కాంగ్రెస్ ముక్త్ ఉత్తరాది ? బీజేపీ ముక్త్ దక్షిణాది ? ఫలితాలతో దేశంలో రాజకీయ ముఖచిత్రమిదే..!
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తప్పని నిరూపిస్తున్నాయి. తెలంగాణ, రాజస్తాన్ లో మాత్రమే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతుండగా.. ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో బీజేపీ హవా కొనసాగుతోంది. దీంతో ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ రహిత ఉత్తరాది, బీజేపీ రహిత దక్షిణాదిగా పరిస్ధితి మారబోతోంది.
ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగుతోంది. రేపు మిజోరం ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగబోతోంది. అయితే ఇవాళ జరుగుతున్న నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారం సాధించేలా కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాలు ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారం సాధించే దిశగా అడుగులేస్తోంది.

ఇదే ట్రెండ్స్ కొనసాగితే ఉత్తరాదిన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలు రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ బీజేపీ వశమవుతాయి. దీంతో ఉత్తరాదిన కాంగ్రెస్ పార్టీ దాదాపు మాయమైనట్లే. అదే సమయంలో ఉత్తరాదిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆధిపత్యం మరింత పెరగబోతోంది. సొంతంగా లేదా మిత్రపక్షాలతో కలిసి ఉత్తరాదిలో రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ అధికారంలో ఉండబోతోంది. ఇది వచ్చే లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీకి గుడ్ న్యూస్ కానుంది.
మరోవైపు దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటకను ఈ మధ్యే కోల్పోయిన బీజేపీ ఈసారి తెలంగాణలోనూ పూర్తిగా విఫలం కావడంతో ఇక దక్షిణాదిపై ఆ పార్టీకి ఉన్న ఆశలు కాస్తా ఆవిరయ్యాయి. ఇక దక్షిణాదిలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేనని తేలిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్నాటకలో సొంతంగానూ, తమిళనాడులో డీఎంకే మిత్రపక్షంగా అధికార భాగస్వామిగా ఉండబోతోంది. దీంతో బీజేపీ ముక్త్ దక్షిణాదిలో కాంగ్రెస్ హవా కొనసాగనుంది.












Click it and Unblock the Notifications