Asia Cup 2023: భారత్ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ కు భారీ షాక్- పీసీబీపై విమర్శల వెల్లువ..
ఆసియా కప్ 2023లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రంగం సిద్దమవుతోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంకలోని పల్లెకెలే వేదికగా జరిగే ఈ దాయాదుల పోరుకు ముందు పాకిస్తాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే జట్టులో క్రికెటర్ గాయాలతో వైదొలగడమో లేక మరో విషయం మాత్రం కాదు. ఏకంగా పాకిస్తాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడేలా ఈ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ వ్యవహారంపై మండిపడుతోంది.
ఆసియా కప్ 2023లో పాల్గొనే జట్ల కోసం తయారు చేసిన జెర్సీలలో ఆతిథ్య పాకిస్థాన్ పేరు మిస్సయింది. దీంతో ఆసియాకప్ లో ఇది పెను దుమారం రేపుతోంది. ఆగస్ట్ 30న ముల్తాన్‌లో పాకిస్థాన్‌తో నేపాల్ ఆడిన తొలి లీగ్ మ్యాచ్ తో టోర్నమెంట్ ప్రారంభమైంది. నేపాల్ జట్టుపై పాకిస్థాన్ భారీ విజయాన్ని నమోదు చేసిన సందర్భంలో ఆ దేశానికి చెందిన పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు దృష్టి జెర్సీలపై పడింది. పాకిస్తాన్ జట్టు జెర్సీల కుడి వైపున ఆసియా కప్ లోగో కనిపించింది. కానీ పాకిస్తాన్ పేరు మాత్రం కనిపించలేదు.

పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ల జెర్సీలపై ఆసియా కప్ లోగో మాత్రమే ఉంది. ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరు లేదు. బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లోనూ ఇదే విషయం వెలుగు చూసింది. వారి జెర్సీలలో కూడా ఆతిథ్య దేశం పేరు లేదు.భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల జెర్సీల చిత్రాలు వైరల్‌గా మారడంతో అభిమానులు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూఏఈలో జరిగిన గత ఆసియాకప్ ఎడిషన్‌లో ఆసియా కప్ లోగో క్రింద శ్రీలంక పేరు ఉందని, కానీ ఇప్పుడు ఎందుకు లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఏడాది ఆసియాకప్ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో ఆడుతున్నప్పటికీ పాకిస్తాన్ అధికారిక ఆతిధ్య జట్టుగా ఉంది. శ్రీలంక సహ ఆతిధ్య దేశంగా మాత్రమే ఉంది. దీంతో మిగతా జట్లకు ఎలా ఉన్నా పాకిస్తాన్ కు మాత్రం ఇది తల తీసేసినట్లుందట. తమ ఆటగాళ్లకు ఇచ్చిన జెర్సీలపై పాకిస్తాన్ పేరు లేకపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్, మొహ్సిన్ ఖాన్, మరికొందరు ఆటగాళ్లు పీసీబీపైనా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ పైనా మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications