వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియా కప్ 2022: భారత-పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య వెల్లివిరిసిన స్నేహభావం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఎట్టకేలకు ఆసియా కప్ మొదలైంది. పలుమార్లు షెడ్యూల్‌ మారిన తరువాత శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ టోర్నీ ప్రారంభమైంది. దుబయి, షార్జా మైదానాలు ఆట కోసం సిద్ధమయ్యాయి.

ఈ ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్, అఫ్గానిస్తాన్ జట్లు పాల్గొంటున్నాయి. ఆగస్టు 27న అఫ్గానిస్తాన్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది. సెప్టెంబర్ 11న ఫైనల్స్ జరుగుతాయి.

ఆగస్టు 28న జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఏడాది తర్వాత ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాల వేడి క్రికెట్‌లో కూడా కనిపిస్తోంది.

బహుశా అందుకే, రెండు దేశాల ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను, ఇందులో గెలుపు ఓటములను విభిన్న కోణంలోంచి చూస్తున్నారు.

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు యూఏఈకి చేరుకుంది. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కోసం అన్ని జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

షాహీన్ షా అఫ్రిదితో షేక్ హ్యాండ్

క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆదివారం నాటి మ్యాచ్‌కు ముందు, మైదానం వెలుపల క్రీడాస్ఫూర్తికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది.

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది కాలికి గాయం కావడంతో ఆసియా కప్‌లో ఆడలేకపోతున్నాడు.

కాలికి ఉన్న బ్రేసెస్‌తో షాహీన్ మైదానం బయట కూర్చుని ఉన్నాడు. తన చేతిలో మొబైల్ ఫోన్ ఉంది.

భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రాగానే చేయెత్తి హాయ్ చెప్పాడు. చాహల్ దగ్గరకు రాగానే, బ్రేసెస్ సాయంతో లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

తరువాత, ఇద్దరు ఆటగాళ్లు పరస్పరం యోగక్షేమాలు కనుక్కున్నారు.

చాహల్, షాహీన్ గాయం గురించి అడిగాడు. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో, ఎప్పుడు మళ్లీ క్రికెట్ ఆడగలడో షాహీన్ వివరించాడు.

మరోసారి ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, బాయ్ చెప్పుకున్నారు.

కోహ్లీ షాహీన్‌ను కలిసినప్పుడు..

భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అప్పుడే అక్కడకు చేరుకున్నాడు. షాహీన్ దగ్గరకు వెళ్లి కరచాలనం చేశాడు. కోహ్లీ చెవుల్లో ఇయర్ ఫోన్లు ఉన్నాయి. కుడి చెవిలో ఇయర్ ఫోన్ బయటకు తీయగానే, మ్యూజిక్ బిగ్గరగా వినిపించింది. ఇద్దరూ నవ్వుకున్నారు.

ఈ వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, క్రికెట్ మైదానం సైడ్‌లైన్స్‌లో కొన్ని హై ప్రొఫైల్ సమావేశాలు జరిగాయి అంటూ రాసింది.

వాళ్లిద్దరి మధ్య ఏం మాటలు జరిగాయో తెలీదుగానీ, కోహ్లీ షాహీన్‌ను కాలి గాయం గురించి అడిగినట్టు తెలుస్తోంది.

ఆటగాళ్లిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. క్రీడాస్ఫూర్తికి ఉత్తమ ఉదాహరణ అక్కడ కనిపించింది.

కోహ్లీ 'టేక్ కేర్' అంటూ అఫ్రిదికి షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకు సాగాడు.

పంత్ బ్యాటింగ్‌కు ప్రశంసలు

వీడియోలో ఒక ఫ్లాష్ వచ్చింది. ఆ తరువాత భారత్‌ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ షాహీన్ దగ్గరకు వచ్చాడు.

"అరే, నేను కూడా మీలాగే బ్యాటింగ్ మొదలెట్టాలనుకున్నా.. ఒంటి చేత్తో సిక్సర్లు కొట్టేద్దామనుకున్నా" అన్నాడు షాహీన్.

దానికి పంత్, "ఫాస్ట్ బౌలర్‌కు ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది సార్!" అన్నాడు.

తరువాత పంత్, షాహీన్ గాయం గురించి అడిగాడు. కోలుకోవడానికి అయిదు వారాలు పడుతుందని షాహీన్ చెప్పాడు.

పంత్‌కు షాహీన్ గుడ్ లక్ చెప్పాడు. మ్యాచ్ చూడడానికి వస్తానన్నాడు. ఇద్దరూ బాయ్ చెప్పుకొన్నారు.

షాహీన్ మెల్లగా నడిచి వెళ్తుంటే, భారత జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ ఎదురుపడ్డాడు. ఇద్దరూ పలకరించుకుని క్షేమసమాచారాలు కనుక్కున్నారు.

మైదానం వెలుపల షాహీన్ అఫ్రిదీ భారత జట్టు ఆటగాళ్లను పలకరించిన వీడియో వైరల్ అయింది.

పీసీబీ దీన్ని 'గుడ్‌విల్ గెశ్చర్' అంటే ఆటగాళ్ల మధ్య సుహృద్భావం పేరుతో షేర్ చేసింది.

రెండు జట్ల మధ్య ఇక్కడ కనిపించిన సుహృద్భావం, స్నేహం.. మైదానంలో ఎవరు, ఎవరిని ఓడించినా వీరి మధ్య క్రీడాస్ఫూర్తి ఉన్నత స్థాయిలో ఉందని నిరూపిస్తోంది.

ఆగస్టు 28న జరగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్పీత్ బూమ్రా కూడా ఆడట్లేదు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రికవర్ అవుతున్నాడు.

https://twitter.com/TheRealPCB/status/1562861976602247168

షాహీన్ షా అఫ్రిది ఫాస్ట్ బౌలింగ్..

షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో భారత బ్యాట్స్‌మెన్ ఊపిరి పీల్చుకుంటారని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ ఇటీవల వ్యాఖ్యానించాడు.

దానికి కారణం ఇరు జట్ల మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్. గత ఏడాది అక్టోబర్ 24న దుబయిలోనే ఈ మ్యాచ్ జరిగింది. బహుశా భారత్ ఈమ్యాచ్ గుర్తుంచుకోవాలనుకోదు.

ఈ మ్యాచ్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది భారత బ్యాటింగ్ వెన్ను విరిచాడు.

మ్యాచ్ తొలి ఓవర్‌లో షాహీన్ వేసిననాలుగో బంతికే భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. షాహీన్, తన రెండో ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ను బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. టీ20 క్రికెట్‌లోని అత్యుత్తమ బంతుల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు.

ఆ తరువాత, విరాట్ కోహ్లీ కూడా షాహీన్ బంతికే వెనుదిరిగాడు.

తాను వేసిన నాలుగు ఓవర్లలో భారత జట్టుకు కోలుకునే అవకాశమే ఇవ్వలేదు షాహీన్. మొత్తం నాలుగు ఓవర్లలో 31 పరుగులిచ్చి మూడు విలువైన వికెట్లు పడగొట్టాడు.

భారత్ 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. పాకిస్తాన్ సులువుగా ఈ లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ జట్టు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (79), కెప్టెన్ బాబర్ ఆజం (68) బ్యాట్ ఝళిపించి జట్టును గెలిపించారు.

ఈ మ్యాచ్‌కు ముందు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పరుగుల వరద కురిపిస్తారని అభిమానులు ఊహించారు.

కోహ్లీ (57) తప్ప భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ షాహీన్ బౌలింగ్‌కు ఎదురు నిలవలేకపోయారు.

అద్భుతమైన బౌలింగ్‌ చేసిన షాహీన్ షా ఆఫ్రిదికి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీకి ఈ ఆసియా కప్ ఎందుకంత ముఖ్యం?

కొంతకాలంగా ఫామ్‌తో సతమతమవుతున్న కోహ్లీకి ఈ ఆసియా కప్ చాలా ముఖ్యం.

కోహ్లీపై బాగా ఒత్తిడి ఉంది.

2019 నవంబర్ తరువాత ఏ ఫార్మాట్‌లోనూ కోహ్లీ సెంచరీ చేయలేదు.

టోర్నీ ఎలా జరగనుంది?

మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి.

గ్రూప్-బీలో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి.

రెండూ గ్రూపులూ, తమ తమ గ్రూపు జట్లతో తలపడతాయి.

రెండు గ్రూపుల్లో టాప్ రెండు జట్లు సూపర్ ఫోర్‌కు చేరుకుంటాయి. వీటిల్లోంచి రెండు జట్లు ఫైనల్స్‌కు వెళతాయి.

సెప్టెంబర్ 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Asia Cup 2022: The camaraderie between India-Pakistan players
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X