనసాగుతున్నందున, ఆధారాలు సేకరిస్తున్నందున, ఏజెన్సీ తన ప్రతిస్పందనను దాఖలు చేయడానికి ఒక వారం సమయం అవసరమని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఏజెన్సీ గురువారం నాటికి అఫిడవిట్ దాఖలు చెయ్యగలదని ఆయన వెల్లడించారు. ఎన్‌సిబి తరఫున హాజరైన ఎస్‌పిపి అద్వైత్ సేథ్నా కూడా ఈ విషయంలో అత్యవసరం లేదని వాదించారు. సాధారణంగా వారం సమయం ఇవ్వాలని, కానీ రెండు రోజుల సమయాన్నే కోరారని, ఎన్‌సిబి అధికారులు రోబోలు కాదని సేథ్నా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ళారు.

బెయిల్ ఇవ్వాలని బలంగా వాదనలు వినిపించిన ఆర్యన్ ఖాన్ న్యాయవాది
ఇంతలో, ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది ఆర్యన్ ఖాన్ నుండి చట్టవిరుద్ధమైన వస్తువులు కానీ, డ్రగ్స్ కానీ ఏమీ లభించలేదని, బెయిల్ మంజూరు చేయడం వలన ఎన్‌సిబి తదుపరి విచారణ చేయకుండా ఎలాంటి ఇబ్బంది తలెత్తదు అని వాదించారు. బెయిల్ ఇచ్చినంత మాత్రాన దర్యాప్తును అది ఆపలేదన్నారు. ఇప్పటివరకు, ఆర్యన్ ఖాన్ 7 రోజులు నిర్బంధంలో ఉన్నాడని వెల్లడించారు. ఇప్పటికైనా బెయిల్ మంజూరు చెయ్యాలని వాదించారు. ఇరుపక్షాల వాదనల తరువాత, న్యాయమూర్తి వివి పాటిల్ బుధవారం విచారణకు అంగీకరించారు. అఫిడవిట్‌పై ఎన్‌సిబి ఉదయం 11 గంటలకు సమాధానం ఇస్తుందని మరియు మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణ జరుగుతుందని ముంబై కోర్టు ఆదేశించింది.

ఆర్యన్ ఖాన్ కోసం తల్లడిల్లుతున్న షారూక్ కుటుంబం
ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ విషయంలో కావాలని కేంద్ర సర్కార్ ఇదంతా చేస్తుందని, కేంద్ర దర్యాప్తు సంస్థల వెనుక కేంద్రం హస్తం ఉందని ఆరోపణలు వెల్లువగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే కొడుకుకు బెయిల్ రాకపోవటంతో గౌరీఖాన్ ఏడుస్తున్నారని, షారూక్ ఖాన్ భోజనం చెయ్యటం లేదని, నిద్రపోవటం లేదని సమాచారం. బాలీవుడ్ వర్గాలు, షారూక్ ఖాన్ ఫ్యాన్స్ ఆర్యన్ ఖాన్ నేరస్తుడు కాదని, షారూక్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

ఆర్యన్ ఖాన్ కు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
ఎన్పీడీఎస్ చట్టంలోని సెక్షన్ 8 (c), 20 (b), 27, 28, 29 మరియు 35 కింద ఆర్యన్ ఖాన్ మరియు ఇతరులపై నేరారోపణలు నమోదయ్యాయి. అక్టోబర్ 7 న, ఆర్యన్ జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయబడ్డాడు. తర్వాత ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ని మేజిస్ట్రేట్ కోర్టు అక్టోబర్ 8 న తిరస్కరించింది. ఆర్యన్ ఖాన్ ను శుక్రవారం ఆర్థర్ రోడ్ జైలుకు పంపారు. అతనితో పాటు, ఈ కేసులో అరెస్టయిన మరో ఐదుగురిని కూడా అదే జైలుకు పంపించగా, మున్మున్ దమేచాతో సహా ఇద్దరు మహిళలను బైకుల్లా మహిళా జైలుకు పంపినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.












Click it and Unblock the Notifications